ఈ అలవాట్లతో ఆనందంగా..

రాగిణికి తెల్లవారుతుందంటేనే బోరు కొడుతున్నట్లు అనిపిస్తుంది. రోజంతా ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటుంది. ఈ ఆలోచన లొస్తున్నాయంటే ఈ కింది అలవాట్లు నేర్చుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

Published : 30 Oct 2022 00:34 IST

రాగిణికి తెల్లవారుతుందంటేనే బోరు కొడుతున్నట్లు అనిపిస్తుంది. రోజంతా ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటుంది. ఈ ఆలోచన లొస్తున్నాయంటే ఈ కింది అలవాట్లు నేర్చుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

నవ్వుతూ.. ముఖంపై చిరునవ్వు చెదరకూడదు. నవ్వడంవల్ల మెదడులో డోపమైన్‌ విడుదలై మరింత సంతోషాన్నిస్తుంది. అలాగని తెచ్చి పెట్టుకున్నట్లుగా కాకుండా మనస్ఫూర్తిగా నవ్వాలి. ఆ భావం మనసును ఉత్సాహ పరుస్తుంది. నిద్ర లేవగానే అద్దంలో చూసుకొంటూ.. ఓసారి నవ్వి చూడండి. ఉల్లాసంగా రోజు మొదలవ్వడమే కాదు, ప్రతికూల ఆలోచనలూ.. రావు. నవ్వు ముఖ కండరాలకు వ్యాయామంగా మారి రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. దీంతో మీ ముఖారవిందం మరింత అందాన్ని తెచ్చిపెట్టుకుంటుంది. మరింకెందుకాలస్యం.. ఉదయం లేవగానే కోపం, విసుగులను దూరంగా నెట్టేసి, ఓసారి హాయిగా నవ్వేయండి. 

వ్యాయామం.. ఉదయం శరీరమంతా బద్ధకంగా అనిపించొచ్చు. కండరాలకు కాస్తంత కదలిక వచ్చేలా చిన్నచిన్న వ్యాయామాలు చేస్తే చాలు. శరీరం ఉత్సాహాన్ని తెచ్చుకుంటుంది. లేదంటే రోజంతా ఆ బద్ధకం అలాగే ఉండి, ఏ పనీ చేయబుద్ధి కాదు. నిరుత్సాహంగానూ అనిపిస్తుంది. వ్యాయామంతో రోజుని ప్రారంభిస్తే ఎంతో ఆరోగ్యం. ఒత్తిడి, ఆందోళన వంటివీ.. దూరమై సంతోషం, ఆత్మవిశ్వాసం దరిచేరతాయి. ఇవన్నీ ముఖంలో ప్రతిఫలించి అందం, ఆరోగ్యం రెండూ సొంతమవుతాయి.

నిద్ర.. రాత్రి మంచంపైకి చేరడానికి రోజూ నిర్ణీత సమయాన్ని పాటించాలి. 6-7 గంటల సమయాన్ని నిద్రకు కేటాయిస్తేనే, తెల్లారే సరికి మెదడు ఉత్సాహంగా ఉంటుంది. రోజంతా చురుకుగా పని చేయగలుగుతుంది. లేదంటే అలసటగా అనిపించి, సమయం దొరికితే చాలు.. చిన్న కునుకు వేద్దామా అనిపిస్తుంటుంది. ఏ పనిపైనా.. ఆసక్తి రాదు.

కృతజ్ఞతగా.. మనిషిగా జీవించగలిగే అదృష్టం కలుగుతున్నందుకు కృతజ్ఞతగా ఉండాలి. ఎన్నో అనారోగ్యాలు, కష్టాలు, సమస్యలమధ్య బతుకుతున్న వారికన్నా మన పరిస్థితి నయం కదా అనుకోవాలి. అప్పుడే జీవితాన్ని ప్రేమించగలుగుతాం. రోజూ ఎవరికైనా చిన్న సహాయాన్ని చేయాలనే నియమం ఎంతో ఆనందాన్నిస్తుంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటూ.. ప్రతి నిమిషాన్నీ సంతోషంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తే చాలు... అంతా ఆనందమే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్