సోషల్‌ మీడియాలో సురక్షితంగా..

ఆన్‌లైన్‌ మోసాలు, తెలియని ద్వేషం.. ఇవన్నీ చూస్తూ కూడా పిల్లల్ని సోషల్‌ మీడియాలోకి అనుమతించాలంటే.. భయమేగా మరి! టీనేజీలోకి అడుగుపెట్టాక వాళ్లకేమో అమ్మ ప్రేమ ఆంక్షలుగా

Published : 09 Sep 2022 00:53 IST

ఆన్‌లైన్‌ మోసాలు, తెలియని ద్వేషం.. ఇవన్నీ చూస్తూ కూడా పిల్లల్ని సోషల్‌ మీడియాలోకి అనుమతించాలంటే.. భయమేగా మరి! టీనేజీలోకి అడుగుపెట్టాక వాళ్లకేమో అమ్మ ప్రేమ ఆంక్షలుగా కనిపిస్తుంది. మరేం చేద్దాం? నిపుణులిస్తోన్న ఈ సూచనలు పాటించేద్దాం.

* వద్దన్నదాన్నే తెలుసుకోవాలన్న కుతూహలం పెరుగుతుంది. పిల్లలూ ఇందుకు మినహాయింపు కాదు. మన భయాలేమో వాళ్లకర్థం కావు. కాబట్టి, వాళ్లు ఆసక్తి చూపే వాటిని ముందు మీరు వాడి చూడండి. వాటి నియమాలకు అనుగుణంగా పిల్లల వయసు ఉంటే ఖాతా స్వయంగా తెరిచి ఇవ్వండి. లేకపోతే మీ ఖాతానే మీ ఆధ్వర్యంలో ఉపయోగించుకోనివ్వండి.

* కొత్త స్నేహాలు, ఆకర్షణలు టీనేజీలో సహజమే! దీంతో ఎవరు రిక్వెస్ట్‌ పెట్టినా ఓకే చెప్పేస్తుంటారు. సమస్యలు మొదలయ్యేది ఇలాగే! కాబట్టి అమ్మాయిలకే కాదు.. అబ్బాయి అయినా ప్రైవసీ సెట్టింగులను పెట్టండి. వ్యక్తిగత విషయాలు, ఫోన్‌ నంబరు, ఫొటోలు వంటివి ఉంచకుండా చూసుకోండి. తమ ఆనందాన్ని నలుగురితో పంచుకొందామని ఫొటోలు గట్రా ఉంచినా, గిట్టని వాళ్లు చెడుగా ఉపయోగించే ప్రమాదముందని చెప్పండి. పంచుకోవాలనిపించినా.. నలుగురితో ఉన్నవీ, ఎలాంటి ఇబ్బంది తేవనుకున్న వాటినే పెట్టమనండి. తెలియని వారి రిక్వెస్ట్‌లను అంగీకరించడం ద్వారా వచ్చే ప్రమాదాలనీ వివరించండి.

* ‘12345...’ ఒక సర్వే ప్రకారం దేశంలో చాలామంది పాస్‌వర్డ్‌ ఇదేనట! కొన్నిసార్లు పుట్టినరోజు లేదంటే ఏడాది. మర్చిపోతామేమోనన్న భయంతో వీటినే ఎక్కువగా వాడతారట. కానీ ఇలా చేయడం వల్ల అకౌంట్లు హ్యాకయ్యే ప్రమాదమెక్కువ. కాబట్టి బలమైన పాస్‌వర్డ్‌ పెట్టుకోమనండి. అవసరమైతే చెక్‌ చేయండి.

* ఖాతా తెరవడానికి అంగీకరించినంత మాత్రాన ఏం చేసినా వదిలేయమని కాదు. సమయ పరిధి విధించండి. అలాగని మరీ కఠినంగా ఉండకండి. అసలే ఉడుకు రక్తం. వివాదాల్లో చిక్కుకొనే అవకాశమెక్కువ.
ఎలా మెలగాలన్నదీ వివరించాలి.

అయితే వాళ్లపై నిఘా వేసినట్టు మాత్రం ఉండొద్దు. చాటింగ్‌లు గట్రా చూడొద్దు. ఆత్మన్యూనతకు గురవుతారు. ఎవరైనా ఏడిపిస్తున్నా వాళ్లనే కోప్పడక ఎదుర్కొనే మార్గాలను సూచించండి. మొత్తంగా మార్గదర్శిగా ఉండటానికి ప్రయత్నించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని