ఔనంటారా కాదంటారా?

పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు రెండు రకాలు.. ఔననే వాళ్లు, కాదనే వాళ్లు. ఈ రెండింటిలో మీరు ఏరకం?అమ్మా బయటకు వెళ్తా...  వద్దు బయట చాలా వేడిగా ఉంది.  అమ్మా టీవీ చూస్తా... ఇప్పుడు కాదు... ముందు హోమ్‌వర్క్‌ చెయ్యి.

Published : 22 Aug 2022 00:35 IST

పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు రెండు రకాలు.. ఔననే వాళ్లు, కాదనే వాళ్లు. ఈ రెండింటిలో మీరు ఏరకం?

మ్మా బయటకు వెళ్తా...  వద్దు బయట చాలా వేడిగా ఉంది.  అమ్మా టీవీ చూస్తా... ఇప్పుడు కాదు... ముందు హోమ్‌వర్క్‌ చెయ్యి.

ఇలా ప్రతి దానికీ వద్దు, కాదు అంటూ పిల్లల్ని అదుపులో పెడుతున్నారా? అయితే మీరు కాదనే రకం. కచ్చితంగా మీ భాషని మార్చాల్సిందే. ముఖ్యంగా ఈ నెగెటివ్‌ పదాల్ని. ఎందుకంటే ఈ పదాలు పిల్లల ఎదుగుదలపైన దుష్ప్రభావం చూపుతాయి. వారిలో కుతూహలాన్ని తగ్గిస్తాయి.

అందుకే వద్దు, కాదు, రాదు... వీటికి బదులుగా ‘అవును’ అనే మాటే ఎక్కువగా వినిపించాలి. అలాగని వాళ్లు చెప్పినవాటన్నింటికీ ఊ కొట్టమని కాదు. పాజిటివ్‌ మాటలు వాళ్లు కొత్తదారిలో ప్రయాణించేలా ఉత్సాహపరుస్తాయి. కొన్ని విషయాల్లో అవుననీ, మరికొన్ని విషయాల్లో పక్కాగా కాదనీ చెప్పితీరాల్సిందే. కానీ రోజులో ఎక్కువగా ఎలాంటి పదాలు వాడుతున్నారన్నది ముఖ్యం. కాదు, వద్దని చెప్పగానే పిల్లల మనసులో రకరకాల ఆలోచనలు బయలుదేరుతాయి. దాంతో ఎలా స్పందించాలో అర్థం కాదు. ఒక్కోసారి మొండికేస్తారు. అల్లరి చేసైనా తమకు కావాల్సింది చేయించుకుంటారు. బదులుగా భాషని మార్చి వారి ప్రవర్తనలోనూ మార్పు తేవొచ్చు. కాదు, వద్దుతో తేల్చేయకుండా వారికి స్పష్టమైన కారణం చెప్పి మీరు ఏదైనా వివరించాలి.

ఆడుకుంటానంటే.. ఆడుకుందువు కానీ, కాస్త ఎండ తగ్గని, ఈ స్నాక్స్‌ తిన్నాక చూద్దామని చొప్పొచ్చు. టీవీ చూద్దువు కానీ ముందైతే హోమ్‌వర్క్‌ పూర్తిచేసేయ్‌.. అంటూ ఇలా పాజిటివ్‌గా మీ భాషని మార్చేస్తే పిల్లల తీరులోనూ మార్పు వస్తుంది. కాదు, వద్దు అనగానే వారికి మరో ప్రశ్న వేసేందుకు ఆస్కారమే ఉండదు. కానీ ప్రశ్నించేతత్వం పిల్లల ఎదుగుదలకు చాలా కీలకం. పిల్లలు తరచూ బొమ్మలు కొనమని అడుగుతారు. వెంటనే మీ నుంచి వద్దనే సమాధానం రాకూడదు. ఏ బొమ్మ అని అడగాలి. దాన్నిబట్టి వారాంతంలోనో, పుట్టినరోజుకో, పండక్కో కొంటామని చెప్పాలి. ఒకవేళ అది మీ పిల్లలకు సరిపోయే బొమ్మ కాదనిపిస్తే ఆ విషయాన్నే వాళ్లకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇకనైనా ‘నో’ మామ్‌ నుంచి ‘ఎస్‌’ మామ్‌గా మారిపోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని