స్వేచ్ఛ.. ఎంత వరకూ

పిల్లలకు స్వేచ్ఛ చాలా అవసరం అంటున్నారు పరిశోధకులు. అప్పుడే వారి ఎదుగుదలలో పురోగతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశంపై చేసిన ఓ అధ్యయనం చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. చిన్నప్పటి నుంచి అలా ఇస్తే ఎలా అంటున్నారా? దానికీ కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు...

Published : 18 Aug 2022 01:24 IST

పిల్లలకు స్వేచ్ఛ చాలా అవసరం అంటున్నారు పరిశోధకులు. అప్పుడే వారి ఎదుగుదలలో పురోగతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశంపై చేసిన ఓ అధ్యయనం చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. చిన్నప్పటి నుంచి అలా ఇస్తే ఎలా అంటున్నారా? దానికీ కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు...

చిన్నారులకు స్వేచ్ఛనివ్వాలి అంటే అది ఎంత వరకు అనే ప్రశ్న తల్లిదండ్రుల్లో మొదలవుతుంది.  అది వారి వయసుబట్టి మారుతుంటుందంటున్నారు నిపుణులు. పిల్లల మానసిక ఎదుగుదల, కుటుంబ ప్రోత్సాహం వంటి అంశాలన్నీ ఇందులో ప్రధానమవుతాయి. స్వేచ్ఛను గతంలో ఎలా వినియోగించుకున్నారన్నదీ ముఖ్యమే. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఎంత వరకు స్వేచ్ఛ ఇవ్వాలి అనేది నిర్ణయించుకోవాలి.

వయసు.. ఈ విషయంలో వయసుది ప్రధానపాత్ర. స్వేచ్ఛనిస్తే పిల్లలు ప్రతి విషయంలో స్వీయ అనుభవాన్ని పొంది, కొత్తపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకే యుక్తవయసు సరైన సమయం. కెరియర్‌ను ఎంచుకునేటప్పుడు వారి అభిప్రాయాన్ని, ఆసక్తిని గుర్తించి స్వేచ్ఛనిస్తే మరింత ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. అయితే వారి నిర్ణయంలో కష్టనష్టాలను విడమరచి చెప్పాల్సిన బాధ్యత పెద్దవాళ్లదే. అప్పుడే పిల్లలు తమ అభిప్రాయం ఎంతవరకు సరైనదో ఆలోచించుకుని, అవగాహన పెంచుకొనే అవకాశం కలుగుతుంది.

హద్దులు... స్వేచ్ఛనిస్తూనే.. కొన్ని నియమ నిబంధనలు, హద్దులుంచాలి. ప్రయోగాత్మకంగా అడుగుపెట్టి, తప్పులు చేయకుండా, ఆ నియమాలు వారి ప్రయాణాన్ని సురక్షితంగా సాగేలా చేయగలగాలి. ఒకవేళ వారు విఫలమై తిరిగొచ్చినా, దాన్ని అవకాశంగా తీసుకొని ఇక సంకెళ్లు వేసి కట్టడి చేయకూడదు. ఆ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల ఆసరాతో తిరిగి ప్రయాణించేలా వెన్నుతట్టాలి. అప్పుడే పట్టుదలగా లక్ష్యాన్ని చేరడానికి కృషి చేస్తారు.
నమ్మకం.. స్వేచ్ఛనిచ్చి, గమనిస్తూ ఉండాలే తప్ప... ప్రతి క్షణం నిఘా వేయడం కానీ, ప్రతికూలంగా ప్రవర్తించడం కానీ కూడదు. వారిపై అమ్మానాన్నలకు నమ్మకం, భరోసా ఉండాలి. అదే వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పెద్దవాళ్లు తమపై నమ్మకం ఉంచారనే ఆలోచన వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. అప్పటికీ పిల్లల ప్రయత్నం విఫలమైనా... నిందించకూడదు. తాము పూర్తి చేసిన లేదా చేయలేకపోయిన పనికి పూర్తి బాధ్యత తీసుకునేలా నేర్పాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని