వాళ్లతో ఇలా ఆడేయండి!

ఆరోగ్యమనో, ఉత్సాహం నింపడానికనో.. పిల్లల్ని స్కూలు నుంచి వచ్చాక కొద్దిసేపు ఆడుకోనిస్తాం. బయటేమో వర్షాలు. తడిస్తే జలుబు, జ్వరాలంటూ ఇబ్బంది పడతారని మన భయం. వాళ్లకేమో నీళ్లలో ఆడటమంటే సరదా. అలాగని ఇంట్లో కూర్చొని ఆడుకోమంటే బోర్‌ అనేస్తుంటారు. అలాంటప్పుడు ఈ మార్గాల్ని అనుసరించేయండి.

Published : 20 Aug 2022 00:34 IST

ఆరోగ్యమనో, ఉత్సాహం నింపడానికనో.. పిల్లల్ని స్కూలు నుంచి వచ్చాక కొద్దిసేపు ఆడుకోనిస్తాం. బయటేమో వర్షాలు. తడిస్తే జలుబు, జ్వరాలంటూ ఇబ్బంది పడతారని మన భయం. వాళ్లకేమో నీళ్లలో ఆడటమంటే సరదా. అలాగని ఇంట్లో కూర్చొని ఆడుకోమంటే బోర్‌ అనేస్తుంటారు. అలాంటప్పుడు ఈ మార్గాల్ని అనుసరించేయండి.

ఎంత నచ్చి కొనుక్కున్నా ఒకే బొమ్మలతో రోజూ కూర్చొని ఆడమంటే వాళ్లకి మాత్రం ఏం ఉత్సాహముంటుంది? కాబట్టి, ఎక్కువసేపు కూర్చోబెట్టే ఆటలపై దృష్టిపెట్టండి. ఒక డబ్బాలో కొన్ని పదాలను రాసి చిన్న చీటీలుగా చేయండి. డ్యాన్స్‌, ఎక్సర్‌సైజ్‌, ఆలోచనకు పదునుపెట్టే ఏదైనా పని చేయడం, పొడుపు కథలు.. ఇలా భిన్న అంశాలకు ప్రాధాన్యమివ్వండి. వ్యాయామం, బుర్రకు పదును, చదవడం.. ఇలా బోలెడు విషయాలకు చోటిచ్చినట్టవుతుంది. అయితే మీరూ భాగస్వాములవ్వడం తప్పనిసరి.

జిగ్‌సా పజిల్స్‌.. ఒక ఫొటో లేదా పెయింట్‌ చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి ఉంటుంది. వాటన్నిటినీ ఒకచోట చేరిస్తే కానీ దాని అందం తెలీదు. సమయం తీసుకోవడమే కాదు.. బోలెడు విషయాల్నీ నేర్పిస్తుందిది. పూర్తిచేయడానికి ఏకాగ్రత, ఓపిక, నిశిత పరిశీలన వంటి ఎన్నో లక్షణాలు కావాలి. అవన్నీ అలవడతాయి. మీరూ ఓ చేయి వేస్తే.. ఇంకాస్త ఉత్సాహంగా పూర్తిచేస్తారు.

బొమ్మలతో కూడిన పజిల్స్‌ దొరుకుతున్నాయి. బొమ్మకు తగ్గ స్పెల్లింగ్‌ చేర్చడం, రంగులు వేయడం లాంటి భిన్న రకాలను ఎంచుకుంటే సరి. ఇద్దరు ముగ్గురుండి కలిసి పూర్తిచేస్తే బోలెడు కాలక్షేపం. పైగా ఆలోచనతోపాటు భావప్రకటన నైపుణ్యాలూ మెరుగుపడతాయి.

రంగు రంగుల క్లేని తెచ్చి నచ్చిన వాటిని రూపొందించమనండి. లేదూ మీరే పిండిలో  రంగులు కలిపిచ్చినా సరే. ఆ చిన్ని మెదళ్లలో ఎంత సృజనాత్మకత ఉందో తెలుస్తుంది. వాళ్లకు తెలియలేదా.. మీరే ఫలానా పువ్వు, పండు, జంతువును చేయమని చెప్పండి. ఉత్సాహంగా చేసేస్తారు. మీరూ వాళ్లతో పోటీపడి చేస్తే ఇంకా మంచిది. అయితే రసాయన రహితమైన వాటిని ఎంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని