ఇలా చేస్తే.. బాక్సు ఖాళీ!

ఉదయాన్నే నానా హడావుడీ పడుతూ లంచ్‌ బాక్స్‌ సిద్ధం చేస్తాం. ఈ గడుగ్గాయిలేమో అరకొరగా తిని మిగిల్చి మళ్లీ తెచ్చేస్తారు.

Published : 21 Nov 2022 00:21 IST

ఉదయాన్నే నానా హడావుడీ పడుతూ లంచ్‌ బాక్స్‌ సిద్ధం చేస్తాం. ఈ గడుగ్గాయిలేమో అరకొరగా తిని మిగిల్చి మళ్లీ తెచ్చేస్తారు. పైగా ‘ఏం బాలేదు’ అన్న ఒక్క మాటలో తీర్పు ఇచ్చేస్తుంటారు. శ్రమ వృథాతోపాటు పిల్లలు తినలేదన్న బెంగ! మరేం చేయాలా అని ఆలోచిస్తున్నారా?

* బెంటో బాక్స్‌.. ఈ పద్ధతికి ఇటీవల బాగా ప్రాచుర్యం పెరిగింది. మామూలుగా మనం రోజూ ఒక్క రకాన్నే రుచిగా చేసి పెడుతుంటాం. అవునా! బెంటో బాక్స్‌ అంటే 3, 4 రకాలు పెట్టడమన్నమాట. రోజూ అన్నం, కూరలు మనకీ బోరే కదా! పిల్లలు, వాళ్లకి మాత్రం ఎలా నచ్చుతాయి? చిన్న చపాతీ, కొద్దిగా అన్నం, ఉడికించి, అందంగా కోసిన కూర గాయలు, పండ్లు.. ఇలా రకరకాలు ఉండేలా చూసుకోండి.

* ఒక్కదాన్నే సరిగా తినిపించలేకపోతున్నాం.. ఇన్నెక్కడ తింటారంటారా? పరిమాణం తగ్గించండి. అప్పుడే వెగటు అనిపించదు. ప్రతిదీ ఆసక్తిగా ప్రయత్నిస్తారు కాబట్టి.. కడుపూ నిండుతుంది. పోషకాలూ అందుతాయి. ఇన్ని సర్దడమూ కష్టమంటారా? తగ్గ బాక్సులూ దొరుకుతున్నాయి. వాటిని తెచ్చుకున్నారంటే.. ఎంత పెట్టాలో తెలుస్తుంది.

* ఎప్పుడూ ఆరోగ్యమేనా? అప్పుడప్పుడూ సర్‌ప్రైజ్‌లివ్వండి. వాళ్లకు నచ్చిన చిప్స్‌ లాంటివి పెడితే వేరేది అంతగా ఇష్టపడక పోయినా మీ మీద ప్రేమతో తినేస్తారు. పిల్లలెప్పుడూ ఎంత త్వరగా తినేద్దామా.. ‘నేనే ఫస్ట్‌’ అనేద్దామా అనో, ఆటల్లోకి వెళిపోదామా అనో ఆలోచిస్తారు. మీరేం పెట్టినా వాళ్లు అలా పూర్తిచేసేలా ఉండేలా చూసుకోండి. అప్పుడే ఆనందంగా తెరుస్తారు.

* చూడగానే బాలేదనేస్తారు. రుచి చూస్తే కదా తెలిసేది.. ఈ మాట ఎన్నిసార్లు అనుంటాం? రంగులు, ఆకారాల పట్ల త్వరగా ఆకర్షితులవుతారు పిల్లలు. చపాతీనే భిన్నంగా కోయడం, బాక్సులో రంగులు రంగులుగా ఆహారం కనిపించేలా చేస్తే తినడానికి ప్రయత్నిస్తారు. బాక్సుతోపాటు చిన్ననోట్‌.. ‘లవ్యూ కన్నా’ అనో, చిన్న స్మైలీనో, ప్రేమ గుర్తునో జోడిస్తూ పంపండి. ఈరోజేం పెట్టారా అని ఆసక్తిగా చూస్తారు. మీమీద ప్రేమతో అయినా లాగించేస్తారు. అయితే.. దీనికి కాస్త సన్నద్ధత కావాలి. ఆ వారానికి ఏం చేయాలన్నది ముందుగానే సిద్ధమైతే.. చేయడం సులువే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని