సానుభూతి నేర్పిస్తున్నారా...

బడిలోనో ఇంట్లోనో ఎవరికైనా దెబ్బ తగిలి బాధపడుతున్నా పిల్లలు పట్టనట్లుగా ఉన్నారంటే వారిలో సానుభూతి గుణం కరవైందని అర్థం అంటున్నారు నిపుణులు. ఇతరుల కష్టాల్ని చూసి స్పందించే గుణాన్ని పిల్లలకు అలవాటు చేయాల్సిన బాధ్యత పెద్దవాళ్లదేనని సూచిస్తున్నారు.

Published : 31 Aug 2022 00:32 IST

బడిలోనో ఇంట్లోనో ఎవరికైనా దెబ్బ తగిలి బాధపడుతున్నా పిల్లలు పట్టనట్లుగా ఉన్నారంటే వారిలో సానుభూతి గుణం కరవైందని అర్థం అంటున్నారు నిపుణులు. ఇతరుల కష్టాల్ని చూసి స్పందించే గుణాన్ని పిల్లలకు అలవాటు చేయాల్సిన బాధ్యత పెద్దవాళ్లదేనని సూచిస్తున్నారు.

రెండేళ్లలోపు బుజ్జాయిలు వారు కోరింది వెంటనే దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంటారు. ఆ సమయంలో తోబుట్టువులు లేదా తోటిపిల్లల భావోద్వేగాలు అర్థంకావు. వారికి కావాల్సింది దక్కాలనే అభిప్రాయంతోనే ఉంటారు. దానికోసం ఎదుటివారు దెబ్బలు తింటున్నా కూడా తమకు కావాల్సిన దాని గురించి పట్టుదలగా ఉంటారు. ఎదుటివారి గురించి ఆలోచించేటంతగా వారి మెదడు అభివృద్ధి కాదు. వయసు పెరిగేకొద్దీ పిల్లలకు ఒక్కొక్క విషయాన్నీ తెలియచేయాల్సిన బాధ్యత పెద్దవాళ్లదే. తోటివారి భావోద్వేగాలు, ఎదుటివారి వేదన వంటి వాటి గురించి కూడా ఆలోచించాలనే లక్షణాన్ని పిల్లలకు నేర్పించాలి.

నైపుణ్యాల్లో.. చిన్నారులకు నేర్పించాల్సిన నైపుణ్యాల్లో అత్యంత ముఖ్యమైంది, శక్తివంతమైంది... సానుభూతి. ఇది వ్యక్తిగత జీవితంలో చుట్టుపక్కల వారిని అర్థం చేసుకోవడం నేర్పుతుంది. ఎదుటివారి మనసులోని భావాలను, వేదనను గుర్తించేలా చేస్తుంది. ఈ లక్షణం ఉన్న వారికి స్నేహితులెక్కువగా ఉంటారు. ఇటువంటి వారివల్ల ఎదుటివారికి ప్రయోజనాలెన్నో ఉంటాయి. అంతేకాదు, ఈ లక్షణం ఉన్నవారికి కఠినమైన సమస్యలకు పరిష్కారాన్ని చూపించగల నైపుణ్యం, ఎటువంటి వారితోనైనా కలిసి పనిచేయగలిగే సామర్థ్యం అలవడుతుంది. ఇతరుల గురించి సానుకూల ధోరణిలో ఆలోచించడం, వారి కష్టం తమదనుకొని తీర్చడం తెలుస్తుంది. దాతృత్వం అలవడుతుంది.

బాల్యంలో.. పిల్లలు చిన్నచిన్న విషయాలకే డీలా పడుతుంటారు. దెబ్బలు తగిలినప్పుడు ఏడుస్తుంటారు. అటువంటప్పుడు వారిపై సానుభూతి చూపించి తిరిగి ఉత్సాహపరచడం వారికి సంతోషాన్నిస్తుంది. కాసేపు ఓదారిస్తేనే చాలు. తిరిగి ఆటలో మునిగిపోతారు. అలాగే ఇతర పిల్లలనూ వారి ముందు దగ్గరకు తీసుకోవాలి. దాంతో ఎదుటి చిన్నారుల ముఖంలో సంతోషాన్ని పిల్లలు గుర్తిస్తారు. దానివల్ల వారెంత ఆనందంగా ఉన్నారో తెలుసుకుంటారు. ఈ స్వీయ అనుభవాన్ని ఇతరులపై చూపించడం మొదలుపెడతారు. ఇంటికొచ్చే అతిథులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం నుంచి స్నేహితుల సమస్యలకు స్పందించి, వారికి సాయం చేయడం వరకూ ప్రతి చిన్న విషయాన్నీ తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకోవడం మొదలుపెడతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని