ముందు.. మీరు పాటిస్తున్నారా?

పిల్లలు చెప్పిన మాట వినాలి, బుద్ధిగా నడుచుకోవాలని కోరుకోని అమ్మలుండరు. వాళ్లలా ఉండాలంటే మీరూ అలాగే నడుచుకోవాలంటారు నిపుణులు. ఇవే కాదు.. ఇంకొన్ని నైపుణ్యాలు ఒంటబట్టించుకొని పాటించమంటున్నారు. స్కూలు నుంచి రాగానే పిల్లలు ‘అమ్మా.. ఈరోజు’ అంటూ కబుర్లు చెప్పేస్తుంటారు. ‘ఇక చాల్లే ఆపు’ అనడమో, పరధ్యానంగా వినడమో చేస్తున్నారా!

Published : 27 Aug 2022 00:20 IST

పిల్లలు చెప్పిన మాట వినాలి, బుద్ధిగా నడుచుకోవాలని కోరుకోని అమ్మలుండరు. వాళ్లలా ఉండాలంటే మీరూ అలాగే నడుచుకోవాలంటారు నిపుణులు. ఇవే కాదు.. ఇంకొన్ని నైపుణ్యాలు ఒంటబట్టించుకొని పాటించమంటున్నారు.

స్కూలు నుంచి రాగానే పిల్లలు ‘అమ్మా.. ఈరోజు’ అంటూ కబుర్లు చెప్పేస్తుంటారు. ‘ఇక చాల్లే ఆపు’ అనడమో, పరధ్యానంగా వినడమో చేస్తున్నారా! అదే వద్దంటున్నారు నిపుణులు. మనకవి చాలా చిన్న విషయాలుగానో, రోజూ ఉండేవనో అనిపించొచ్చు. కానీ.. సరిగా వింటే వాళ్ల భావోద్వేగాలు, ఆలోచనా విధానం తెలుస్తాయి. దాన్ని బట్టి వాళ్ల ప్రవర్తనలో అవసరమైతే మార్పులు తేవొచ్చంటున్నారు. అలా కాక మీరే వినకపోతే వాళ్లూ మీరు చెప్పింది ఎందుకు వినాలన్న ధోరణిలోకి వెళ్లిపోతారు. కాబట్టి.. వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినండి. ఆ సమయంలో ఎన్ని పనులున్నా పక్కన పెట్టండి.

పిల్లలు కోపంగా వచ్చినా, విసుగు చూపించినా మనకూ కాస్త చిరాకొస్తుంది కదూ! కొన్నిసార్లు అరిచేస్తుంటాం కూడా. బదులుగా నెమ్మదిగా అడిగి చూడటం అలవాటు చేసుకోండి. ‘ఈరోజు కాస్త చిరాగ్గా ఉన్నట్టున్నావు?’, ‘నిన్ను ఇబ్బందిపెట్టే విషయం ఏదైనా జరిగిందా?’ అని అనునయంగా అడిగి చూడండి. సమాధానం చెప్పే వరకూ ఓపిగ్గా ఉండండి. అప్పుడు వారికీ ఎదుటివారి భావోద్వేగాలకు విలువనివ్వడం అలవాటవుతుంది. వీళ్లదే తప్పయితే అదెలానో చెప్పండి. కాదనుకోండి.. పరిష్కార మార్గాలను సూచించొచ్చు. ఏదైనా వారికి లాభించేదే!

టీనేజీకి వచ్చేసరికి పిల్లల్లో కొత్త మార్పులొస్తాయి. ఇతరులతో పోల్చుకోవడం, తక్కువన్న భావనకు రావడం వంటివి సాధారణమే. అందంగా లేమనో, గొంతులో తేడాలు, శారీరక మార్పులు లాంటి బోలెడు అంశాలుంటాయి. ఇవి మనకు సాధారణం కానీ వాళ్లకి కాదు. అలాగని వాటిని మనతో పంచుకోవడానికి సంకోచిస్తుంటారు. వాటిని గమనించి, మనమే వాళ్లతో మాట్లాడాలి. ఇదంతా సాధారణమని వివరించి చెప్పాలి. అవసరమైతే మీ అనుభవాలనూ చెప్పొచ్చు. ఇలాచేస్తే వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమస్య ఏదైనా అర్థం చేసుకోవడానికి, అండగా ఉండటానికి ఇంట్లోవాళ్లు ఉన్నారన్న ధైర్యమూ ఉంటుంది.

పిల్లలన్నాక పొరపాట్లు చేయడం సహజమే. కొన్నిసార్లు ఫిర్యాదులూ వస్తుంటాయి. మీ స్పందన ఏంటి? వెంటనే అరవడమో, చేయి చేసుకోవడమో చేస్తున్నారా? దాని ద్వారా మనం చూసిందే నిజం, రూఢీ చేసుకోవాల్సిన అవసరం లేదన్న సంకేతం వెళ్లదూ! తప్పు వీళ్లదే అయినా కారణం అడగండి. వాళ్ల వివరణ వినండి. తర్వాత నిర్ణయం తీసుకోండి. దాంతో వాళ్ల ఆలోచన విధానం అర్థమవడమే కాదు.. ఒక విషయాన్ని భిన్న కోణాల్లో చూడాలన్న నైపుణ్యాన్ని తెలియకుండానే అలవాటు చేసిన వాళ్లమవుతాం. ఇవన్నీ స్కూలు, చదువులు నేర్పవు. ఇంటినుంచే అలవడతాయి. అందుకే ఏదైనా మనం పాటిస్తూ వాళ్లకీ నేర్పించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్