అత్తాకోడళ్లు స్నేహంగా...

కుటుంబ బాంధవ్యాల్లో అత్తాకోడళ్లది కొంచెం జటిలం. పిల్లీ ఎలుకల్లా గొడవపడతారని, ఉప్పూనిప్పుల్లా చిటపటలాడతారని బోల్డన్ని వెక్కిరింతలూ వ్యంగ్యోక్తులూ ఉన్నాయి. ఆ కోవకి చెందకుండా తల్లీబిడ్డల్లా ప్రేమగా, స్నేహంగా ఉండటం  కొండను పిండి చేయడం, సముద్రాన్ని తోడిపోయడం అంత కష్టం కానేకాదు..

Published : 21 Aug 2022 01:04 IST

కుటుంబ బాంధవ్యాల్లో అత్తాకోడళ్లది కొంచెం జటిలం. పిల్లీ ఎలుకల్లా గొడవపడతారని, ఉప్పూనిప్పుల్లా చిటపటలాడతారని బోల్డన్ని వెక్కిరింతలూ వ్యంగ్యోక్తులూ ఉన్నాయి. ఆ కోవకి చెందకుండా తల్లీబిడ్డల్లా ప్రేమగా, స్నేహంగా ఉండటం  కొండను పిండి చేయడం, సముద్రాన్ని తోడిపోయడం అంత కష్టం కానేకాదు.. అందుకు మనోవిశ్లేషకులు సూచిస్తున్న ఈ  సూత్రాలు పాటిస్తే చాలు..

* అత్తాకోడళ్లు ఇద్దరివీ భిన్న పరిస్థితులూ మనస్థితులూ అవడం వల్ల ఆలోచనల్లో, అలవాట్లలో తేడాలుండటం సహజం. ముఖ్యంగా వంటావార్పూ, ఇల్లు సర్దడం లాంటి పనుల్లో కోడలి అలవాట్లను ఖండించబోతుంది లేదా సరిచేయబోతుంది అత్తమ్మ. ఆ మాత్రానికి వాదించడమో, కించపడటమో కాకుండా వయసుకు పెద్దరికమిచ్చి నచ్చజెప్తే సరిపోతుంది.

* అవతలివారి చర్యల కంటే మన ప్రతిచర్యల వల్లే కోపతాపాలు పెచ్చరిల్లుతాయి. ఒకవేళ అత్తగారు చెప్పింది సరికాదనిపిస్తే అందుకు రాద్ధాంతం చేసే బదులు శాంతంగా అభిప్రాయం చెబితే ఆవిడ కూడా అర్థం చేసుకుంటుంది.

* అమ్మను ఎంత ప్రేమగా చూసుకుంటారో అత్తమ్మను అలాగే ఆదరించి చూడండి. ఆవిడ కూడా కోడలిగా కాక కూతురిలా అభిమానిస్తుంది. మనం ఇచ్చిందే తిరిగొస్తుంది అన్నారు. మీరు పరాయిగా భావిస్తే, ఆమెకి కూడా తన మనిషి అనే భావన కలగదు కదా!

* అందాకా తనచుట్టూ తిరిగిన కొడుకు కొత్తగా వచ్చిన కోడలికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో.. ఏదో మిషమీద కోపతాపాలు వ్యక్తం చేసి ఉండొచ్చు. అదేం శాశ్వతం కాదు, చిన్నపాటి ఉక్రోషమేనని అర్థం చేసుకుంటే సానుభూతి కలుగుతుందే తప్ప ద్వేషం రగలదు. నిజానికి అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఇద్దర్నీ సమంగా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుది. కాస్తంత సర్దుకుపోతే చాలు వాతావరణం కలుషితం కాదు.

* వయసు రీత్యా వచ్చే చిన్న చిన్న చాదస్తాలకు ఆగ్రహం తెచ్చేసుకుని బీభత్సం సృషించేకంటే పుట్టింట్లో అమ్మానాన్నలూ అంతే కదా అనుకుని చూడండి. అత్తగారిలో తక్షణం మార్పొస్తుంది. తానూ ఒకనాటి కోడలినేనని గుర్తుచేసుకుని ఆత్మీయ సంబంధాన్ని కొనసాగిస్తుంది.

* పనంతా అత్తగారే చేయాలనుకుంటే ఆ దౌర్జన్యంతో మీమీద ప్రేమ ఇంకిపోతుంది. వయసు పెరిగేకొద్దీ ఓపిక ఉడుగుతుంది కనుక తేలికైన పనులే చేయనివ్వండి. కొన్ని భర్తకూ అప్పగిస్తే ఎవరికీ భారమనిపించదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని