బాధ్యత తెలిసేలా..

రాము స్కూల్‌లో ప్రతిరోజూ పుస్తకం లేదా పెన్సిల్‌ వంటివి ఏదో ఒకటి పోగొట్టుకొని ఇంటికొస్తాడు. రమ్య తన పని కూడా తాను చేసుకోదు. ఇలా పిల్లలు వారి పనులపై వారికే ఆసక్తి లేకుండా ఉంటే

Published : 18 Sep 2022 00:34 IST

రాము స్కూల్‌లో ప్రతిరోజూ పుస్తకం లేదా పెన్సిల్‌ వంటివి ఏదో ఒకటి పోగొట్టుకొని ఇంటికొస్తాడు. రమ్య తన పని కూడా తాను చేసుకోదు. ఇలా పిల్లలు వారి పనులపై వారికే ఆసక్తి లేకుండా ఉంటే భవిష్యత్తులో బాధ్యత తెలియని వ్యక్తులుగా ఎదిగే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. బాల్యం నుంచే బాధ్యత తెలిసేలా పెంచాలంటున్నారు.

పిల్లలు ఏదైనా వస్తువు కనిపించడం లేదనుకున్నారనుకోండి. వాటిని తిరిగి కొనిస్తే, వాటి విలువ, వస్తువును జాగ్రత్తగా ఉంచుకోవాలన్న బాధ్యత వారికి ఎప్పటికీ తెలీదు. పోగొట్టినా అమ్మానాన్నా కొనిస్తారనే భరోసాతో ఉంటారు. కాబట్టి, ఇంట్లో హోంవర్క్‌ చేసిన తర్వాత తమ పుస్తకాలు, రబ్బరు, పెన్సిల్‌ వంటివి సర్దుకునేలా చూడండి. అవసరమైతే హెచ్చరించాలి. పోగొట్టుకుంటే పదే పదే కొనివ్వనని చెప్పాలి. అప్పుడే వారికి బాధ్యత అలవడుతుంది. స్కూల్‌ నుంచి వచ్చేటప్పుడూ బ్యాగులో అన్నీ ఉన్నాయా లేదా అని చెక్‌ చేసుకోవడం అలవాటు చేసుకుంటారు.

భాగస్వామ్యం..
పచారీ సామాన్లు కొనడానికి వెళ్లినప్పుడు పిల్లలనూ తీసుకెళ్లాలి. కావాల్సిన సామాన్ల వివరాలను కాగితంపై రాసే పని వారికప్పజెప్పాలి. దుకాణానికి వెళ్లాక పట్టికలో ఉన్న సామాన్లన్నీ కొంటున్నామో లేదో చెక్‌ చేసే పని వారికే ఇవ్వాలి. బిల్‌ కట్టిన తర్వాత బ్యాగులో అవన్నీ ఉన్నాయా లేదా చూడమనాలి. ఇవన్నీ వారికి బాధ్యత నేర్పుతాయి. మన సామాన్లు అనే భావన వారిలో మరింత బాధ్యతగా చూసుకోవాలనే ఆలోచనను కలిగిస్తుంది. ఈ అలవాటు వారిని బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదిగేలా చేస్తుంది.

చదువుసహా..
కందిపోతారనో, అలసిపోతారనో ఆలోచించక ఇంట్లోనూ కొన్ని పనులను అప్పగించాలి. మంచినీటి సీసాలు నింపడం, మొక్కలకు నీళ్లు పోయడం, అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు ప్లేట్లు, మంచినీళ్ల గ్లాసులు సర్దమనడం వంటి చిన్నచిన్న పనులు అలవాటు చేయాలి. వారి దుస్తులను వాళ్లనే అలమరల్లో సర్దుకోమనడం, బొమ్మలను దాయడం, వారానికొకసారి వారి గదిని వారే శుభ్రపరచాలని చెప్పడం వంటివీ బాధ్యతలను నేర్పిస్తాయి. క్రమేపీ వారి పనులను వారే చేసుకోవడం మొదలుపెడతారు. మొదట బద్ధకించినప్పుడు మనమూ వారికి సాయం చేస్తే చాలు. నెమ్మదిగా నేర్చుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్