స్నేహితులే ఆలంబన...
తల్లిదండ్రులు, తోడపుట్టిన వాళ్లు, భర్త, అత్తమామలు.. ఇలా ఆత్మీయతలు పంచే బాంధవ్యాలెన్నో! ఈ ప్రేమలే లేకుంటే జీవితం శూన్యంగా ఉంటుంది. ఇక ఏ చుట్టరికమూ లేకపోయినా చిక్కనైన బంధం స్నేహం. దైనందిన జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాల
తల్లిదండ్రులు, తోడపుట్టిన వాళ్లు, భర్త, అత్తమామలు.. ఇలా ఆత్మీయతలు పంచే బాంధవ్యాలెన్నో! ఈ ప్రేమలే లేకుంటే జీవితం శూన్యంగా ఉంటుంది. ఇక ఏ చుట్టరికమూ లేకపోయినా చిక్కనైన బంధం స్నేహం. దైనందిన జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాల నుంచి కాసింత ఊరట కలగాలన్నా, మానసిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం దొరకాలన్నా స్నేహితులే ఆలంబన. ఈ విషయంలో మానసిక నిపుణులు ఏమంటున్నారో చూడండి...
* అందాకా స్నేహం కోసం ప్రాణం పెట్టిన అమ్మాయిలు పెళ్లయ్యాక సంసారానికే పరిమితమైపోతుంటారు. ఇదంత ఆరోగ్యకరం కాదు. ఇంటిని చక్కబెట్టుకుంటూనే స్నేహాలనూ కొనసాగించండి. అప్పుడే మీ కష్ట సుఖాల్లో సలహాలూ సహకారం దొరుకుతాయి. చిక్కుముడుల్లాంటి సమస్యలు పరిష్కారమై ఊరట లభిస్తుంది.
* స్నేహం వ్యక్తులకే పరిమితం కాదు. వారి కుటుంబాలతో సాన్నిహిత్యానికి దారితీస్తుంది. అదెంతో మంచి పరిణామం. ఆత్మీయత పంచే సభ్యుల సంఖ్య విస్తరించి ఉల్లాసం కలుగుతుంది.
* స్నేహితుల కోసం కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే మట్టుకు చిరాకులూ పరాకులూ తప్పవు. దేన్నయినా సామరస్యంగా పరిష్కరించుకునే నేర్పూ ఓర్పూ ఉంటే అంతా సజావుగా సాగుతుంది.
* బాధ్యతలు పెరుగుతాయి కనుక, పెళ్లికి ముందు ఉన్నంత స్వేచ్ఛ ఉండని మాట నిజం. కానీ కాస్తంత సమన్వయం చేసుకుంటే స్నేహితులను మీ ఇంటికి పిలిచి ఆనందంగా గడపొచ్చు. అలాగే వారిళ్లకు వెళ్లొచ్చు.
* ఏ బంధువులతోనూ చెప్పలేని విషయాలు కూడా స్నేహితులతో పంచుకోగలుగుతారు. కనుక మనసులో ఎలాంటి అలజడి ఉన్నా మీ చిరకాల నేస్తంతో పంచుకోండి. మనసు తెలిసిన వ్యక్తి గనుక మీకు అనుకూలమైన సలహా ఇస్తుంది. ఆమెకి మీరూ అంతే బాసటగా నిలవాలి.
* జీవితం సాదాసీదాగా సాగిపోతుంటే విసుగ్గా, యాంత్రికంగా ఉంటుంది. అలాంటప్పుడు నెచ్చెలులే రిఫ్రెష్‌మెంట్. ఇరు కుటుంబాలూ కలిసి ఏ హోటల్లోనో భోజనం చేసి సరదాగా ఏ సినిమాకో షికారుకో వెళ్లండి. ఆ ఉత్సాహం మీరు మళ్లీ కలిసే వరకూ కొనసాగుతుంది.
* ఏడాదికోసారి స్కూలు లేదా కాలేజీలో కలిసి చదువుకున్న మిత్రులతో గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకోండి. చిన్నప్పటికీ ఇప్పటికీ వారి వారి జీవనశైలులు మారిపోయి కొత్తగా కనిపిస్తారు. ఇలాంటివి గొప్ప ఆనందాలను మిగులుస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.