సెలవుల్లో.. చలాకీ ఆటలు ఆడిద్దాం!

బడులకు సెలవులు మొదలవుతున్నాయి. చదువుల ఒత్తిడితో సతమతమైన చిన్నారులకు కాస్త విరామం. అలాగని, వారి అల్లరి నియంత్రించడానికి మొబైళ్లు ఇచ్చేయకండి.

Published : 23 Apr 2023 00:28 IST

బడులకు సెలవులు మొదలవుతున్నాయి. చదువుల ఒత్తిడితో సతమతమైన చిన్నారులకు కాస్త విరామం. అలాగని, వారి అల్లరి నియంత్రించడానికి మొబైళ్లు ఇచ్చేయకండి. బదులుగా ఇవి పాటించండి... వారి సమయం ఉత్సాహంగా సాగుతుంది.

* స్కూలుకి వెళ్లేప్పుడు ఎంత క్రమశిక్షణతో ఉన్నారో.. సెలవుల్లోనూ దాన్ని అలవాటు చేయండి. అయితే, కాస్త ఎక్కువ సమయం దొరుకుతుంది కాబట్టి దాన్ని ఆరుబయట ఆటల కోసం కేటాయించుకునేలా ప్రోత్సహించండి. ఇందుకోసం ప్రత్యేక శిక్షణే అక్కర్లేదు. వారి ఈడు పిల్లలందరినీ చేరదీసి రోజూ ఓ ఆటలపోటీ పెడితే చాలు ఉత్సాహంగా పాలుపంచుకుంటారు. దీనివల్ల వారిలో సామాజిక చొరవ పెరుగుతుంది. శరీరానికి మంచి వ్యాయామమే కాదు... వ్యాధి నిరోధక శక్తీ పెరుగుతుంది.

* సెలవులన్నీ ఆటపాటలతోనే కాలక్షేపం చేయకుండా బొమ్మలూ, అలంకరణ వస్తువుల తయారీ నేర్చుకునేలా చేయండి. అంత ఖాళీ లేదు, అయినా మాకేం వచ్చని అంటారా- మీలాంటి వారి కోసం ఎన్నో యూట్యూబ్‌ ఛానెల్స్‌ ఇప్పుడు డీఐవై మెలకువల్ని ఉచితంగా చెబుతున్నాయి. మీ బుజ్జాయి ఆసక్తిని బట్టి పప్పెట్స్‌ తయారీ నుంచి టెడ్డీ బేర్‌ వరకూ నచ్చినవన్నీ ఇంట్లోనే నేర్పచ్చు. పైగా రెడీమేడ్‌ డీఐవై కిట్లు దొరుకుతున్నాయి. ఇంటి నిర్మాణం నుంచీ రెజిన్‌ ఆర్ట్‌ వరకూ వారికి నచ్చింది ఏదైనా తెప్పించి కానుక ఇవ్వండి. సరదాగా గడుపుతూనే కొత్త అంశాలపై పట్టు తెచ్చుకోవడం వల్ల మెదడూ చురుగ్గా పనిచేస్తుంది.

* ఎంత చదివినా లోకజ్ఞానం, సామాజిక చొరవ లేకపోతే ఎలా? వీలైతే ఈ సమయంలో మీ బంధువులూ, స్నేహితులకు సంబంధించిన ఛార్ట్‌ తయారు చేసి ఓ చోట అతికించండి. వారాంతాల్లో వారిని కలవడం, ఫోన్లో మాట్లాడటం వంటివి చేయించండి. దీని వల్ల అనుబంధాలు అలవడతాయి. దగ్గర్లోని మ్యూజియం, చారిత్రక ప్రదేశాలూ వంటిని కూడా చూపించండి. తర్వాత వారి అభిప్రాయాలను ఓ కాగితం మీద పెట్టమని ప్రోత్సహించండి. దీనివల్ల పిల్లలు సంతోషంగా ఉండటమే కాదు చక్కటి భావ వ్యక్తీకరణనూ అలవాటు చేసుకోగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్