ఆ వయసులో సందేహాలు తీర్చాలి..

యుక్తవయసు వచ్చేసరికి హార్మోన్ల ప్రభావంతోపాటు శారీరకంగానూ పిల్లల్లో పలు మార్పులొస్తాయి. ఆ సమయంలో వారికెన్నో సందేహాలు, ఆందోళన, ఒత్తిడి, భయాలు మొదలవుతాయి. వీటన్నింటికీ పరిష్కారాల్ని అమ్మానాన్నలే సూచించాలంటున్నారు నిపుణులు.

Updated : 04 Sep 2022 09:41 IST

యుక్తవయసు వచ్చేసరికి హార్మోన్ల ప్రభావంతోపాటు శారీరకంగానూ పిల్లల్లో పలు మార్పులొస్తాయి. ఆ సమయంలో వారికెన్నో సందేహాలు, ఆందోళన, ఒత్తిడి, భయాలు మొదలవుతాయి. వీటన్నింటికీ పరిష్కారాల్ని అమ్మానాన్నలే సూచించాలంటున్నారు నిపుణులు.

కొందరు పిల్లలు వయసుకు తగ్గట్లు ఎదగడంలో వెనకబడతారు. ఆరోగ్యం, ఆహారం, జీన్స్‌ వంటివన్నీ దీనికి కారణం కావొచ్చు. ఇంకొందరు అధికబరువుకు గురవుతారు. ఇవి రెండూ వారిని బాడీ షేమింగ్‌కు గురయ్యేలా చేస్తాయి. మరి కొందరు మరొకరితో పోల్చుకొని న్యూనతకు లోనవుతారు. ఎవరితోనూ కలవరు. ఇవన్నీ వారిని చదువులో వెనకబడేలా చేస్తాయి.  పిల్లల్లో వచ్చే ఈ మార్పులను తల్లిదండ్రులు సకాలంలో గుర్తించాలి. వారి ఆత్మన్యూనతను దూరం చేయడానికి ప్రయత్నించాలి. ఏ విషయంలోనూ ఇతర పిల్లలతో పోల్చుకోవద్దని, ఎవరి ప్రత్యేకత వారిదే అని చెప్పాలి. ముందుగా మనల్ని మనం ప్రేమించడమెలాగో నేర్పించాలి. ఇవన్నీ పిల్లల ఆలోచనా విధానాన్ని మార్చి, అవగాహన పెంచుతాయి.

సమన్వయం..

ఈ వయసులోకి పిల్లలు అడుగుపెట్టేసరికి అవాస్తవిక ధోరణుల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. వాస్తవాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడరు. తమకు తెలిసిందే సరైనదని, తమకన్నీ తెలుసనే ధోరణిలో ఉంటారు. వారి ఆలోచనాతీరు సరైనది కాదని తల్లిదండ్రులు చెప్పాలనుకున్నా స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు. కత్తిపై సాములాంటి ఈ పరిస్థితిని పెద్దవాళ్లు సమన్వయం చేయగలగాలి. నొప్పించకుండా ఒప్పించే పద్ధతిలో పిల్లలను దిశ మార్చడానికి ప్రయత్నించాలి. వారి విధానాలు సరైనవి కావంటూ ముఖంపైనే కోపంగా చెప్పకుండా మృదువుగా అవగాహన కలిగించాలి. ఎదుటివ్యక్తి గురించి తెలుసుకోవడమెలాగో చెప్పాలి. జీవితపు విలువలను, జీవన నైపుణ్యాలను నేర్పాలి.

మళ్లించాలి..

పిల్లలు యుక్తవయసులోకి అడుగుపెట్టేసరికి వారి వేగాన్ని మంచి మార్గంలోకి మళ్లించాలి. క్రీడలు, అభిరుచులు అంటూ.. వారికిష్టమైన రంగంలో ప్రవేశించేలా చేయాలి. చదువుతోపాటు మనసుకు నచ్చిన రంగంలో నిత్యం బిజీగా ఉండేలా చూడాలి. జీవితంలో ఏదోఒక లక్ష్యాన్ని ఎంచుకునేలా చేయాలి. ఇవన్నీ వారు సంపూర్ణ వ్యక్తులుగా ఎదగడానికి దోహదపడతాయి. జీవితానికి కావాల్సిన క్రమశిక్షణ నేర్పుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఎటువంటి ప్రలోభాలకూ ప్రభావితం కాకుండా వారికి వారు నిర్దేశించుకున్న మార్గంలో అడుగులేసి లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్