ఏవండీ ఆ ఫోన్‌ వదులుతారా

‘ఏమండోయ్‌..’ అంటూ భార్య పిలుస్తోందట. ఆయన మాత్రం తీక్షణంగా మొబైల్‌లో మునిగిపోయున్నారు. చూసీచూసీ ఆవిడ మొబైల్‌లో మెసేజ్‌ పెట్టింది. దాన్ని చూసి నాలుక్కరుచుకుని స్పందించాడట.

Published : 13 Oct 2022 00:23 IST

‘ఏమండోయ్‌..’ అంటూ భార్య పిలుస్తోందట. ఆయన మాత్రం తీక్షణంగా మొబైల్‌లో మునిగిపోయున్నారు. చూసీచూసీ ఆవిడ మొబైల్‌లో మెసేజ్‌ పెట్టింది. దాన్ని చూసి నాలుక్కరుచుకుని స్పందించాడట. కాస్త హాస్యాస్పదంగా ఉన్నా.. చాలా ఇళ్లలో ఇలాంటి ఘటనలు మామూలయ్యాయంటున్నారు నిపుణులు. చాలా యువ జంటలు విడిపోవడానికీ ఇదే కారణమట. ఈ తీరు ప్రమాదమనీ చెబుతున్నారు..

* మిగతా రోజుల్లో ఎలాగున్నా సెలవు దినాల్లో ఇద్దరూ ఫోన్‌ని పక్కన పడేయండి. ఒక్కోసారి అలాంటి సందర్భాల్లోనూ ఉపయోగించడం తప్పనిసరవ్వచ్చు! అప్పుడు భాగస్వామికి చెప్పి, పని పూర్తయ్యే వరకూ వాడొచ్చు. రోజులో కొన్ని గంటలూ ‘నో మొబైల్‌ టైమ్‌’గా నిర్ణయించుకోవాలట. అంటే ఆ సమయం పూర్తిగా కుటుంబానికే అన్న మాట. అప్పుడు సరదాగా కబుర్లు, ఆటలు లాంటి వాటితో గడపాలి.

* ఇంట్లోనూ కొన్ని ‘మొబైల్‌ ఫ్రీ జోన్స్‌’ను కేటాయించుకోవాలి. భోజనాలు చేస్తున్నారనుకోండి.. అక్కడ ఇంటికి సంబంధించిన చర్చలే రావాలి. అంటే ఎవరికి వారు వాళ్ల లోకంలో ఉండిపోకూడదు. కాబట్టి, అక్కడ ఫోన్‌ను నిషేధించొచ్చు. పడకగది, పిల్లల స్టడీ టేబుల్‌ ఇలాంటి చోట్ల మనమూ వీటికి దూరంగా ఉంటే.. నాణ్యమైన సమయాన్ని కుటుంబంతో గడపొచ్చు.

* వంట, ఇల్లు చక్కదిద్దుకోవడం.. ఎంత శ్రమతో కూడుకున్నవి. ఆలోచిస్తేనే అలసటొచ్చేస్తుంది కదూ! ఈసారి శ్రీవారితో కలిసి చేసి చూడండి. వేగంగా పూర్తవడమే కాదు. సరదాగానూ ఉంటుంది. ఒకరి ఆలోచనలు ఇంకొకరు తెలుసుకోవడానికీ ఇది సాయపడుతుంది.

* ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నా.. తోచడం లేదంటూ మనసు సోషల్‌ మీడియాకేసి వెళ్లిపోతుంటుంది. దానిలో పడితే సమయం ఎలా గడిచిందీ తెలీదు. అలాంటప్పుడు బలవంతంగానైనా కలిసి నడవడం, బయటకు వెళ్లడం లాంటివి చేస్తే బంధం బలపడుతుంది. మనసుకీ ఉల్లాసంగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని