ప్రశాంతత ముఖ్యం..

ఇది పరీక్షల సమయం. పిల్లలతోబాటు తల్లులు కూడా హైరానా పడటం తెలిసిందే. ‘మేం చదువుకునే రోజుల్లో మా అమ్మానాన్నలకు పరీక్షలు ఎప్పుడు మొదలవుతాయో, సెంటర్‌ ఎక్కడ పడిందో కూడా తెలిసేది కాదు.

Published : 09 Apr 2023 01:14 IST

ఇది పరీక్షల సమయం. పిల్లలతోబాటు తల్లులు కూడా హైరానా పడటం తెలిసిందే. ‘మేం చదువుకునే రోజుల్లో మా అమ్మానాన్నలకు పరీక్షలు ఎప్పుడు మొదలవుతాయో, సెంటర్‌ ఎక్కడ పడిందో కూడా తెలిసేది కాదు. మేం మాత్రం పిల్లల్ని ప్రతీ క్షణం దగ్గరుండి చదివించాల్సి వస్తోంది’ లాంటి మాటలు వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో పిల్లల్ని చదివించే విషయమై నిపుణుల సూచనలు పాటించండి. మీకూ, పిల్లలకూ ఒత్తిడీ, ఆందోళనా ఉండవు..

* పరీక్షల టైం టేబుల్‌ను ఎదురుగా కనిపించేలా అతికించండి. ఆయా సబ్జెక్టుల్లోని అధ్యాయాలను బట్టి ఎన్ని గంటల్లో ఎన్ని చాప్టర్లు చదవాలో ఒక ప్రణాళిక వేసుకుంటే తేలికవుతుందని, విభజన ప్రకారం చదివితే గందరగోళం ఉండదని చెప్పండి.

* తేలికైన విషయాలను ముందు చదవమనండి. ఇన్ని వచ్చేశాయన్న ధీమాతో తక్కినవి భారమనిపించదు.

* రోజూ కాసేపు ఆడుకోనివ్వండి. కొంతసేపు వ్యాయామం కూడా చేయమనండి. అందువల్ల మనసు తేలికగా, మెదడు చురుగ్గా ఉంటాయి.

* ఇంకా పూర్తవ్వలేదా.. ఇలా అయితే పాసవుతావా.. మంచి మార్కులొస్తాయా- అంటూ భయపెట్టొద్దు. ప్రోత్సహించండి. ఫలానా పిల్లలు నీకంటే బాగా చదువుతున్నారనో, మరెవరో నీకంటే నాసిగా ఉన్నారనో మంచికీ, చెడుకీ కూడా ఇతరులతో పోల్చొద్దు. అవి మేలు చేయడానికి బదులు కీడు చేస్తాయి.

* పిల్లలు అలసటకు గురయ్యారు అనిపించినప్పుడు.. కాసేపు చదువు ఆపేసి కబుర్లు చెప్పమనండి. లేదా మీరేదైనా మంచి కథ చెప్పండి. అదే ఊరట, ఉపశమనం.

* పరీక్షలు చాలా ముఖ్యమే. కానీ అవే అంతిమ లక్ష్యం కాదు. ఏదైనా తేడా వస్తే భూమి తలకిందులై పోతుంది.. అన్నట్టు మాట్లాడితే కంగారు ఎక్కువౌతుందే తప్ప ప్రయోజనం ఉండదు. ప్రశాంతంగా ఉంచితే వాళ్లే బాధ్యతగా చదివి, బేషుగ్గా పరీక్షలు రాస్తారని గుర్తుంచుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని