ఈ వాతావరణం పిల్లలకు విషతుల్యం

పిల్లల అవసరాలను తీరుస్తూ, సంరక్షిస్తే సరిపోదు. పెంపకం ప్రశాంతంగా ఉంటేనే వారు ఉన్నత వ్యక్తులుగా ఎదుగుతారని అంటున్నారు నిపుణులు. లేదంటే అది బాల్యాన్ని విషపూరితం చేసి ప్రతికూల

Published : 11 Sep 2022 00:40 IST

పిల్లల అవసరాలను తీరుస్తూ, సంరక్షిస్తే సరిపోదు. పెంపకం ప్రశాంతంగా ఉంటేనే వారు ఉన్నత వ్యక్తులుగా ఎదుగుతారని అంటున్నారు నిపుణులు. లేదంటే అది బాల్యాన్ని విషపూరితం చేసి ప్రతికూల వ్యక్తులుగా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది వారికీ, సమాజానికీ నష్టమే కలిగిస్తుందని హితవు పలుకుతున్నారు.

పిల్లలకు తల్లిదండ్రులతో ఉండే బంధం వారి జీవితంలో అతి పెద్దపాత్ర వహిస్తుంది. వారి భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. త్యాగం, అంకితభావం, సహనం, దృఢత్వం, ప్రశాంతత, నమ్మకం వంటివి పెద్దవాళ్ల నుంచి చిన్నారులు నేర్చుకుంటారు. అవే వారికి జీవితపాఠాలు. అందుకే తల్లిదండ్రులు సత్ప్రవర్తనతో వ్యవహరించాలి. పిల్లలను ప్రతి చిన్నదానికి కించపరచడం, చిన్నచిన్న తప్పులను ఎత్తి చూపుతూ రాద్ధాంతం చేయడం, తమకు అనుగుణంగా లేరంటూ విమర్శిస్తూ ఉంటే అది వారిపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. వారి మనసు గాయపడుతుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. క్రమేపీ తల్లిదండ్రుల మాటలు పట్టించుకోరు. నిర్లక్ష్యధోరణితో ఉంటారు. అది ఇరువురి మధ్య దూరాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో ఒంటరితనాన్ని ఇష్టపడుతూ, తోటివారితో కలవని వ్యక్తులుగా మిగిలిపోతారు.

అలవాటుగా..
చిన్నచిన్న విషయాలకు కూడా అతి కోపాన్ని ప్రదర్శించి, అంతలోనే అలా దూషించినందుకు ఏడ్వడం లేదా నీ మంచికోసమే చెబుతున్నా అంటూ దుఃఖించడం వంటివన్నీ పిల్లలను అయోమయానికి గురిచేస్తాయి. ఈరకమైన ప్రవర్తనతో మానసికంగా పిల్లలను బలహీనపరుస్తారు. నిత్యం పెద్దవాళ్ల కోపాన్ని చూసి పిల్లలకు అది అలవాటవుతుంది. తర్వాత ఎంత కోప్పడ్డా తేలికగా తీసుకుంటారు. భావోద్వేగాలు లేని వ్యక్తిగా ఎదుగుతారు. సమాజం ఈతరహా వ్యక్తులను అంగీకరించకపోవడంతో ఎటు అడుగువేయాలో తెలియక కుంగుబాటుకు గురవుతారు.

నమ్మకం..
పెద్దవాళ్లు తమ కలలను పిల్లలకు ఆపాదించి, వాటిని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తారు. వారికీ కలలు, లక్ష్యాలుంటాయనుకోరు. తల్లిదండ్రుల ఆజ్ఞలను శిరసావహించలేక, తమ కలలను నెరవేర్చుకోలేక ఒత్తిడికి గురవుతారు. ఇది వారిని చదువులో వెనుకబడేలా చేస్తుంది. ఇతరులతో పోల్చడం, డబ్బు ఖర్చుపెట్టామంటూ విమర్శించడం పిల్లల మనసును గాయపరుస్తాయి. ఆత్మన్యూనతాభావానికి లోనై, తోటివాళ్లపై అసూయాద్వేషాలు పెంచుకుంటారు. తల్లిదండ్రులు తమపై నిఘా ఉంచారని తెలిసి తమపై తాము నమ్మకాన్ని కోల్పోతారు. ఇవన్నీ వారి మెదడును విషపూరితం చేసి, వారి వ్యక్తిత్వం ఇతరులను బాధపెట్టేలా మారుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్