ఈ సెలవుల్లో ఏం చేయిద్దాం?
నవరాత్రుల్లో మనమేమో పూజలతో హడావుడిగా ఉంటాం. పిల్లలకేమో సెలవులు. వాళ్లేమో ఏమీ తోయడం లేదంటూ గోల పెడుతుంటారు. పండగ వైశిష్ట్యం తెలియజేస్తూనే.. వాళ్లూ ఉత్సాహంగా గడిపేయాలా! అయితే....
నవరాత్రుల్లో మనమేమో పూజలతో హడావుడిగా ఉంటాం. పిల్లలకేమో సెలవులు. వాళ్లేమో ఏమీ తోయడం లేదంటూ గోల పెడుతుంటారు. పండగ వైశిష్ట్యం తెలియజేస్తూనే.. వాళ్లూ ఉత్సాహంగా గడిపేయాలా! అయితే....
* నవరాత్రులు, బతుకమ్మ.. వీటి వెనుక కథలను చెప్పండి. దసరా ఎందుకు చేసుకుంటామో వివరించండి. శ్రద్ధగా వింటారు. దీని ద్వారా సంప్రదాయాన్ని పరిచయం చేసిన వారవుతారు. పురాణ కథల పుస్తకాలను కొనడమో, వాటిని నెట్‌లోంచి ప్రింట్ తీసివ్వడమో చేయండి. చదివి వాళ్లకేం అర్థమైందో చెప్పమనాలి. లేదా రాయమనండి. దీంతో పుస్తక పఠనం అలవాటవుతుంది. అప్పుడప్పుడూ క్విజ్, పరీక్షల్లా పెట్టి బహుమతులివ్వండి. ఇంకాస్త ఉత్సాహంగా కొనసాగిస్తారు.
* పండగలంటే ఎంత పని? ఇల్లు శుభ్రం చేయడం, సర్దడం వంటివన్నీ ఒక్కరే చేయకండి. పూలు కోయడం, పూజగది అలంకరణలో సాయం, వస్తువులు తుడవడం వంటివి పిల్లలకు అప్పజెప్పండి. భోజనాలు సర్దడం, అందరికీ మంచినీరు అందించడం లాంటివీ చేయించండి. వేడుకలతో ఆనందమే కాదు.. దాని వెనక ఉండే శ్రమా అర్థమవుతుంది. బాధ్యతా అలవాటవుతుంది.
* క్లే, కలర్ పేపర్లు, చార్టులు తెచ్చిపెట్టండి. వాటితో అమ్మవారు, రావణుడి బొమ్మలు తయారు చేయమనండి. ఒక్కసారిగా చేయాలంటే వాళ్లకీ కష్టమే! యూట్యూబ్ వీడియోల సాయం తీసుకోమనచ్చు. వాటిని ఇంట్లో అలంకరణ వస్తువులుగా ఉంచడమో, ఫ్రేములుగా చేసి గోడలకు వేలాడదీస్తే కొత్త ఆలోచనలకు పదును పెడతారు. తద్వారా సృజనాత్మకతా అలవడుతుంది.
* పిల్లలందరినీ ఓ చోట చేర్చండి. వారాంతాల్లో వాళ్లకి నచ్చిన ఆహార పదార్థాలు తయారు చేయండి. బయటికి తీసుకెళ్లడమో, ఇంట్లోనే పార్టీలా ఏర్పాటు చేస్తే సరి. నలుగురిలో కలవడం, వాళ్ల వస్తువులు పంచుకోవడం అలవాటవుతుంది. ఫొటో సెషన్‌నీ ఏర్పాటు చేస్తే వాళ్లకీ మంచి జ్ఞాపకాలు ఇచ్చినవారవుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.