అన్నింటికీ అలకే..

సౌమ్య ఏడేళ్ల కూతురు ప్రతి చిన్న విషయానికీ అలుగుతూ ఉంటుంది. అది అలవాటుగా మారిపోయింది. ఎందుకు అలిగిందో కొన్నిసార్లు సౌమ్యకు కూడా అర్థంకాదు. ఇలా మాటిమాటికీ అలిగే

Published : 17 Sep 2022 00:17 IST

సౌమ్య ఏడేళ్ల కూతురు ప్రతి చిన్న విషయానికీ అలుగుతూ ఉంటుంది. అది అలవాటుగా మారిపోయింది. ఎందుకు అలిగిందో కొన్నిసార్లు సౌమ్యకు కూడా అర్థంకాదు. ఇలా మాటిమాటికీ అలిగే లక్షణాన్ని మొదట్లోనే మాన్పించడానికి ప్రయత్నించాలంటున్నారు నిపుణులు.

కావాల్సినదాన్ని దక్కించుకోవడానికి, పెద్ద వాళ్లను తమవైపు తిప్పుకోవడానికి పిల్లలెక్కువగా ఆశ్రయించే ఎత్తుగడ అలక. విచారంగా లేదా అలక ప్రదర్శిస్తే తమ మాట వింటారన్నది వారి ఆలోచన. చిన్నప్పుడు ముద్దుగానే అనిపించినా, పెద్దైన తర్వాత ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. అలిగినప్పుడు కొందరు గంటలకొద్దీ మాట్లాడకుండా ఒంటరిగా ఉంటారు. ఇది వారిని ఇంట్రావర్ట్‌లుగా మార్చే ప్రమాదం ఉంది. ఈ అలవాటు కొనసాగితే, కుంగుబాటుకూ గురిచేస్తుంది.

గుర్తించి..
కొందరు పిల్లలు తమ హావభావాలను, అభిప్రాయాన్ని, లేదా నచ్చని విషయాన్ని ఎలా వ్యక్తీకరించాలో తెలియక అలుగుతారు. మరి కొందరేమో తమపై తల్లిదండ్రులు ఏకాగ్రత చూపకపోయినా, తమతో సమయం గడపక పోయినా ఆ బాధను అలకగా మార్చుకొంటారు. మనసులోని మాట చెప్పడానికి భయపడినప్పుడూ అలకను ఆశ్రయిస్తారు. ఏది ఏమైనా.. పిల్లలు ఎక్కువగా అలుగుతున్నట్లు గుర్తిస్తే, కారణం తెలుసుకోవాలి. సున్నితంగా మాట్లాడి, వారికి కలుగుతున్న అసౌకర్యం లేదా బాధను తొలగించడానికి ప్రయత్నించాలి.

నియమం..
తామేదైనా తప్పు చేసినప్పుడు కోప్పడిన పెద్ద వాళ్లను చల్లబరచడానికి, చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి పిల్లలు అలుగుతారు. అప్పుడే అమ్మానాన్నా తమతో మాట్లాడతారని ఎదురు చూస్తారు. ఇటువంటప్పుడు పెద్దవాళ్ల ప్రవర్తన సున్నితంగానే ఉండాలి. మరో సారి అలా చేయకుండా అవగాహన కలిగించాలి.

పెద్ద పొరపాటు చేసి అలిగితే మాత్రం వెంటనే దగ్గరకు తీసుకోకూడదు. అలా చేయకుండా ఉండాల్సిందనే ఆలోచన వాళ్లకు వచ్చే వరకూ చూడాలి. కారణమేదైనా ఎక్కువ సేపు
అలిగితే ఊరుకోవద్దు. ఏదైనా కాసేపే అని నియమం పెట్టాలి.

డైరీ..
అలకకు కారణాన్ని డైరీలో రాయడం నేర్పించాలి. అది వారిని ఆ మూడ్‌ నుంచి బయటకొచ్చేలా చేస్తుంది. ఒక్కోసారి ఆ కారణం వారికే సిల్లీగా అనిపించొచ్చు. అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పడం అలవాటు చేస్తే అలకను మర్చిపోతారు. వారితో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడిపితే అదీ సంతోషాన్నిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్