Published : 02/02/2023 00:04 IST

పెద్దలు చేసే పొరపాట్లు!

అహల్య కూతురు నిత్యం తనెదుటే ఉండాలంటుంది. కాసేపు తోటి పిల్లలతో ఆడుకోవడానికీ అనుమతివ్వదు. పడిపోతే దెబ్బలు తగులుతాయి, పక్కింటి పిల్లలకు శుభ్రత ఉండదనే సాకులతో స్వేచ్ఛనివ్వదు. కోపమొస్తే తనతో మాట్లాడటం మానేస్తుంది. పెద్దవాళ్లు చేసే ఈ పొరపాట్లు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని దూరం చేస్తాయంటున్నారు నిపుణులు.

చిన్నారులకు తోటివారితో కలిసి ఆడుకోవాలని ఉంటుంది. మిగతావారితో స్నేహం చేసినప్పుడు వారిలో కొత్త ఆలోచనలు వస్తాయి. మానసిక ఎదుగుదల మొదలవుతుంది. ఎన్నో విషయాలను తోటి పిల్లల నుంచి నేర్చుకుంటారు. అవి మంచి, చెడు అనేది పెద్దవాళ్లు ఎప్పటికప్పుడు గుర్తించి వివరిస్తుంటే చాలు. అలాకాకుండా ఒంటరిగా పెరిగే పిల్లల్లో ఎదిగేకొద్దీ తోటివారితో కలిసి నడవగలిగే నైపుణ్యాలను పొందలేరు. ఒక్కడివే ఆడుకో.. మిగతా పిల్లలతో కలిసి ఆడాల్సిన అవసరం లేదు అంటూ వారిని తోటి వయసు వారికి దూరంగా ఉంచితే ఆ ప్రభావం వారి మనసుపై పడుతుంది. ఒంటరితనంతో కుంగుబాటుకు గురవుతారు. అంతేకాదు, ఒంటరిగా పెరిగి, తల్లిదండ్రుల ప్రేమను ఒక్కరే అనుభవించడం అలవరుచుకొని ఆ తర్వాత వారెవరిపైన అయినా ప్రేమను చూపిస్తే భరించలేరు. అసూయ, ద్వేషాలను పెంచుకొనే ప్రమాదం ఉంది.

పొరపాట్లు చేయనివ్వాలి..

చిన్నారులు చిన్నచిన్న పొరపాట్లు చేయాలి. అందులోంచి కొత్తపాఠాలు నేర్చుకుంటారు. పొరపాట్లు చేసినంత మాత్రాన వారిలో సామర్థ్యం లేదని అనుకోకూడదు.  సమయం వచ్చినప్పుడల్లా వారి పొరపాట్లను దెప్పి పొడవకూడదు. చదువు లేదా క్రీడల్లో ప్రోత్సహించాలి తప్ప నెగ్గాలని డిమాండ్‌ చేయకూడదు. వారి నుంచి పెద్ద స్థాయిలో ఫలితాలను ఆశించినప్పుడు వారివల్ల కాకపోతే తీవ్ర ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. ఇది వారి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. పిల్లలు పొరపాటు చేసినప్పుడు వివరించి చెప్పాలి. అలాకాకుండా నీతో మాట్లాడను అంటూ శిక్షిస్తే అది వారిని మానసిక వేదనకు గురిచేస్తుంది. కోపం వచ్చినప్పుడు కూడా వారితో మృదువుగానే మాట్లాడగలగాలి. ప్రతి చిన్న విషయానికీ నిందించకూడదు. పూర్తిచేసిన పనులను మెచ్చుకోగలగాలి. వారి భావోద్వేగాలకు విలువనివ్వాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని