Published : 22/01/2023 00:22 IST

కొత్త.. పాత లేకుండా..

శివానీకి కొడుకును ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే భయం. కొత్త వ్యక్తులు, తెలియని ప్రాంతమనే ధ్యాసే లేకుండా ప్రవర్తిస్తాడు. వారి బీరువాలు, కప్‌బోర్డులన్నీ కలియబెడతాడు. వాడి ప్రవర్తనకు అవతలి వాళ్లేమనుకుంటారో అని తీవ్రంగా ఇబ్బంది పడుతుంది శివానీ. ఈ తరహా పిల్లలు ‘అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివ్‌ డిజార్డర్‌ (ఏడీహెచ్‌డీ) బాధితులు అంటున్నారు నిపుణులు. ప్రవర్తనాచికిత్స ద్వారా వీరిని సాధారణ స్థితికి తీసుకు రావచ్చంటున్నారు.

ఏడీహెచ్‌డీ ఉన్నవారు దేనిపైనా ఎక్కువసేపు ఏకాగ్రత చూపలేరు. అత్యుత్సాహం, ఊహాతీత ప్రవర్తన వీరిలో తరచూ కనిపిస్తాయి. అలా చేయొద్దంటే వెంటనే కోపంతో చేతిలో ఉన్నవి దూరంగా లేదా ఎదుటివారిపైకి విసిరేస్తారు. క్షణంలో వారి ఆలోచన మారుతుంటుంది. ఒకచోట ఎక్కువ సేపు కూర్చొని చదవలేరు. కుదురుగా కాసేపు కూడా ఉండలేరు. బలవంతంగా పుస్తకాల ముందు కూర్చోబెట్టినా సమయం వృథా తప్ప, పాఠాలు వారి మనసుకెక్కవు. హోంవర్క్‌ చేసినా పొరపాట్లే ఎక్కువ. చదవమంటామని పుస్తకాలు, పెన్సిళ్లు కనబడకుండానూ దాచేస్తారు. తోటి పిల్లలతోనూ కలవలేరు. కలిసినా వారితో గొడవలే.

సమస్యలెన్నో.. ఏకాగ్రత లోపిస్తుంది. స్కూల్‌ నుంచి ఫిర్యాదులొచ్చేలా ప్రవర్తిస్తారు. హోంవర్క్‌ ధ్యాస ఉండదు. దినచర్యలను కూడా అతి బలవంతంమీద పూర్తి చేయగలుగుతారు. నిత్యం అలజడిగానే కనిపిస్తారు. ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. కొన్నిసందర్భాల్లో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. రాయడం, చదవడం, వల్లించడం, తమ అభిప్రాయాన్ని చెప్పడం వంటి నైపుణ్యాల్లో వెనకబడతారు. చిన్నప్పటి నుంచి అల్లరి ఎక్కువ, అడిగింది ఇవ్వకపోతే ఇలాగే ప్రవర్తిస్తాడు అని సమర్థించు కోకుండా తల్లిదండ్రులు తక్షణం నిపుణుల సలహా తీసుకోవాలి. ప్రవర్తనాచికిత్స ద్వారా వీరిని సాధారణ పిల్లల్లా చేయొచ్చు. చిన్నవయసులోనే గుర్తించి నయం చేయించడానికి ప్రయత్నిస్తే తోటి పిల్లలతో త్వరగా కలిసిపోతారు.

ఇంట్లో.. థెరపీతోపాటు తల్లిదండ్రులు ప్రవర్తన ద్వారానూ ఈ చిన్నారులు అందరిలా మారడానికి అవకాశం ఉంది. వారిపై ఎక్కువగా కోప్పడద్దు, చేయి చేసుకోవద్దు. వారి సందేహాలను అనునయంగా మాట్లాడుతూ తీర్చాలి. ఏకాగ్రతను పెంచడానికి తోట పని, క్రీడలు వంటివి అలవరచాలి. ముందుగా పది నిమిషాలు కూర్చుంటే చాలు.. నీకిష్టమైన కథ చెబుతా అంటూ క్రమేపీ ఆ సమయాన్ని పెంచుతూ వస్తే ఏకాగ్రత పెరుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని