గొడవైంది సరే.. తర్వాతేంటి?

కలహాల్లేని కాపురం, అన్యోన్య దాంపత్యం కావాలని ఎవరికుండదు? కానీ వేర్వేరు మనస్తత్వాలు ఉండే వ్యక్తుల మధ్య చిన్న విభేదాలు, కలహాలంటూ రాకుండా ఉంటాయా!

Published : 18 Nov 2022 00:16 IST

కలహాల్లేని కాపురం, అన్యోన్య దాంపత్యం కావాలని ఎవరికుండదు? కానీ వేర్వేరు మనస్తత్వాలు ఉండే వ్యక్తుల మధ్య చిన్న విభేదాలు, కలహాలంటూ రాకుండా ఉంటాయా! నిజానికి అప్పుడప్పుడూ గిల్లికజ్జాలు రావాలంటారు నిపుణులు. అప్పుడే ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోవడం సాధ్యమవుతుందట. అయితే వాటిని పరిష్కరించుకోవడంపైనా అంతే దృష్టిపెట్టాలంటున్నారు.

* దెబ్బలాడుకున్నారు.. సరే! వెంటనే అవతలి నుంచి సారీ ఆశించకండి. కొద్ది సేపు ఇద్దరూ విరామం తీసుకోండి. ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. అప్పటికప్పుడు వెనక్కి తగ్గి సారీ చెప్పినా, దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా.. రెండూ పొరపాటే. నిజానికి ఆ సమయంలో తీసుకునే ఏ నిర్ణయమూ సరి కాకపోవచ్చు. కారణం భావోద్వేగాలు ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి, బయటికి వెళ్లడమో, ఒంటరిగా ఆలోచించుకోవడమో మంచిది.

* అసలెందుకు కోపమొచ్చింది? పోనీ ఎందుకు బాధనిపించిందో ఆలోచించండి. కొన్ని పదాలు, వ్యాఖ్యలు అనేవారికి సాధారణం అనిపించొచ్చేమో! కాకపోతే మీకవి నచ్చకపోవచ్చు. అలాంటి వాటిన్నింటినీ గుర్తుకు తెచ్చుకొని శాంతించాక భాగస్వామితో పంచుకోండి. మీ మానసిక స్థితి వారికి అర్థమవ్వడమే కాదు.. భవిష్యత్తులో వాటిని ఉపయోగించకుండానూ ఉంటారు.

* గొడవకు నువ్వు కారణమంటే నువ్వంటూ నిందించుకోవద్దు. ఎవరు మొదలుపెట్టినా చెరో మాట అనడమే అది పెరగడానికి కారణం. కాబట్టి, మీలోపాలేంటో మీరు సమీక్షించుకొని అంగీకరించండి. అవసరమైతే క్షమాపణ చెప్పాలి. ఇద్దరూ ఇలా ఆలోచించుకున్నప్పుడే ఒకరిపై మరొకరికి నమ్మకం, విలువ ఏర్పడతాయి.

* హమ్మయ్యా.. మాట్లాడేసుకున్నాం.. ఇంతటితో గొడవకు ముగింపు అనుకోకండి. కోపమొచ్చినపుడు అవతలి వ్యక్తి ఏం చేయాలన్నదీ మాట్లాడుకోవాలి. ఎలా ప్రవర్తించాలన్నదీ చర్చించుకోవాలి. ఉదాహరణకు- కోపంలో ఉన్నప్పుడు ఒక పువ్వు ఇస్తేనో, నచ్చిన స్వీట్‌ చేయడం ద్వారానో మిమ్మల్ని మెప్పించొచ్చా.. చెప్పేయండి. అవతలి వారి విషయంలోనూ కనుక్కోండి. మనస్పర్థలు వచ్చినప్పుడు వాటిని పాటిస్తే.. గిల్లికజ్జాలతో ఎక్కువ సమయం వృథా కాకుండా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్