సర్దుకుపోవడం.. ఎంతవరకూ!
‘అమ్మాయివి.. సర్దుకుపోవాలి’ ఈ మాట చిన్నప్పటి నుంచి ఎన్ని వేలసార్లు వినుంటాం? అలవాట్లు, ఇష్టాల్లో చిన్న చిన్న సర్దుబాట్లు... వివాహ బంధంలో మనకలవాటే! కానీ అదెంత వరకూ? నిపుణులేం చెబుతున్నారంటే...
‘అమ్మాయివి.. సర్దుకుపోవాలి’ ఈ మాట చిన్నప్పటి నుంచి ఎన్ని వేలసార్లు వినుంటాం? అలవాట్లు, ఇష్టాల్లో చిన్న చిన్న సర్దుబాట్లు... వివాహ బంధంలో మనకలవాటే! కానీ అదెంత వరకూ? నిపుణులేం చెబుతున్నారంటే...
* ప్రతి ఒక్కరికీ తమదైన వ్యక్తిత్వం ఉంటుంది. అది మీ ప్రత్యేకత. దాన్నలా స్వీకరించగలగాలి. అలా కాకుండా మీ శైలికి భిన్నంగా జీవించాల్సొస్తే దాన్ని వ్యతిరేకించడమే మేలు. సర్దుబాటు పేరుతో నచ్చకపోయినా కొనసాగిస్తూ వస్తే తర్వాత మీ ఉనికినే కోల్పోతారు. కాబట్టి, మీ వ్యక్తిత్వానికి భిన్నంగా ఉండాల్సొస్తే ముందే నిరాకరించడం మంచిది.
* భక్తి, సినిమా, రాజకీయాలు.. ఒక్కొక్కరికీ ఒక్కో నమ్మకం. వాటిని ప్రస్తావించే స్వేచ్ఛ ఉండాలి. వాటి విషయంలో నిర్ణయం మీదే అవ్వాలి తప్ప ఎదుటి వారిది కాదు. వాటిని/ వారిని నమ్మొద్దని ఒత్తిడి చేసే అధికారం మీ భాగస్వామికి ఉండకూడదు.
* కెరియర్.. మనం తప్పనిసరిగా రాజీ పడే అంశాల్లో ఇదొకటి. కొనసాగించడం, పక్కనపెట్టడం మీ చేతుల్లో ఉండేలా చూసుకోండి. ఇల్లు, పిల్లల బాధ్యత ఆలుమగలిద్దరిదీ! కాబట్టి, ఈ విషయంగా ఒకరికొకరు అండగా నిలవాలి. అంతేతప్ప ఆటంకంగా మారకూడదు.
* పెళ్లి అయినంత మాత్రాన పాత బంధాల్ని వదిలేయమని కాదు. మనకంటూ స్నేహితులు, బంధువులు ఉంటారు. వారితో మాట్లాడటానికీ, కలవడానికీ అభ్యంతరాలొస్తుంటే.. దాన్ని ప్రారంభంలోనే చర్చించుకోవాలి. బంధాల్ని తెంచుకుంటూ వస్తే... మీకంటూ ఎవరూ మిగలరు. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో సత్సంబంధాలు నెరపాలన్నదీ మీ ఎంపికే అవ్వాలి. ఈ విషయంలోనూ రాజీపడొద్దు.
* ఉద్యోగం చేస్తున్నా, గృహిణి అయినా మీ ఆర్థిక విషయాలను మీరే నిర్వహించుకోండి. మీకంటూ కొంత మొత్తం పక్కన పెట్టుకోవడం, సొంత పెట్టుబడి వంటి వాటిపై దృష్టిపెట్టండి. ఖర్చు చేసిన ప్రతి సారీ భయపడటం, లెక్క చెప్పడం లాంటివి అవతలి వ్యక్తికి మీపై అపనమ్మకానికి చిహ్నమే. దాన్ని కొనసాగించే అవకాశం ఇవ్వకండి.
* పాటలు పాడటం, పుస్తకాలు చదవడం మీకిష్టమా? అవతలి వారికి ఇబ్బంది కలగనంత వరకూ మార్చుకోవాల్సిన పని లేదు. మీ భాగస్వామికి ఇవి నచ్చవా? అయితే వాటికంటూ వేరే సమయం కేటాయించుకోండి. అంతేతప్ప పక్కన పడేయాల్సిన పనిలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.