బలమైన బంధానికి మూడు సూత్రాలు

వృద్ధ దంపతులు, ప్రేమికులను చూసినప్పుడు పెళ్లైన వాళ్లకి గుర్తొచ్చేది ఒకటే ప్రశ్న... మేం అలా ఎందుకు లేం? ఇష్టాన్ని, ప్రేమని వ్యక్తపరచడంలో తొలిదశలో ఉన్నవాళ్లు ప్రేమికులైతే... మలి దశలో ఉన్న వాళ్లు వృద్ధులు.

Published : 03 May 2023 00:15 IST

వృద్ధ దంపతులు, ప్రేమికులను చూసినప్పుడు పెళ్లైన వాళ్లకి గుర్తొచ్చేది ఒకటే ప్రశ్న... మేం అలా ఎందుకు లేం? ఇష్టాన్ని, ప్రేమని వ్యక్తపరచడంలో తొలిదశలో ఉన్నవాళ్లు ప్రేమికులైతే... మలి దశలో ఉన్న వాళ్లు వృద్ధులు. కానీ మధ్యలో ఉన్న వాళ్లు భాగస్వామిని ఎంత ఇష్ట పడుతున్నారో చెప్పడానికి వెనుకంజ వేస్తున్నారు. ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతుంటారు. చెప్పేదేముందిలే అని తీసి పడేసే వాళ్లు ఉన్నారు. బంధాలు బలహీన పడటానికి ఇవే కారణాలు. అలాకాకూడదంటే నిపుణులు ఇస్తోన్న ఈ సూచనలను పాటించేయండి మరి. 

మాట్లాడుకోండి

పెళ్లైన కొత్తలో ఉన్న సందడీ, ఆసక్తి రోజులు గడుస్తున్న కొద్దీ దూరమవుతాయి. బాధ్యతలు పెరుగుతుంటాయి. వృత్తిలో నిమగ్నమై వ్యక్తిగత జీవితాన్ని పక్కకు నెట్టేస్తుంటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకునే సమయమే ఉండదు. అలా కాక మీకంటూ మాట్లాడుకోవడానికి సమయాన్ని కేటాయించుకోండి. రోజువారీ సంఘటనలను ఒకరితో ఒకరు పంచుకోండి. ఎదుటివాళ్లు చెప్పింది ముందు వినండి. దూకుడుగా కాకుండా నిదానంగా మాట్లాడండి. ఏ బంధం బలపడాలన్నా కమ్యూనికేషన్‌ ప్రధానమని మరచిపోకండి. ఎదుటి వారి భావాలను వ్యక్తీకరించే అవకాశం ఇవ్వండి. వారి మాటలు పూర్తయ్యాకే మీవంతు. ఒప్పైతే మెచ్చుకోండి. తప్పైతే నిందించినట్లు కాకుండా అర్థమయ్యే రీతిలో చెప్పండి. 

పరస్పర అవగాహన

ఒకరి విషయాలపై ఒకరు అవగాహనతో ఉండాలి. ఇంటిని నడపడం నుంచి పిల్లల పెంపకం వరకు అన్నీ చర్చించుకోవాలి. పనులను పంచుకోవాలి. ఇది ఒకసారి అనుకుంటేనో, చేస్తేనో వచ్చేది కాదు. సమయం దొరికినప్పుడల్లా చర్చించుకుని లోటుపాట్లు తెలుసుకోవాలి. దీనివల్ల విపరిణామాలు చోటు చేసుకోకుండా ఒకరికి ఒకరు తోడుగా, సలహా దారులుగా ఉండొచ్చు. అభిప్రాయ భేదాలు తలెత్తకుండా జాగ్రత్తపడొచ్చు. రోజూ కాఫీ తాగేటప్పుడో, కలిసి భోజనం చేసేటప్పుడో కష్ట నష్టాలను పంచుకోండి. మీరున్నారన్న భరోసాను ఇవ్వండి.

గౌరవంగా మెలగండి

బంధం బలపడాలంటే ఒకరిని ఒకరు గౌరవించుకోవడం కూడా ముఖ్యమే. దీనివల్ల భేదభావాలకు తావుండదు. మీ భాగస్వామి ఎంపికలకు, లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మనసులో ఏమనుకుంటున్నారో చెప్పే స్వేచ్ఛను ఇవ్వండి. చిన్నచిన్న గొడవలు, అలకలు సహజం. అవసరమైనప్పుడు క్షమాపణలు చెప్పండి. దీనివల్ల ఎదుటి వ్యక్తికి మీ పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్