నానీతో ప్రేమగా...

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న ఇళ్లలో పనిలో సాయానికి, చంటిబిడ్డ సంరక్షణకు, అమ్మనో, అత్తగారినో కనిపెట్టుకుని ఉండటానికి... ఇలా దేనికైనా కేర్‌టేకర్లే శరణ్యం. నానీలను ఏర్పాటు చేయడానికి ఏజెన్సీలూ వచ్చాయి. వాళ్లు ఒప్పందం కుదుర్చుకుని మనకో నానీని అప్పజెప్తారు. ఇంతకీ ఆ కేర్‌టేకర్‌తో ఎలా ఉండాలంటే...

Published : 13 Sep 2022 00:08 IST

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న ఇళ్లలో పనిలో సాయానికి, చంటిబిడ్డ సంరక్షణకు, అమ్మనో, అత్తగారినో కనిపెట్టుకుని ఉండటానికి... ఇలా దేనికైనా కేర్‌టేకర్లే శరణ్యం. నానీలను ఏర్పాటు చేయడానికి ఏజెన్సీలూ వచ్చాయి. వాళ్లు ఒప్పందం కుదుర్చుకుని మనకో నానీని అప్పజెప్తారు. ఇంతకీ ఆ కేర్‌టేకర్‌తో ఎలా ఉండాలంటే...

తినకుండా మారాం చేస్తే వదిలేయకుండా కబుర్లు చెబుతూ తినిపించమని చెప్పాలి. అలా చేస్తున్నదీ లేనిదీ గమనించాలి. మందులు వేయాల్సి ఉంటే వేళలు పాటించేలా చూడాలి.

పిల్లలు లేదా వృద్ధులకు అనారోగ్యాలు త్వరగా సోకే ప్రమాదముంది. కనుక నానీ పరిశుభ్రత పాటించేలా చూడటం చాలా ముఖ్యం. డైపర్లు మార్చినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోమని, తినిపించేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు పాటించమని మృదువుగానే అయినా స్థిరంగా చెప్పాలి.

చిన్నారి ఆడుకుంటున్నప్పుడు మొనతేలిన లేదా కోసుకునేలా ఉండే వస్తువులు లేకుండా, స్టవ్వు, పిట్టగోడల దగ్గరకు వెళ్లి ప్రమాదాలు కొనితెచ్చుకోకుండా చూడమని చెప్పాలి.

వంట కూడా తనే చేసేట్టయితే... తరచూ ఒకే రకమైన ఆహారమైతే తినరు కనుక భిన్నంగా తయారుచేయమని చెప్పాలి.

రోజంతా ఇంట్లోనే ఉంటే విసుగు కనుక కాసేపు దగ్గర్లో ఉన్న పార్కుకు తీసికెళ్లి, తిప్పి, సురక్షితంగా తీసుకొచ్చేలా తర్ఫీదివ్వాలి.

నానీకి పెద్ద చదువులు లేకపోయినా జ్వరమొస్తే లేదా దెబ్బ తగిలితే తక్షణ చర్య తీసుకునే, అవసరమైన మాత్ర వేయగలిగే పరిజ్ఞానం ఉండేలా ఎంచుకోవాలి.

ఈ జాగ్రత్తలన్నీ చెప్పి మనవాళ్ల రక్షణ మాత్రం చూసుకుంటే సరిపోదు. మనతో ఉన్నన్ని రోజులూ మన మనిషిగానే ప్రేమగా చూసుకోవాలి. కుదిరినప్పుడల్లా ఆత్మీయంగా మాట్లాడాలి. ఏదైనా అర్థం కాకపోతే విడమరిచి చెప్పాలే గానీ కోపతాపాలకు తావీయకూడదు. మనమిచ్చే జీతం వాళ్లకెంత అవసరమో వాళ్ల సేవ మనకూ అంతే అవసరమని మర్చిపోకూడదు. మిగిలిపోయిన అన్నం, కూరా, చారూ కాకుండా మనం తినేదే పెట్టాలి. ఏది కనిపించకున్నా వెంటనే తనే తీసిందేమోనన్న అనుమానాలకు తావీయొద్దు. ఏజెన్సీవాళ్లు పోలిస్‌ ఎంక్వయిరీ చేసి అలాంటి అలవాట్లేవీ లేవని నిర్థరించుకున్నాకే కొలువు అప్పజెప్తారు. మనమెంత దయ, సానుభూతితో ఉంటే మనవాళ్లని అంత బాధ్యతగా, ఇష్టంగా చూసుకుంటారని గుర్తుంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్