బుజ్జి బుజ్జి మాటలు.. మంచివే!
‘హాయ్ రా బుజ్జీ.. ఆమ్ తిన్నావా.. లాల పోసుకున్నావా..’ పసిపిల్లలు కనిపించినా కొందరు ఇలా మాట్లాడేస్తుంటారు. పక్కనే ఉన్నవాళ్లు.. ‘ఆ నువ్వు మాట్లాడేది వాళ్లకి బాగా అర్థమవుతుంది మరి’ అని కొట్టిపారేయడమూ వింటుంటాం.
‘హాయ్ రా బుజ్జీ.. ఆమ్ తిన్నావా.. లాల పోసుకున్నావా..’ పసిపిల్లలు కనిపించినా కొందరు ఇలా మాట్లాడేస్తుంటారు. పక్కనే ఉన్నవాళ్లు.. ‘ఆ నువ్వు మాట్లాడేది వాళ్లకి బాగా అర్థమవుతుంది మరి’ అని కొట్టిపారేయడమూ వింటుంటాం. నిజానికి అలా మాట్లాడితేనే పసి బుర్రలకు మంచిదంటారు నిపుణులు. ఎందుకంటే..
* చిన్నారులను పలకరించి చూడండి. సంబరంగా కాళ్లూ చేతులూ ఆడించడం.. ‘ఉంగా ఉంగా’ అంటూ కబుర్లు చెప్పడం చేస్తుంటారు.. గమనించారా! మనతో మాట కలపడానికి చేసే ప్రయత్నమే ఇది. ఆకలితో ఏడుస్తున్నా.. ఆడుకుంటున్నా సరదాగా ఏదో ఒకటి చెప్పండి. త్వరగా భాషపై పట్టొస్తుందట. అంతేకాదు మనతో అనుబంధం పెనవేసుకునే మార్గం కూడా.
* పిల్లల్ని సరదాగా బయటికి తీసుకెళుతుంటాం కదా! అప్పుడప్పుడూ ‘చీ... చీ’ అంటూ ముద్దు చేయడమే కాదు. ‘అదిగో అది కార్.. రెడ్ కలర్ బాగుందా?’ ‘అదిగో బుజ్జి కుక్క.. కుక్క ఏమంటుంది? భౌ భౌ అంటుంది’ అంటూ ఎంతో కొంత సమాచారం జోడించుకుంటూ చెప్పాలి. మాటలు వచ్చే వరకూ ఆగాల్సిన పనిలేదు. ఏమీ రాకపోయినా కబుర్లు చెప్పాలి. చిన్న చిన్న కథలు, పాటలు.. ఇవన్నీ మంచి వ్యాపకాలు అలవాటు చేసే మార్గాలవుతాయి.
* ‘ఆమ్.. లాల.. బజ్జోవడం’ నిజానికి ఈ పదాలను నలుగురిలో మాట్లాడటానికి కొందరమ్మలకు సిగ్గుగా అనిపిస్తుంది. పిల్లలు త్వరగా పదాలు నేర్చుకునే మార్గాలవని కొన్ని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. మనమూ పిల్లలు పెరిగేకొద్దీ ఆ పదాలను తెలియకుండానే మారుస్తుంటాం కాబట్టి, అదే అలవాటు అవుతుందన్న భయమూ ఉండదు. త్వరగా మాటలు రావట్లేదని వైద్యుల చుట్టూ తిరుగుతున్న రోజులివి. ఆ బాధ తప్పాలంటే.. మీ బుజ్జాయిలను స్నేహి తులను చేసుకోండి. వాళ్లతో కబుర్లు చెప్పండి. ఇది పసివాళ్లకు మేలు చేయడమే కాదు... మనమూ ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.