ఈ ప్రవర్తనతో బాధించొద్దు...
ఎనిమిదేళ్ల గణేశ్‌కు తనపై తల్లి రోజంతా ఎందుకు కోపంతో అరుస్తుందో తెలీదు. అమ్మతో తనేం చెప్పినా వినడానికి ఎందుకు ఆసక్తి చూపించదో పదేళ్ల అనూరాధకు అర్థంకాదు.
ఎనిమిదేళ్ల గణేశ్‌కు తనపై తల్లి రోజంతా ఎందుకు కోపంతో అరుస్తుందో తెలీదు. అమ్మతో తనేం చెప్పినా వినడానికి ఎందుకు ఆసక్తి చూపించదో పదేళ్ల అనూరాధకు అర్థంకాదు. పిల్లలపై పెద్దవాళ్లు నిత్యం ఈ రకంగా ప్రవర్తిస్తున్నారంటే అది వారి మానసికనారోగ్యం కావొచ్చంటున్నారు నిపుణులు. తమ ప్రవర్తనను మార్చుకోకపోతే ఈ ప్రభావం పిల్లల భవిష్యత్తుపై పడే ప్రమాదం ఉందంటున్నారు.
ఇంట్లో ఆర్థికంగా లేదా భాగస్వామితో సమస్యలు పెద్దవాళ్లను ఒత్తిడి, ఆందోళనకు గురిచేస్తుంటాయి. వీలైనంత త్వరగా వీటి నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి. లేదంటే ఇవన్నీ చిక్కుముడులుగా మారి కుంగుబాటుకు గురి చేస్తాయి. ఈ ప్రభావంతో పిల్లలపై కోపాన్ని ప్రదర్శిస్తారు. అయితే తల్లిదండ్రుల సమస్యల గురించి చిన్నపిల్లలకు అవగాహన ఉండదు. దీంతో కారణం లేకుండా అమ్మానాన్న తమపై ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో తెలియక అయోమయానికి లోనవుతారు. తల్లిదండ్రుల దగ్గరకు రావడానికి కూడా భయపడి, నెమ్మదిగా ఒంటరితనానికి అలవడతారు. నలుగురితో కలవడానికి కూడా ఆసక్తి చూపించరు.
స్వేచ్ఛగా.. చిన్నారులను నియంత్రించే ధోరణిలో పెద్దవాళ్ల ప్రవర్తన కటువుగా ఉండకూడదు. చదువు లేదా స్నేహితుల విషయాల్లో వారి ఆలోచనలు, అభిప్రాయాలను చెప్పనివ్వాలి. మానసిక ఒత్తిడికి గురయ్యే తల్లిదండ్రులు తమ పిల్లలకు స్వేచ్ఛనివ్వరని పలు అధ్యయనాల్లోనూ తేలింది. దీనివెనుక పెద్దవాళ్ల భయాలు లేదా వారి ఆందోళనే కారణమంటారు నిపుణులు. పిల్లలేం చెప్పినా నమ్మనట్లుగా ప్రవర్తిస్తారు. దీంతో తమ ఆశయాలు, లక్ష్యాలను ఎవరితో పంచుకోవాలో తెలీక, అమ్మానాన్నను నమ్మించలేక పిల్లలు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. ఇది వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది.
వెనకబడకుండా.. మాటలతో పిల్లలను అవమానించకూడదు. వారిలోని లోపాలను నిత్యం ఎత్తిచూపే ప్రయత్నం చేయకూడదు. ఇలా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా మాట్లాడటం ఆ తల్లిదండ్రుల మానసికనారోగ్యాన్ని ప్రతిబింబించేవే అని చెబుతున్నారు నిపుణులు. ఇవన్నీ చిన్నారులను తీవ్రంగా బాధిస్తాయి. దీంతో వారు నైపుణ్యాలను పెంచుకోలేరు. ఆత్మనూన్యతకు గురై అందరికన్నా వెనకబడతారు. అలా కాకుండా పిల్లలను ప్రోత్సహించే బాధ్యత అమ్మానాన్నలదే. చిన్నప్పటి నుంచి వారి బలాలు, బలహీనతలను గుర్తించి తగిన చేయూతనిస్తే, అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. దీనికోసం తల్లిదండ్రులు తమ శారీరక, మానసికారోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరమెంతైనా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.