Published : 21/03/2023 00:13 IST

బంధాల విలువలను నేర్పాలి..

రాగిణికి కూతురిని చూస్తే వేదనతోపాటు కోపమూ వస్తుంది. స్కూల్‌ నుంచి రాగానే, గదిలోకి వెళితే, తిరిగి బయటికి రాదు. బయటివారితో మాట్లాడటానికి ఆసక్తి చూపించదు. ఇంట్లోవారికీ దూరంగా ఉంటుంది. ఇలా కాకూడదంటే.. పిల్లలకు బాల్యం నుంచే బంధాల విలువలు నేర్పాలంటున్నారు నిపుణులు.

ల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపకపోతే పిల్లలు ఇలా ఒంటరితనానికి అలవాటు పడతారట. స్కూల్‌ నుంచి వచ్చేసరికి అమ్మ టీవీ చూడటం లేదా ఇంటిపనిలో నిమగ్నమై ఉండటం పిల్లలకు నచ్చదు. వారొచ్చిన వెంటనే కొంతసేపైనా తరగతి విశేషాలు లేదా స్నేహితుల కబుర్లంటూ మాట్లాడాలి. లేదంటే ఇంట్లో ఎవరికీ తమతో గడపడానికి సమయం లేదనే ఆలోచన వారి మనసులో మొదలవుతుంది. అది వారిని ఒంటరితనంలోకి నెట్టేస్తుంది. రోజులో కనీసం ఏడెనిమిది గంటలు స్కూల్‌లోనే గడిపే చిన్నారులకు వీలైనంత ఎక్కువ సమయాన్నివ్వడానికి పెద్దవాళ్లు సిద్ధంగా ఉండాలి. అప్పుడే వాళ్లూ.. ఇంట్లోవాళ్ల ప్రేమను పొందడమే కాదు, వారూ తిరిగి ప్రేమించడం మొదలుపెడతారు.  

బయటివారితో..

అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, అత్త అంటూ బంధువుల్లో ప్రతి ఒక్కరినీ పిల్లలకు చిన్నప్పటి నుంచి పరిచయం చేయాలి. వారినెలా గౌరవించాలో.. ప్రేమనెలా పొందాలో నేర్పించాలి. చిన్నారులకు ఇల్లు, తన గది మాత్రమే ప్రపంచం కాదనేది తెలిసేలా చేయాలి. స్నేహితులు, బంధువులంటూ బంధాలను ఎంత ఎక్కువగా పెంచుకుంటే అంత పెద్ద ప్రపంచం తన చుట్టూ ఉంటుందనే అవగాహన కలిగించాలి. దీంతో ఎదుటివారికెంత విలువనివ్వాలి, బంధాలనెలా పెంపొందించుకోవాలి వంటివన్నీ పిల్లలు తెలుసుకుంటారు. ఎదుటపడిన ప్రతి ఒక్కరినీ ఆత్మీయులుగా భావించి వారిని పరిచయం చేసుకోవడమెలాగో చెప్పాలి. ఎవరితోనైనా బిడియపడకుండా మాట్లాడటంపై శిక్షణనివ్వాలి. అలాగే అవతలివ్యక్తి కష్టాన్ని గుర్తించడం నేర్పాలి. తనవంతు సాయాన్ని చేయగలిగేలా ప్రోత్సహించాలి. దీనిద్వారా వారిలో బాల్యం నుంచి మంచి ప్రవర్తనతోపాటు ప్రతి బంధానికి ఉన్న విలువను తెలుసుకుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని