అత్తామామలతో అన్యోన్యంగా..

పెళ్లై అత్తారింట అడుగుపెట్టే నవవధువు అక్కడివారితో అరమరికలు లేకుండా  మెలగాలంటున్నారు మానసిక నిపుణులు. తొలిరోజుల్లో ఏర్పరచుకునే బంధం కలకాలం నిలుస్తుందని చెబుతున్నారు.

Published : 26 Aug 2022 00:56 IST

పెళ్లై అత్తారింట అడుగుపెట్టే నవవధువు అక్కడివారితో అరమరికలు లేకుండా  మెలగాలంటున్నారు మానసిక నిపుణులు. తొలిరోజుల్లో ఏర్పరచుకునే బంధం కలకాలం నిలుస్తుందని చెబుతున్నారు.

కొత్త సంసారంలో రెండురకాల సంస్కృతి సంప్రదాయాలను సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేయడం ఏ కోడలికైనా కొంచెం కష్టమైన విషయమే. అప్పటివరకు పుట్టింట్లో పద్ధతులు వేరేగా ఉండొచ్చు. అత్తింట విధానాలు కొత్తగా అనిపించొచ్చు. అయితే వివాహమైన తర్వాత మిగతా జీవితమంతా అత్తింటివారితో కలిసి ఉండాల్సి ఉంటుంది. ఆ కుటుంబానికి కూడా ప్రాధాన్యం ఇవ్వడం నేర్చుకోవాలి. కొత్తకోడలు, తనకేం తెలుసు, ఏం తెలియదు అన్న సందేహాలు అత్తింట్లో రావడం సహజమే. ఇందులో అభ్యంతరాలు, నిర్మొహమాటాలు ఉండకపోవచ్చు. వాటిని దాటుకొని రావాలంటే అక్కడి పద్ధతులను పరిశీలించి, తెలుసుకోవడానికి కాస్తంత సమయం పడుతుందని ముందుగానే మృదువుగా చెప్పాలి. అంతేకాదు, తెలియనివాటిని అత్తగారిని అడిగి తెలుసుకుంటూ అందరితో కలిసి పోవడానికి కృషి చేయాలి.

మర్యాదగా..

పెద్దలపట్ల మర్యాదపూర్వకంగా ఉండాలి. దురుసు ప్రవర్తన చూపించకూడదు. మీ తల్లిదండ్రులను ఎలా ప్రేమించారో, పెళ్లి తర్వాత అత్తామామలనూ అమ్మానాన్నలుగా భావించి ప్రేమించడం ప్రారంభించాలి. వ్యతిరేకత, కోపం, ద్వేషం వంటివి చూపించకుండా వారి పట్ల ప్రేమగా ఉండాలి. అక్కడి అవసరాలకు తగినట్లుగా ఆ ఇంటికి బాధ్యత వహించడానికి ప్రయత్నించాలి తప్ప, ఏమీ పట్టనట్లు వ్యవహరించకూడదు. ఇంటి కోడలికి సర్వహక్కులూ అందించడానికి ఆ పెద్దవాళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. చిన్న సహాయం కావాలన్నా లేదా తీసుకున్నా ప్లీజ్‌, థాంక్యూ వంటివి మరవకూడదు. ఇవన్నీ అవతలి వారి మనసులో స్థానాన్ని సంపాదించడమే కాదు, వారిపై మీకు కూడా ప్రేమాభిమానాలను పెంచుతాయి. ఆ తర్వాత అత్తాకోడళ్ల మధ్య ఏర్పడే అనుబంధం కలకాలం ఉంటుంది.


పంచుకోవడం..

నసులో కలిగిన ఏ భావాన్నైనా అత్తమ్మతో పంచుకోవడానికి ప్రయత్నించాలి. భర్త గురించి ఆవిడవద్ద చెడుగా మాట్లాడకూడదు. అతడివల్ల ఇబ్బంది ఎదురవుతుంటే దాన్ని సున్నితంగా తనతోనే మాట్లాడి పరిష్కరించుకోవాలి. కోడలు కావడమంటే ఓ ఇంటి బాధ్యతను అందుకున్నట్లే. దాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి అత్తగారి చేయూత తీసుకోవాలి. ఇద్దరి మధ్య ఏర్పడే స్నేహబంధం ఆ ఇంట్లో ప్రముఖ స్థానాన్ని అందుకునేలా చేస్తుంది. అత్తింట ఎవరి విధానాలు, ప్రవర్తన నచ్చినా వెంటనే అభినందించాలి. ఈ పద్ధతి అవతలి వారికి తెలియకపోయినా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీ సొంత విషయాలను ఎదుటి వారివద్ద మొదట్లోనే ఏకరువు పెట్టకూడదు. ముందా కుటుంబంతో కలిసిపోవడానికి ప్రయత్నించాలి. అయితే మీకంటూ ఒక స్పేస్‌ ఉంచుకోవడం మరవకూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్