ఫోన్లు కాసేపు పక్కన పెడితే...
రాధ, వెంకటేష్ ఉద్యోగులు... ఉదయం ఇద్దరికీ పెద్దగా మాట్లాడుకునే తీరికుండదు. రాత్రికి వచ్చాక ఎవరి ఫోన్‌లో వాళ్లు పడిపోతారు. ఇలాగైతే ఆ దాంపత్యం సజావుగా సాగదంటున్నారు నిపుణులు.
రాధ, వెంకటేష్ ఉద్యోగులు... ఉదయం ఇద్దరికీ పెద్దగా మాట్లాడుకునే తీరికుండదు. రాత్రికి వచ్చాక ఎవరి ఫోన్‌లో వాళ్లు పడిపోతారు. ఇలాగైతే ఆ దాంపత్యం సజావుగా సాగదంటున్నారు నిపుణులు. శరీరంలో వ్యర్థాల్ని తొలగించుకోవడానికి డిటాక్సింగ్ ఎలా చేస్తామో... పండంటి కాపురానికి కూడా డిజిటల్ డిటాక్స్ ముఖ్యమంటున్నారు.
దాంపత్యంలో డిజిటల్ డిటాక్స్‌ను పాటించాల్సిన అవసరం ఉందా లేదా ఎవరికి వారే గుర్తించొచ్చు. డిజిటల్ కమ్యూనికేషన్ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు, సోషల్‌మీడియా, వీడియో కాల్స్, మెసేజింగ్ యాప్‌లకు ఎక్కువ సమయాన్ని వెచ్చించడం అలవాటుగా మారింది. ఇవన్నీ భార్యాభర్తలు సంతోషంగా గడపాల్సిన సమయాన్ని తగ్గిస్తున్నాయి. ఇరువురి నడుమ దూరాన్ని పెంచుతున్నాయి.
మృదువుగా...
మొదట్లో ఎంతో ప్రేమగా మాట్లాడే శ్రీవారు ప్రస్తుతం తనతోకన్నా ఫోన్‌లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతోంటే ఆ ఇల్లాలు ఆలోచించాల్సిందే. భాగస్వామితో అనుబంధం రోజులు గడుస్తున్నకొద్దీ పలచబడుతున్నట్లు ఎదుటివారి మనసుకు అనిపించకూడదు. అది క్రమేపీ దూరాన్ని పెంచే ప్రమాదం ఉంది. ఇటువంటి సందర్భాలెదురైనప్పుడు కారణాన్ని గుర్తించడం తప్పనిసరి. భార్యాభర్తల్లో ఏ ఒక్కరైనా ఫోన్, ల్యాప్‌టాప్ వినియోగం అతి గా ఉన్నట్లు అనిపిస్తే డిటాక్సేషన్‌కు వారిని సిద్ధం చేయడానికి ప్రయత్నించాలి. ఫోన్ తమ మధ్య దూరాన్నెలా పెంచుతోందో సున్నితంగా వివరించాలి. ఆ సమయాన్ని కలిసి బయటకు వెళ్లిరావడానికి లేదా కూర్చొని సంతోషంగా కబుర్లు చెప్పుకోవడానికి వినియోగించేలా అలవాటు చేయడం మంచిది.
సాధనతో..
భార్యాభర్తల్లో ఏ ఒక్కరికైనా ఫోన్ లేకపోతే క్షణం కూడా గడవడం లేదంటే మాత్రం సీరియస్‌గా ఆలోచించాల్సిందే. ఆ అలవాటు నుంచి దూరంగా జరగడానికి ఎవరికివారే ప్రయత్నించాలి. ఆ సమయాన్ని భాగస్వామికి కేటాయించడం నేర్చుకోవాలి. తన సమస్యను ఎదుటివారికి చెప్పడం ద్వారా పరిష్కారాన్ని ఇరువురూ కలిసి ఆలోచించొచ్చు. ఏకాంతంగా గడిపేటప్పుడు డిజిటల్ ఫ్రీగా ఉండాలని ముందుగానే అనుకొంటే మంచిది. కలిసి భోజనం చేసేటప్పుడు, నిద్రకు ఉపక్రమించేటప్పుడు దంపతులు తమ ఫోన్లను దూరంగా ఉంచాలనే నియమాన్ని కచ్చితంగా పాటించినా చాలు. క్రమేపీ ఇది అలవాటుగా మారి ఫోన్ల వాడకం తగ్గుతుంది. ఒకరితో ఒకరు గడిపే సమయం పెరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.