క్షమించడం నేర్పించండి!

తన పిల్లల జీవితం ఆడుతూ పాడుతూ సాగిపోవాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. ఒత్తిడి ఎరుగని అలాంటి జీవితాన్ని ఇవ్వాలనుకుంటే క్షమించడం నేర్పమంటున్నారు నిపుణులు.

Published : 10 Nov 2022 00:11 IST

తన పిల్లల జీవితం ఆడుతూ పాడుతూ సాగిపోవాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. ఒత్తిడి ఎరుగని అలాంటి జీవితాన్ని ఇవ్వాలనుకుంటే క్షమించడం నేర్పమంటున్నారు నిపుణులు.

* మీకిద్దరు పిల్లలున్నారు. చిన్నోడి బొమ్మ పెద్దోడు తీసుకున్నాడు. చిన్నవాడు ఏడ్చి, గోల చేసినా ఇవ్వలేదు. మీరు బుజ్జగించో, బెదిరించో తిరిగి ఇప్పించారు. సారీ కూడా చెప్పించారు. అది అంతటితో ముగిస్తే సరే! కానీ అసలెందుకు తీసుకున్నావని గొడవ పెట్టుకుంటే? తనని ఏడ్పిస్తున్నాడని చిన్నవాడు పెద్దవాడిపై ద్వేషం పెంచుకుంటే? ఇద్దరి మధ్యా సఖ్యత ఎప్పటికీ సాధ్యం కాదు. పైగా కోపం పిల్లల్లో మానసిక ఒత్తిడికీ కారణం అవుతుందట. సాధారణంగా మనం ఇళ్లలో ‘క్షమాపణ’ అడగడం నేర్పిస్తాం. అంటే చేసిన తప్పు ఏమిటో తెలిసేలా చేస్తాం. అది సరిపోదు. ‘క్షమించడాన్నీ’ నేర్పించాలి.

* సరేలే చిన్న విషయమని వదిలేయడం, నాది నాకు తిరిగొచ్చిందిగా చాలు.. క్షమించడం వెనకున్న పరమార్థమిదేగా! ఈ లక్షణం అలవడటం పిల్లల్లో పరిపక్వతకు నిదర్శనం. అంతేకాదు ప్రతి విషయాన్నీ అవతలి వ్యక్తి కోణం నుంచి కూడా ఆలోచించే నైపుణ్యం అలవడుతుంది. ఇవి బంధాన్ని బలపరచడమే కాదు మానసిక ప్రశాంతతా చేకూరుస్తాయి. అందుకే ఈ లక్షణాన్ని చిన్నతనం నుంచే నేర్పించమంటున్నారు నిపుణులు.

* పిల్లల గొడవే తీసుకోండి. ఒకరికి సారీ చెప్పమనీ, మరొకరికి సారీ చెప్పాడుగా క్షమించెయ్‌ అనీ ఊరుకోవద్దు. తీసుకోవడానికి కారణం అడుగుతూనే క్షమ వల్ల లాభాలను చెప్పగలగాలి. ఇలా చేస్తుంటే వాళ్లే నెమ్మదిగా ఆలోచించడం మొదలుపెడతారు. అయితే ఇది ఏం చేసినా సర్దుకుపోయేలా ఉండకూడదు. అందుకే తనెంత బాధ పడ్డాడో చెబుతూనే క్షమించడానికి కారణాన్నీ వివరించమనండి. అప్పుడే మళ్లీ మళ్లీ తప్పు చేయకుండా ఉంటారు. దేనికి క్షమించాలి, ఏ విషయంలో అవతలి వ్యక్తికి దూరంగా ఉండాలన్న దానిపైనా స్పష్టత ఇచ్చినవారవుతారు.

* ఎన్ని చెప్పినా మీరూ పాటిస్తుంటేనే పిల్లలూ మిమ్మల్ని అనుసరిస్తారు. చిన్న చిన్న వాటికి కోప్పడినా.. వాళ్లు సారీ చెప్పగానే ‘సరే.. క్షమించేశా’ అన్న మాట తప్పక ఉపయోగించండి. అప్పుడే వాళ్లపై బలమైన ముద్ర పడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని