పచ్చని సంసారానికి పంచ ప్రణాళికలు..

నానమ్మ, తాతయ్యను చూస్తే రాధికకు ఆశ్చర్యమేస్తుంది. వారిమధ్య విభేదాలు రావడం ఎప్పుడూ చూడలేదామె. తనకేమో పెళ్లైన రెండేళ్లకే భర్తతో ఎన్నో సమస్యలు.

Published : 08 Jan 2023 00:08 IST

నానమ్మ, తాతయ్యను చూస్తే రాధికకు ఆశ్చర్యమేస్తుంది. వారిమధ్య విభేదాలు రావడం ఎప్పుడూ చూడలేదామె. తనకేమో పెళ్లైన రెండేళ్లకే భర్తతో ఎన్నో సమస్యలు. సంసార నావ సవ్యంగా సాగడానికి కొన్ని ప్రణాళికలను పాటించాలని, అప్పుడే ఆ దాంపత్యంలో కలహాలకు చోటుండదంటున్నారు నిపుణులు.

గెలుపు.. తమ మాటే గెలవాలనే పట్టుదలను పక్కన పెట్టగలగాలి. ఈసారి తన మాట విని చూద్దామన్న ఆలోచన ఇరువురిలో ఏ ఒక్కరికి ఉన్నా.. విభేదాలకు తావుండదు. అవతలివాళ్ల గెలుపునూ ఆస్వాదించగలగాలి అప్పుడే ఇద్దరి మధ్యా పోటీకి అనేది ఉండదు. ఎదుటివారు కూడా మన గెలుపును ప్రోత్సహించడం అలవాటు చేసుకుంటారు.

సాయం.. భాగస్వామికి ఏ అవసరమొచ్చినా సాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అవతలివారి కష్టం తమదనుకోవాలి. అలాకాకుండా వారిని సమస్య వంకతో విమర్శించడం, వారే పరిష్కరించుకోవాలంటూ పట్టించుకోకుండా ఉండటం చేయకూడదు.  చిన్నదైనా..పెద్దదైనా ఇరువురూ కలిసి ప్రయత్నిస్తేనే.. సమస్య దూదిపింజ అవుతుంది. దంపతుల్లో ఇరువురూ ఎదుటివారి అవసరాన్ని తెలుసుకోగలిగితే అది వారి మధ్య అనుబంధానికి వారధి అవుతుంది.

ఇష్టంగా.. ఎదుటివారికి ఇష్టమైన వాటిని మీరూ పాటించేయండి. అలా చేస్తే మన గౌరవం తగ్గుతుందేమో అనుకోకూడదు. నూరేళ్లు కలిసి జీవించాల్సిన వ్యక్తి ఇష్టాలను అనుసరించడంలో కలిగే ఆనందాన్ని అనుభవించడం కూడా ప్రేమను వ్యక్తీకరించే మార్గమే.

కించపరచొద్దు.. ఏ ఇద్దరు వ్యక్తుల ఆలోచనలూ ఒకలా ఉండవు. ఒక్కోసారి నిర్ణయాల్లో పొరపాట్లూ జరుగుతుంటాయి. అంతమాత్రాన దాన్ని ఎత్తి చూపుతూ కించపరచొద్దు. దానివల్ల అవతలివారు మానసికంగా దూరమవుతారు. తప్పటడుగు వేస్తున్నట్లు అనిపిస్తే మృదువుగా మీ అభిప్రాయాన్ని చెప్పేయండి. విన్నారా సరే.. వినక విఫలమైనా అవమానపరచకూడదు. ఈసారి ఇలా చేసి చూద్దామని పరిస్థితిని తేలిక పరిస్తే సరి. మీ విషయంలోనూ ఆయన ఏదైనా చెబితే సహనంగా వినండి. సబబు అనిపిస్తే పాటించండి. లేదనిపిస్తే ఇలా చేస్తే నయమేమో అని సలహా కోరితే సరి. అభిప్రాయానికి విలువ ఇచ్చినట్లే.

మృదువుగా.. ఏ సందర్భంలోనైనా మృదువుగా మాట్లాడండి. ఎదుటివారు కోపంగా ఉన్నా నెమ్మదిగా చల్లబడతారు. బంధాన్ని పెంచేదైనా, తుంచేదైనా మాటే. అందుకే మాట్లాడేటప్పుడు పదాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. గొడవలకు ఆస్కారముండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్