ప్రియమైన అమ్మకు...
ఎప్పుడు ఫోన్ చేసినా తీరికలేదనే నా బిడ్డేంటిలా.. అని ఆశ్చర్యపోతున్నావా? నా మీద నీకెంత ప్రేమో ఇన్నేళ్లకు తెలిసొచ్చింది మరి! నేనూ తల్లినయ్యా కదా... ఆ తీపే అడుగడుగునా నిన్ను గుర్తుచేస్తోంది!
ఎప్పుడు ఫోన్ చేసినా తీరికలేదనే నా బిడ్డేంటిలా.. అని ఆశ్చర్యపోతున్నావా? నా మీద నీకెంత ప్రేమో ఇన్నేళ్లకు తెలిసొచ్చింది మరి! నేనూ తల్లినయ్యా కదా... ఆ తీపే అడుగడుగునా నిన్ను గుర్తుచేస్తోంది! వాటిని పంచుకోవడానికి ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది అనిపించింది. అందుకే నీకీ అక్షరమాల!
నిజానికి నీ విలువ.. మన గడపదాటి మెట్టినింట అడుగు పెట్టినప్పుడే తెలిసింది. ‘అమ్మా’ అని పెదవి దాటకముందే అన్నీ సమకూర్చే దానివి. నా ముఖం చూసి మనసులో మాట తెలుసుకునేదానివి. అప్పుడే చెబుదామనుకున్నా.. అహం అడ్డొచ్చింది.
పురిటి నొప్పులప్పుడు చావు నా ముంగిట నిల్చుందనిపించింది. అది దాటాక.. నన్ను కనడానికి నువ్వూ వాటిని భరించి ఉంటావుగా అని గుర్తొచ్చింది! నన్ను పొత్తిళ్లలో పొదువుకుని.. కళ్లల్లో ఒత్తులేసుకుని రేయింబవళ్లూ కంటికి రెప్పలా కాచుకున్నావు. పాప క్యార్ మంటే ఉన్నఫళంగా అన్నీ వదిలేసి పరుగెడుతుంటా. కొన్నిసార్లు నీరసమూ వస్తుంటుంది. అత్తింట్లో అడుగు పెట్టేంత వరకూ కడుపు మాడ్చుకొని మరీ నా కోసం ఎలామ్మా ఎదురు చూశావు?
నాకు దెబ్బ తగిలితే నీ కంట నీరొచ్చేది. నా గెలుపుతో నీ కంట వెలుగొచ్చేది. ‘మంచి ఉద్యోగం.. బాగా సంపాదిస్తోంది’ అందరూ అనే మాట. దానికోసం నువ్వు చేసిన యుద్ధాలెన్ని? ‘అమ్మాయికి చదువెందుకు? పదయ్యాక పెళ్లి చేసి పంపక’ వంటి సలహాలు నా చెవిన పడకుండా అడ్డుగోడగా నిలిచావు.
ఇవన్నీ తెలుసు. అయినా ఏం చేశా.. నాలుగు రాళ్లు సంపాదించగానే అన్నీ తెలుసనుకున్నా! నా జీవితాన్ని నేనే తీర్చిదిద్దేసుకుందామనుకున్నా. ఆ అమాయకత్వం సుడిగుండంలోకి నెట్టేస్తోంటే.. అప్పుడూ నువ్వే అండయ్యావు. నా తప్పులు మన్నించి నీ గుండెలో దాచుకున్నావు. బాధని దించి ఓదార్పునిచ్చావు.
‘అందరితో కలిసిపోతావు’ అని అత్తింటి వాళ్లు అన్నా.. ‘చక్కగా పనిచేస్తా’వన్న పైవాళ్ల మెప్పయినా చిన్నతనం నుంచీ నువ్వు బతిమాలో, కన్నెర్ర చేసో నేర్పినవాటి ఫలితమే.
వేసుకునే దుస్తుల నుంచి కట్టుకున్న భర్త వరకూ....అన్ని ఛాయిస్‌లూ నావే! ఎన్నింటికి నచ్చకపోయినా ‘నీ ఇష్టం’ అనుంటావు? ‘నీకేం తెలియద’ని కొట్టిపారేసినా గాయపడిన మనసును చిరునవ్వుతోనే కప్పేశావు.
పెన్ను పెడితే.. జ్ఞాపకాలన్నీ కళ్లముందు మెదులుతున్నాయి. ఇలా చెప్పుకొంటూ పోతే నా జీవితమే చాలదనిపిస్తోంది.
పాతికేళ్లు దాటినా పసిపిల్లగానే చూసే నీ ఆప్యాయతను అర్థం చేసుకోలేకపోయా.. క్షమిస్తావా అమ్మా?
ఇష్టమున్న చోట ఎంత కష్టమైనా పంటి బిగువున దాచుకోగలరని చెప్పడానికి నీకంటే గొప్ప ఉదాహరణ ఎవరుంటారు?
నీ ప్రేమకూ, త్యాగానికీ.. ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? మళ్లీ జన్మంటూ ఉంటే నీకు అమ్మనయ్యి సేవలు చేయడం తప్ప.. అయినా చెబుతున్నా.. థాంక్యూ అమ్మా!
- నీ గారాలపట్టి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.