అభ్యాసంతోనే ఆత్మవిశ్వాసం

సుధ కొడుక్కి ఎనిమిదేళ్లు. ఏ పని చెప్పినా వెంటనే చేయలేనంటాడు. నా వల్లకాదని తెలుసుగా అని వెళ్లిపోతాడు. తనకు ఆ సామర్థ్యం లేదనుకుంటాడు. ప్రయత్నిస్తే ఏ పనైనా చేయగలననే ఆత్మవిశ్వాసం చిన్నప్పటి నుంచి చేయించే అభ్యాసంతోనే వస్తుందంటున్నారు నిపుణులు.

Published : 22 Sep 2022 00:59 IST

సుధ కొడుక్కి ఎనిమిదేళ్లు. ఏ పని చెప్పినా వెంటనే చేయలేనంటాడు. నా వల్లకాదని తెలుసుగా అని వెళ్లిపోతాడు. తనకు ఆ సామర్థ్యం లేదనుకుంటాడు. ప్రయత్నిస్తే ఏ పనైనా చేయగలననే ఆత్మవిశ్వాసం చిన్నప్పటి నుంచి చేయించే అభ్యాసంతోనే వస్తుందంటున్నారు నిపుణులు.

చిన్నారులు తమలో అంతర్లీనంగా ఉండే ధైర్యం, సామర్థ్యం, నైపుణ్యం వంటివి గుర్తించలేరు. వీటిని బయటకు తీసుకురావడానికి అమ్మానాన్నలే ప్రయత్నించాలి. దీనికోసం వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి. నువ్వు చేయగలవు, చదవగలవంటూ ఇలా ప్రోత్సాహకరంగా చెబుతూ ఉండాలి. వారు సమర్థులనే నమ్మకాన్ని కలిగించాలి. తను గతంలో పూర్తిచేసిన హోంవర్క్‌, తరగతిలో పొందిన మంచి మార్కులు, ప్రశంసలు వంటివి గుర్తు చేస్తుండాలి. ఇవన్నీ పిల్లలను తమను తాము నమ్మేలా చేస్తాయి. ఏదైనా వైఫల్యం ఎదురైనప్పుడు... అది సహజమే, ధైర్యంగా ఉండు, మరోసారి ప్రయత్నించి గెలవాలని నవ్వుతూ చెప్పాలి. అది వారిని మానసికంగా ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. 

ప్రతిరోజూ..

సొంతంగా డైరీ రాయడం అలవాటు చేయాలి. ఆ రోజు చదివినవి, పొందిన ప్రశంసలు, విమర్శలు వంటివన్నీ అందులో పొందుపరచమని చెప్పాలి. సంతోషాన్నిచ్చిన సందర్భాల్నీ రాయించాలి. నిద్రపోయే ముందు వాటిని ఓసారి చదవమనాలి. ఆ రోజు పిల్లలకు కలిగిన అనుమానాలను తీర్చాలి. వారి సమస్యలను అడిగి పరిష్కారాన్ని చూపాలి. తన గురించి ప్రత్యేకంగా ఓ పేజీ కేటాయించుకోమని, అందులో ఆ రోజు తన మనసుకు అనిపించిన ప్రత్యేకతలు, అమ్మానాన్న చూపించిన ప్రేమ, తాను చేసిన తప్పులు వంటివన్నీ రాయమనాలి. బాధ, సంతోషం.. ఏదైనా అందులో నింపమనాలి. అంతేకాదు, ఆ రోజు నేర్చుకున్న కొత్త విషయాన్ని కూడా రాయించాలి. ఇది వారికి ఆ రోజు సంపూర్ణంగా పూర్తయిన అనుభవాన్ని అందిస్తుంది. ప్రశాంతంగా నిద్రపోతారు. మరుసటి రోజుకి మనసులో ఏ ఆందోళన, ఒత్తిడీ లేకుండా నిద్రలేస్తారు. దేనికైనా తాము సమర్థులమనే ఆత్మవిశ్వాసంతో రోజుని ప్రారంభిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని