Published : 01/03/2023 00:05 IST

అలా ఉంటే.. ఆందోళనకు గురవుతున్నట్లే

మామూలుగా పిలిచినా.. ఉలిక్కిపడటం, ఒంటరిగా ఉండటం, పరధ్యానం వంటివి పిల్లల్లో కనిపిస్తే ఆందోళనకు గురవుతున్నారనడానికి సంకేతాలు అంటున్నారు నిపుణులు. వెంటనే గుర్తించి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

చిన్నారులకు తమలో ఒత్తిడి ఉన్నట్లు తెలియదు. కొందరు పిల్లలు చిన్నచిన్న విషయాలనే మనసులో దాచుకుంటారు. హోంవర్క్‌ చేయకపోతే క్లాస్‌ టీచర్‌ తిడతారని భయపడతారు. చెప్పిన పని పూర్తిచేయలేదని అమ్మ కొడుతుందనుకుంటారు. ఇవన్నీ చిన్నారులకు ఒత్తిడి తెస్తాయి. బయటపడటం  తెలియక సతమతమవుతారు. క్రమేపీ ఇది పలు అనారోగ్యాలకు దారితీస్తుంది. ఆహారం తీసుకోరు. చదువుపై ఏకాగ్రత ఉండదు. తోటిపిల్లలతో కలవలేరు. తెలిసిన పాఠాలనూ మర్చిపోతుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే పిల్లలను నిత్యం గమనిస్తూ ఉండాలి. వారి ప్రవర్తనలో చిన్నమార్పు కనిపించినా మృదువుగా కారణం అడిగి తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అప్పుడే సమస్య వస్తే.. తీర్చడానికి తల్లిదండ్రులున్నారనే భరోసా పిల్లల్లో మొదలవుతుంది. తమకెదురైన సమస్యను ధైర్యంగా అమ్మానాన్నలతో పంచుకోవడానికి ముందుకొస్తారు.

పైకి చెప్పలేక..

ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే చిన్నారులు ప్రతి విషయానికి విసుగు, కోపం ప్రదర్శిస్తున్నారంటే ఆందోళనలో ఉన్నట్లే. అర్ధరాత్రి నిద్రలోంచి ఉలిక్కిపడి లేవడం, అవిశ్రాంతిగా కనిపించడం కూడా ఇటువంటిదే. చదువే సమస్య కాదు.. బంధువులు లేదా తెలిసినవారి నుంచి చెప్పలేని వ్యక్తిగత సమస్య ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఇవి లైంగిక వేధింపులు కావొచ్చు. ఇంట్లో చెబితే అమ్మానాన్న నమ్మరేమో అనే అనుమానం పిల్లల్లో ఉన్నంతకాలం పైకి చెప్పలేరు. అలాగని భరించలేక ఆ ఆందోళనతో లోలోపల కుంగుబాటుకు గురవుతారు. అది వారి శారీరక, మానసికారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వీరితో తల్లిదండ్రులెక్కువ సమయాన్ని గడపాలి. వారి అభిరుచులు, ఆశయాలు తెలుసుకొని ప్రోత్సహించాలి. ప్రతి నిమిషాన్ని ఉల్లాసంగా ఎలా మలుచుకోవచ్చో నేర్పిస్తే చాలు. ఆనందంగా అనుకున్న ఆశయాలను వాళ్లు చేరుకొంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని