కోపం వచ్చిందా...

సరళకు పిల్లలు మాట వినక పోయినా, భర్త తన మాట లెక్క చేయకపోయినా పట్టలేని కోపమొస్తుంది. వెంటనే చేతిలో ఉన్న ఏ వస్తువునైనా విసిరి కొడుతుంది. అంతలోనే బాధ పడుతుంది. కోపాన్ని ఎలా అదుపు చేయాలో తెలుసుకోవాలంటున్నారు నిపుణులు.

Published : 04 Nov 2022 01:11 IST

సరళకు పిల్లలు మాట వినక పోయినా, భర్త తన మాట లెక్క చేయకపోయినా పట్టలేని కోపమొస్తుంది. వెంటనే చేతిలో ఉన్న ఏ వస్తువునైనా విసిరి కొడుతుంది. అంతలోనే బాధ పడుతుంది. కోపాన్ని ఎలా అదుపు చేయాలో తెలుసుకోవాలంటున్నారు నిపుణులు.

ఎదుటి వ్యక్తులు మర్యాదనివ్వకపోయినా, నిర్లక్ష్యం చేసినా, మాట వినకపోయినా వెంటనే కోపమొస్తుంది. సకాలంలో దీన్ని సమన్వయం చేయలేకపోతే ఎన్నో అనర్థాలకు దారి తీసే ప్రమాదం ఉంది. కోపం అనేది భావోద్వేగాలకు ప్రతిరూపం. ఇలా కోపం రాకపోయినా అది మరొక అనారోగ్యంగా మారే అవకాశం ఉంది. కోపాన్ని నియంత్రించుకోవడం కన్నా, దాన్ని హుందాగా వ్యక్తీకరించే మార్గాల్ని తెలుసుకుని ఆచరించడం మంచిదంటున్నారు నిపుణులు. అవధుల్లేని ఆవేశం, గోడకేసి చేతిని గుద్దుకోవడం, చేతిలో ఏదుంటే దాన్ని విసిరి కొట్టడం, నోటికొచ్చినట్టు మాట్లాడటం వంటివి చేయకపోతే మంచిది. 

గుర్తించాలి.. ఎటువంటి సందర్భాల్లో కోపం వస్తుందో గుర్తించాలి. అటువంటప్పుడు సంభాషణ పొడిగించద్దు. ఆ కాసేపు మౌనంగా ఉండాలి. అక్కడి నుంచి నాలుగడుగులు దూరంగా వెళ్తే, ఎమోషనల్‌ ఎనర్జీ తగ్గుముఖం పడుతుంది. ఆ తర్వాత ఒంటరిగా, ప్రశాంతంగా ఆలోచించాలి. అసలు సమస్య ఎక్కడ పుట్టింది, చర్చ ఎలా సాగింది, పరిస్థితి ఇలా మారడానికి కారణాలు... వంటివన్నీ సమీక్షించుకోవాలి. ఈ విరామం మనసును లోతుగా ఆలోచించేలా చేసి, కోపానికి సరైన కారణాన్ని తెలిసేలా చేస్తుంది. తప్పు ఎవరివైపు ఉందో తెలుసుకోవచ్చు. ఆవేశాన్ని ప్రదర్శించినందుకు అవతలి వారిని క్షమించమని అడగడంతో ఆవేశం చోటులో ప్రశాంతత నెలకొంటుంది.

భావాలను.. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా కోపం నియంత్రణలోకి రావడం లేదంటే మనసు ఆలోచించే స్థాయికి చేరుకోలేదని అర్థం. ఆ సమయంలో వచ్చే ఆలోచనలు, భావోద్వేగాలను ఓ కాగితంపై రాయాలి. ఎవరిపై కోపం వచ్చిందో, ఎందుకొచ్చిందో వంటి వాటికి అక్షర రూపమివ్వాలి. ఇలా చేసినప్పుడు కోపం స్థాయి తగ్గి, మెదడు ప్రశాంతంగా ఆలోచించే స్థితికి చేరుతుంది.

నిర్ణయాలొద్దు... సందర్భమేదైనా కోపం వచ్చినప్పుడు ఎదుటి వారితో చర్చ కొనసాగించొద్దని, కాసేపాగి మాట్లాడదామని చెప్పాలి. ఆ కొంతసేపు ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించాలి. నెమ్మదిగా ఒత్తిడి దూరమవుతుంది. ఇటువంటప్పుడు ఆత్మనింద వద్దు. మనసుతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే, పరిష్కారం దొరుకుతుంది. కోపంలో నిర్ణయాలు తీసుకోకుండా, కాస్తంత విరామం తర్వాత తిరిగి ఆలోచించి అడుగేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్