సృజనాత్మకంగా..

చిన్నారుల్లో బాల్యం నుంచి సృజనాత్మకత పెంచడానికి ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. ఇదే వారిని వివిధ రంగాల్లో నైపుణ్యాలను పెంచుకునేలా చేస్తుందని చెబుతున్నారు.పిల్లల గది గోడలకు అంతరిక్షం, రకరకాల జంతువుల బొమ్మల

Published : 23 Aug 2022 00:26 IST

చిన్నారుల్లో బాల్యం నుంచి సృజనాత్మకత పెంచడానికి ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. ఇదే వారిని వివిధ రంగాల్లో నైపుణ్యాలను పెంచుకునేలా చేస్తుందని చెబుతున్నారు.

పిల్లల గది గోడలకు అంతరిక్షం, రకరకాల జంతువుల బొమ్మల పోస్టర్లు వంటివి ఉండేలా ఏర్పాటు చేయాలి. ఇవి వారిలో అన్వేషణ తరహా ఆలోచన మొదలయ్యేలా చేస్తాయి. తెలియని విషయాలను తెలుసుకోవాలనే ఆత్రుత పెరుగుతుంది. కొత్త ప్రపంచం, ఆ విశేషాల గురించి సందేహాలొస్తాయి. రకరకాల జంతువుల గురించి వివరాలు అడుగుతారు. భూమిపై ఎన్నిరకాల జంతువులు జీవిస్తున్నాయనే ప్రశ్నలు ఆ చిట్టి మెదడులో మెదులుతాయి. ఇవన్నీ వారికి కొత్త విషయాలపట్ల ఆసక్తిని పెరిగేలా చేస్తాయి. క్రమేపీ సృజనాత్మకంగా ఆలోచించడం మొదలు పెడతారు. పిల్లల సందేహాలను తీర్చడానికి పెద్దవాళ్లూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి.. అప్పుడే చిన్నారుల మెదడుకు కావాల్సిన మేతను అందించగలుగుతారు.

విశ్లేషణ..

హోంవర్క్‌ చేసే బల్లపై భూగోళం బొమ్మను అమర్చాలి. గది గోడకు అట్లాస్‌ ఉండాలి. దీంతో భౌగోళికపరంగా వారిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి వస్తుంది. మనం నివసించే భూమి గురించి, అది తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరగడం వింతగా అనిపిస్తుంది. అట్లాస్‌లో ప్రపంచదేశాలు, ఆయా భాషలు, ప్రాంతాల విశేషాలు వంటివన్నీ రోజుకొకటి చెప్పాలి. అవన్నీ వారికి భూగోళం గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచుతాయి. ప్రతి చిన్న విషయంపై విశ్లేషణ ఇవ్వగలిగితే చాలు. వారి మెదడు చురుకుగా, సృజనాత్మకంగా మారుతుంది.

కానుకలు..

ప్రత్యేక సందర్భాల్లో చిన్నారులకిచ్చే కానుకలు వారిని ఆలోచింపచేసేలా ఉండాలి. తోటిపిల్లలకు ఇచ్చే కానుకలను పిల్లలతోనే తయారు చేయించాలి. అలా వారి మెదడులో కొత్త డిజైన్ల ఆలోచనలొస్తాయి. దుకాణంలో కొన్న బొమ్మలకన్నా, తమ చేత్తో తయారు చేసే వాటిపై పిల్లలకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది. కాగితం, అట్ట, క్లే వంటి వాటితో రకరకాల బొమ్మల ఆలోచనలు అందిస్తే చాలు. ఉత్సాహంగా నేర్చుకుంటారు. అలాగే క్విజ్‌ పూర్తి చేయడం నేర్పాలి. చెెస్‌, క్యారమ్స్‌ వంటివి వారి మెదడును మరింత చురుకుగా పని చేసేలా సృజనాత్మకతను పెంచుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని