ఓ ప్రశంస.. నాలుగు కబుర్లు..
స్నేహితులతో గంటల తరబడి కబుర్లు చెప్పేవారు, భాగస్వామితో కనీసం నాలుగు మాటలు మాట్లాడటానికి ఆసక్తి చూపరు. రోజులో ఎవరికో ఒకరికి థ్యాంక్స్.. లేదా మీ డ్రెస్‌సెన్స్ బాగుందనో
స్నేహితులతో గంటల తరబడి కబుర్లు చెప్పేవారు, భాగస్వామితో కనీసం నాలుగు మాటలు మాట్లాడటానికి ఆసక్తి చూపరు. రోజులో ఎవరికో ఒకరికి థ్యాంక్స్.. లేదా మీ డ్రెస్‌సెన్స్ బాగుందనో మెచ్చుకునే వారికి భాగస్వామిని పొగడాలనిపించదు. భార్యాభర్తలు ఒకరినొకరు రోజుకి ఒకసారైనా ప్రశంసించుకోవడం, వీలైతే నాలుగు కబుర్లు చెప్పుకొనే అలవాటుంటే..ఆ ఆలుమగల అనుబంధం మరింత పెరుగుతుందట.
భార్యాభర్తల మధ్య ఒకరిపై మరొకరికి ఉండే బాధ్యతల్లో ఇలా ప్రశంసించడం కూడా ఒకటి. అయితే అవతలివారి ప్రత్యేకతను గుర్తించి మరీ ప్రేమగా చెప్పాలంటున్నారు నిపుణులు. కుటుంబ అవసరాల నుంచి పిల్లల బాధ్యతలవరకు పంచుకుంటూ.. ఒకరి కోసం మరొకరు జీవిస్తున్నప్పుడు భాగస్వామిని మెచ్చుకుంటే తప్పేముంది. అలాచేస్తే అవతలి వ్యక్తి మరింత ఆనందపడతారు. వారు ఇంకా ఎక్కువగా ప్రేమించడం మొదలుపెడతారు. తమ ప్రత్యేకతలను గుర్తించిన వ్యక్తి దొరికారని సంబరపడతారు. ఎదుటివారు మన మనసుకు నచ్చిన పనిచేసినప్పుడు ఆ సంతోషాన్ని నిశ్శబ్దంగా అనుభవించడం లేదా ఇది తన బాధ్యత కదా అని భావించకుండా.. వెంటనే వాళ్లకి కృతజ్ఞతలు చెప్పగలిగితే చాలు.
కారణంతో.. దంపతులైనంత మాత్రాన ఎదుటివారి అవసరాలను గుర్తిస్తూ ప్రతిక్షణం వారి కోసమే అన్నట్లుగా బాధ్యతాయుతంగా నడుచుకోవాలనే నియమం లేదు. ఎవరికివారు ఉద్యోగాల్లో బిజీగా ఉంటున్న ఈ కాలంలోనూ బయట తమ ఒత్తిళ్లను భరిస్తూనే, మీ గురించి ఆలోచించే భాగస్వామిని మీరు గుర్తించాలి. తను అందిస్తున్న చేయూతను కారణంగా చెప్పి మరీ.. థ్యాంక్స్ చెప్పాలి. అవతలివారు దాన్ని తమ బాధ్యత అన్నా.. కూడా .. ఆ ఆలోచనకూ కృతజ్ఞత చూపాలి. ఏదో పదాల్లో చెప్పకుండా దగ్గరకు తీసుకోవడం లేదా ప్రేమగా చిన్న కానుకనివ్వడం ద్వారా మీరు చెప్పే థ్యాంక్స్ వారిని పరవశింపచేస్తాయి.
సమయం.. ఎంత బిజీలో ఉన్నా రోజులో ఏదో ఒక సమయాన్ని దంపతులు తమ కోసం కేటాయించుకోవాలి. ఆ రోజు ఎదురైన అనుభవాలు, విశేషాలు వంటివన్నీ పంచుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే ఇరువురూ కలిసి పరిష్కరించుకోవాలి. అలాగని పూర్తిగా కష్టాలు, సమస్యలే కాకుండా సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి. మరుసటి రోజుకి మనసంతా హాయిగా అనిపించేలా ఇరువురూ తమ మనసుల్లోని ఒత్తిడిని తరిమేసేలా కబుర్లు కలబోసుకొంటే చాలు. ప్రతి రోజూ తాజాగా, అప్పుడే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టినట్లుగా అనిపించి ఆ బంధం నిత్యనూతనంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.