జ్ఞాపకాలతో ప్రేమ బంధం

పెళ్లైన మూడు నాలుగేళ్లకే రంజిత, రమేశ్‌లు వాళ్ల వృత్తుల్లో బిజీ అయిపోయారు. ఆ ఒత్తిడితో జీవితం నిస్సారంగా అనిపించడం మొదలైంది. ఇలాకాకుండా ఉండాలంటే వారాంతంలో ఓసారి గతంలోకి వెళ్లి, ఆ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటే తిరిగి

Updated : 24 Aug 2022 00:48 IST

పెళ్లైన మూడు నాలుగేళ్లకే రంజిత, రమేశ్‌లు వాళ్ల వృత్తుల్లో బిజీ అయిపోయారు. ఆ ఒత్తిడితో జీవితం నిస్సారంగా అనిపించడం మొదలైంది. ఇలాకాకుండా ఉండాలంటే వారాంతంలో ఓసారి గతంలోకి వెళ్లి, ఆ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటే తిరిగి మనసంతా ఉత్సాహంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు.

పెళ్లి కుదిరిన తర్వాత దంపతులు కాబోయే ఆ ఇద్దరూ ఒకరికొకరు ఇచ్చుకున్న కానుకలు, రాసుకున్న ఉత్తరాలు, డైరీలు వంటివన్నీ ఎప్పటికీ చెరగని తీపి జ్ఞాపకాలే. వాటిని ఎక్కడో ఒక చోట భద్రపరుచుకునే ఉంటారు. అప్పుడప్పుడూ అవన్నీ తీసి చదువుకోవడానికి సమయాన్ని కేటాయించుకోవాలి. అప్పుడు కొత్తలో జీవితం ఎంత ఉత్సాహంగా ఉండేదో గుర్తొస్తుంది. ఇప్పుడెందుకలా నిరుత్సాహంగా మారుతుందో ఆలోచించేలా చేస్తుంది. పూర్వపు ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది. అప్పుడు ఒకరితో మరొకరు చెప్పుకొన్న తీయని కబుర్లను గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ కానుక అందించడానికి ఎంతగా కష్టపడ్డారో, లేదా ఎన్ని చోట్ల తిరిగి కొన్నారో వంటి విశేషాలను ఎదుటివారికి చెప్పాలి. ఒకరిపట్ల మరొకరి ప్రేమను తిరిగి వ్యక్తీకరించుకోవాలి. ఇవన్నీ ఇరువురినీ మళ్లీ ఆనందంలో ముంచెత్తుతాయి.


పిల్లలతో..

ల్లిదండ్రులు తమ చిన్నప్పుడు స్కూల్‌, కాలేజీ రోజుల ఫొటోలను పిల్లలకు చూపించాలి. అప్పట్లో అందుకున్న సత్కారాలు, పురస్కారాలు తదితర విశేషాలను వారికి వివరించాలి. పిల్లలతో అప్పటి అనుభవాలను పంచుకోవాలి. చిన్నారుల మనసునూ ఇవి సంతోషపరుస్తాయి. ఆ కాలం విశేషాలు, వస్తువుల వివరాలు, పంటలు, బంధువుల గురించి పిల్లలకు కొత్తగా అనిపిస్తాయి. ఆసక్తిని కలిగించే అటువంటి విశేషాలను ఫొటోల ద్వారా చెప్పగలిగితే చాలు. వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి.


ఫొటోలు..

మూడు ముళ్లు పడినప్పటి నుంచి హనీమూన్‌కు వెళ్లినప్పుడు, అక్కడి ప్రకృతి దృశ్యాలు, క్లిక్‌మనిపించిన ఫొటోల ఆల్బమ్‌ను బయటకు తీయాలి. ఒక్కో ఫొటో ఒక్కో తీయని జ్ఞాపకాన్ని అందిస్తుంది. ప్రతి ఫొటో వెనుకా ఓ సందర్భం, విశేషం ఉంటుంది. వాటిని గుర్తుకు తెచ్చుకొంటే చాలు. ఆలుమగల మధ్య అనుబంధం మరింత దగ్గరవుతుంది. సంతోషంగా గడిపే ఆ సమయం విలువైనదిగా మారుతుంది. చిన్నప్పటి ఫొటోలు, అమ్మానాన్న, తోబుట్టువులతో కలిసి ఉన్నవి  భాగస్వామికి చూపించి ఆ విశేషాలను వివరించాలి. చిన్ననాటి ఆ జ్ఞాపకాలు మీ మనసునూ ఉత్తేజపరుస్తాయి. అప్పట్లో ఎంత ఉత్సాహంగా ఉండేవాళ్లం అనేది గుర్తొస్తుంది. తిరిగి అలాగే మారిపోవాలనిపిస్తుంది. అప్పటి నుంచి ప్రతి క్షణం ఉల్లాసంగా మారుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని