అమ్మా అని పిలిపించుకోవడానికి ఆరేళ్లు ఎదురుచూశా...

ఆమె ఇంటి దరిదాపులకే ఎవరూ వచ్చేవారు కాదు. పిచ్చి కుటుంబమని ముద్రవేశారు. ఒంటరి బాల్యం, అత్తింట బానిసత్వం అనుభవించిన ఆమె కన్నకొడుకుతో అమ్మా అని పిలిపించుకోవడానికి ఆరేళ్లు ఆగింది. కొడుకును జిమ్‌లో చేర్చిన ఆమె, అక్కడే

Published : 19 Aug 2022 00:53 IST

ఆమె ఇంటి దరిదాపులకే ఎవరూ వచ్చేవారు కాదు. పిచ్చి కుటుంబమని ముద్రవేశారు. ఒంటరి బాల్యం, అత్తింట బానిసత్వం అనుభవించిన ఆమె కన్నకొడుకుతో అమ్మా అని పిలిపించుకోవడానికి ఆరేళ్లు ఆగింది. కొడుకును జిమ్‌లో చేర్చిన ఆమె, అక్కడే తన కెరియర్‌ను ప్రారంభించింది. మహిళలు తక్కువగా ఉండే బాడీబిల్డింగ్‌ రంగంలోకి అడుగుపెట్టి అంతర్జాతీయ ఛాంపియన్‌ అయ్యింది. ఒక్కొక్కమెట్టు అధిగమిస్తూ ఐఎఫ్‌బీబీ ప్రొ-లీగ్‌ ఇంటర్నేషనల్‌ జడ్జిగా ఎదిగింది. తన విజయాలకు కారణం తన కొడుకే అని చెప్పే ‘డాక్టర్‌ రీటా జైరథ్‌’ టెడెక్స్‌ వంటి వేదికలపై ప్రసంగిస్తూ, ఆన్‌లైన్‌లో ఫిట్‌నెస్‌ సలహాదారుగానూ పనిచేస్తోంది.

చిన్నప్పటి నుంచి రీటాకు ఇంటి నుంచి ప్రేమ, ఆప్యాయతలు అందనేలేదు. తండ్రి వైమానిక అధికారి. తల్లి మానసిక సమస్యలతో బాధ పడేది. వాళ్ల మధ్య విభేదాలు రీటాను ఇంటి పట్టున ఉండనిచ్చేవి కావు. రోజంతా స్కూల్లో, తర్వాత పక్కింట్లోనే ఎక్కువగా గడిపేది. ఆమె ఆలనాపాలనా అంతా పక్కింటివాళ్లదే. చుట్టుపక్కలంతా రీటా కుటుంబం పిచ్చిదని ముద్ర వేశారు. ఎవరూ తనతో స్నేహం చేసేవారు కాదు.

బానిసగా..

ఒక నౌకాదళ అధికారితో రీటాకు పెళ్లి అయింది. అదైనా సంతోషాన్ని ఇస్తుందనుకుంటే అక్కడా నిరాశే. ‘ఉదయం నుంచి రాత్రి దాకా గంపెడు పని. అత్తింట్లో నన్నో పని మనిషిగా చూసేవారు. ప్రసవించడానికి కష్టమై,   సిజేరియన్‌ చేయాలంటే దానికి డబ్బులు కట్టడానికి కూడా వాళ్లు ముందుకు రాలేదు. అది నా బిడ్డపై ప్రభావం చూపింది. అనిష్‌ మానసిక వైకల్యంతో పుట్టాడు. మూడేళ్లు నిండినా వాడికి మాటలు రాలేదు. అది 1980లో. అప్పట్లో వైద్యం ఇంతగా అభివృద్ధి చెందలేదు. ఇక జీవితంలో వాడు మాట్లాడలేడని అందరూ నన్ను నిరుత్సాహ పరిచారు. వాడితో అమ్మా అని పిలిపించుకోలేననే బాధ చాలా వేదనకు గురిచేసింది. వాడి భవిష్యత్తు ఏమవుతుందో అని భయం. అమెరికాలో ఉన్న మా బంధువుకు అనిష్‌ గురించి ఉత్తరం రాశా... అక్కడ ఇటువంటి పిల్లలు మాట్లాడటానికి ప్రత్యేక కోర్సులాంటిది ఉందా అని. నా అదృష్టం, కొన్ని పుస్తకాలను పంపిచారామె. వాటిలో రకరకాల థెరపీల ద్వారా మాటలు నేర్పే పద్ధతులున్నాయి. వాటిని నేను నేర్చుకొని వాడికి చెప్పడానికి ప్రయత్నించే దాన్ని. ఎవరెన్ని చెప్పినా నా కృషి మాత్రం మానలేదు. అనిష్‌కు ఆరేళ్లు వచ్చేసరికి అమ్మా అని పిలిచాడు. చిన్నచిన్న మాటలు మాట్లాడటం మొదలు పెట్టాడు. నా జీవితంలో సంతోషాన్ని మొదటి సారి అనుభవించిన క్షణాలవి. వాడిని క్రీడల్లోనూ చేర్పించమని నరాల వైద్యనిపుణులు సూచించారు. అప్పటికే వాడిని స్కూల్‌లో చేర్పించా. తను 10వ తరగతిలో ఉండగా జిమ్‌లో చేర్చా. వాడికి హృతిక్‌రోషన్‌ ఫిట్‌నెస్‌ అంటే ఇష్టం. తోడుగా ఉండటం కోసమని వాడితోపాటు నేనూ వర్కవుట్లు మొదలుపెట్టా. అలా నా కెరియర్‌ ప్రారంభమవుతుందని ఊహించనేలేదు’ అంటారు రీటా.

నా వెనుక కొడుకు..

జిమ్‌లో రీటా వర్కవుట్లు కోచ్‌కి ప్రత్యేకంగా కనిపించాయి. ఆమె కష్ట పడుతున్న తీరు, త్వరగా నేర్చుకునే విధానం నచ్చాయి. దాంతో తనను ప్రోత్సహించి, స్థానిక ఫిట్‌నెస్‌ పోటీలకు పంపారు. అక్కడ విజేతగా నిలిచిన రీటా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అర్హతను సాధించింది. ‘మొదట్లో అందరూ విమర్శించే వారు. పట్టించుకోవద్దనే వాడు మా అబ్బాయి. వాడి ప్రోత్సాహమే నేనీ స్థాయికి చేరుకోవడానికి కారణం. పిల్లలు జీవితంలో సాధించినప్పుడు వెనుక అమ్మానాన్న ఉన్నారని చెబుతారు. నేను మాత్రం నా వెనుక నా కొడుకున్నాడని గర్వంగా చెబుతా. వాడు విదేశాల్లో చదువు పూర్తి చేశాడు. నేషనల్‌ బాడీ బిల్డింగ్‌ ఛాంపియన్‌గా మూడుసార్లు నిలిచా. ఉమెన్‌ బాడీ బిల్డింగ్‌లో ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ బాడీ బిల్డింగ్‌ (ఐఎఫ్‌బీబీ) నుంచి ప్రొ-కార్డ్‌ గెలిచిన క్రీడాకారిణిని. అంతర్జాతీయ బాడీ బిల్డింగ్‌ న్యాయనిర్ణేతల్లో ఆసియా నుంచి ఏకైక మహిళను. చాలామంది క్రీడాకారులు, ట్రైనర్లకు పోషకాహారం విషయంలో సలహాలు ఇస్తున్నాను. చదువునూ కొనసాగించా. దిల్లీ విశ్వవిద్యాలయంలో పీజీ చేశా. అమెరికన్‌ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నా. ఆన్‌లైన్‌లో వర్కవుట్లపై అవగాహన కలిగిస్తున్నా. అలా అథ్లెట్‌గా, రచయిత్రిగా, భరత నాట్య కళాకారిణిగా, మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణురాలిగా పేరు తెచ్చుకున్నా. ఎన్నున్నా తల్లిగా సాధించిందే ఎక్కువ అంటాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని