Updated : 09/12/2022 04:25 IST

సౌమ్యంగా చెప్పండి

తర బంధాలన్నీ ఒక ఎత్తయితే తల్లీపిల్లల అనుబంధం ఇంకో ఎత్తు. వాళ్ల కోసం ఎంతయినా కష్టపడా లనిపిస్తుంది. ఏమైనా ఇచ్చేయాలనిపిస్తుంది. ఎంత శ్రమనైనా లెక్కచేయకుండా, ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడి వాళ్లని శిఖరాన కూర్చోబెట్టాలనిపిస్తుంది. ఇదంతా ఇష్టంతోనే చేస్తాం. అయితే పిల్లలు మాట వినకపోతే మాత్రం కోపం వచ్చేస్తుంది. వాళ్లు వినయంగా ఒద్దికగా ఉండాలనుకుంటాం. అలా లేకుండా ఎదురుచెబితే మట్టుకు అసహనం కలుగుతుంది. కానీ అలాంటి సందర్భాల్లో కోపతాపాలు ప్రదర్శించకుండా దురుసుగా ఎందుకున్నారో తెలుసుకోమంటున్నారు మానసిక నిపుణులు. సంయమనం పాటిస్తూ సున్నితంగా మార్చుకోమని హితవు పలుకుతున్నారు...

పిల్లలు ఎదురు మాట్లాడినప్పుడు  మీ కోపాన్ని నిగ్రహించుకుని కాసేపు మౌనంగా ఉండండి. ఈలోపు వారిలో పశ్చాత్తాపం మొదలవుతుంది. వాళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు దురుసు వైఖరి అనర్థదాయకమని, వినయ విధేయతలు లేకుంటే భవిష్యత్తులో నష్టం తప్పదని అనునయంగా చెప్పండి.

పిల్లలకు ఏది మంచో ఏది చెడో కథల రూపంలో చెబుతుండండి. సమయపాలన అవసరమని చెప్పండి. మితిమీరి ఆంక్షలు పెట్టొద్దు, అదుపు చేయొద్దు. కాస్త ఎక్కువసేపు  ఆడుకోవడం లాంటివి చూసీచూడనట్లు వదిలేయండి. లేదంటే ఉక్రోషం, కసి, కోపం బయల్దేరతాయి.

ఎప్పుడూ చదువూ, క్రమశిక్షణ అంటూ కోప్పడకండి. చిన్నతనంలో సరదాలూ సంతోషాలూ కూడా అవసరమేనని మర్చిపోవద్దు. ‘ఈ లెక్కలు చేసేసి ఆడుకోవడానికి వెళ్లు, హోంవర్క్‌ చేయకపోతే క్లాసులో అందరి ముందూ అవమానం కదా! అందుకే దీన్ని పూర్తిచేశాక సినిమా చూడు, ముందు అన్నం తిను.. తర్వాత నీకిష్టమైన స్నాక్స్‌ ఇస్తాను’ తరహాలో సానుకూలంగా మాట్లాడండి. ఎదురు చెప్పకుండా మాట వింటారు.

పిల్లలు అడిగిందల్లా ఇవ్వొద్దు. వాళ్ల ఆగడాలన్నీ భరించొద్దు. మీ కోపతాపాలను, వ్యతిరేకతను వ్యక్తం చేయండి. కానీ చెప్పే తీరు సౌమ్యంగా ఉండాలి. లేదంటే మొండితనం వచ్చేస్తుంది.

పెద్దల మాటలు వినక, పెడమార్గం పట్టి, మొండివైఖరితో జీవితంలో ఇబ్బందులు పడిన వారి గురించి ఉదాహరణలతో చెప్పండి. నెమ్మదిగా పిల్లల్లో ఆలోచన మొదలవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని