తక్కువ చేయొద్దు..

రేష్మి భర్తకు ఇతరుల ముందు భార్యను మాటలతో అవమానించి సంతోష పడటం అలవాటు. రేష్మికు ఇది తీవ్ర ఆవేదన కలిగిస్తుంది.

Updated : 23 Nov 2022 04:31 IST

రేష్మి భర్తకు ఇతరుల ముందు భార్యను మాటలతో అవమానించి సంతోష పడటం అలవాటు. రేష్మికు ఇది తీవ్ర ఆవేదన కలిగిస్తుంది. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడమే దంపతుల బంధాన్ని బలపరుస్తుందంటున్నారు నిపుణులు.

ఇతరులు తమకన్నా తెలివైన వారనే ఆలోచన, లేదా వారిలోని లోపాన్ని ఎత్తి చూపే ప్రయత్నంతో విమర్శలు చేసి అవమానిస్తుంటారు. ఇది భార్యాభర్తల మధ్యా జరుగుతుంటుంది. అవతలి వారు బాధ పడతారని తెలిసీ చేస్తుంటారు. బయటివారి ముందు ఒకరినొకరు తక్కువ చేసుకోవడం అలవాటుగా మార్చుకుంటారు. ఇది కొనసాగితే వారి దాంపత్యానికే ముప్పుగా మారుతుందని గ్రహించరు. దంపతులిద్దరూ మూడో వ్యక్తి ఎదుట తమ వారిని తక్కువ చేస్తున్నామనే నిజాన్ని గుర్తించరు. అది ఎదుటి వారి మనసును ఎంత వేదనకు గురి చేస్తుందో పట్టించుకోరు. భార్య అధిక బరువు, వంట సరిగా రాకపోవడం, ఆలస్యంగా రెడీ కావడం వంటి వాటిపై భర్త విమర్శలు, ఆయన అలవాట్ల గురించి బయటివారి ముందు భార్య విమర్శించడం మంచిది కాదు.

చర్చ ద్వారా: ఏ విషయమైనా నచ్చనప్పుడు భార్యా భర్తలిద్దరే చర్చించుకోవాలి. కూర్చొని మాట్లాడుకుంటే చాలా సమస్యలు మొగ్గ దశలోనే పరిష్కారమవుతాయి. ఫలానా సందర్భంలో మాటలతో బాధించినందుకు కారణాన్ని అడగొచ్చు. అప్పుడు తమ మనసెంత గాయపడిందో చెప్పొచ్చు. కొందరు చిన్నప్పటి నుంచి విమర్శిస్తూ మాట్లాడటం అలవరుచుకుంటారు. అది ఎదుటివారిని గాయపరుస్తోందని గుర్తించరు. అటువంటి వారికి తప్పేంటో తెలియజెప్పాలి. ‘మాట’ ఇరువురినీ దగ్గర చేయాలే తప్ప, దూరం పెరగడానికి కారణం కాకూడదు.

వివాదం: కొన్నిసార్లు సరదాగా చేసే విమర్శలను కూడా అవతలివారు తేలికగా తీసుకోక పోవచ్చు. అది వారి మానసికారోగ్యంపై తీవ్ర ప్రభావితం చేస్తుంది. తమను తాము ప్రేమించడం, భాగస్వామిని ఇష్టపడటం మానేస్తారు. ప్రేమ స్థానంలో కోపం మొదలవుతుంది. తిరిగి విమర్శించడం ప్రారంభిస్తారు. ఇది వివాదానికి, ఆపై ద్వేషానికి దారితీస్తుంది. అందుకే గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకొంటే ఆ దాంపత్యం కలకాలం నిలుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని