ఆకతాయితనం.. అదుపు చేద్దాం!

ఇరుగుపొరుగు ఇల్లాళ్లు ఓచోట కలిశారంటే చాలు. పిల్లల మీద ఎన్ని ఫిర్యాదులో! కూతురు ఒక డ్రెస్సు కోసం బీరువాలో దుస్తులన్నీ తీసి మంచం మీద పడేస్తుందని ఒకరంటే.. కొడుకు అల్మరల్లో వస్తువులన్నీ చిందరవందర చేస్తాడని ఇంకొకరు.

Published : 25 May 2023 00:10 IST

ఇరుగుపొరుగు ఇల్లాళ్లు ఓచోట కలిశారంటే చాలు. పిల్లల మీద ఎన్ని ఫిర్యాదులో! కూతురు ఒక డ్రెస్సు కోసం బీరువాలో దుస్తులన్నీ తీసి మంచం మీద పడేస్తుందని ఒకరంటే.. కొడుకు అల్మరల్లో వస్తువులన్నీ చిందరవందర చేస్తాడని ఇంకొకరు. వాళ్ల ఆగడాల కబుర్లు.. వినడానికి సరదాగా అనిపించినా.. పడేవారికే చిరాకు. అయితే పిల్లల్లో ఈ బాధ్యతారాహిత్యాలకు పెద్దలే కారణమంటున్నారు మనస్తత్వ నిపుణులు..

* పిల్లలనెందుకు కష్టపెట్టడం అని పనులన్నీ పెద్దలే చేస్తుంటే వాళ్లకిక అదే అలవాటైపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే.. ముందు నుంచీ చిన్న చిన్న పనులు చేయిస్తుండాలి.

* చిన్నారులకు ప్రేమ పంచాల్సిందే. కానీ గారాబం కాదు. ఎక్కడి నుంచి తీసిన వస్తువులు అక్కడే పెట్టడం ఐదారేళ్ల వయసులోనే నేర్పాలి. అదొక అలవాటుగా మారితే ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది, దేని కోసమూ వెతకక్కర్లేదు.

* దుస్తులు మడిచిపెట్టడం, ఇల్లు ఊడవటం, తుడవటం, అల్మరాలు దులపడం, భోజనాలయ్యాక బల్ల శుభ్రం చేయడం లాంటి పనులు చేయిస్తుండాలి. వీటి వల్ల చదువు నిర్లక్ష్యం చేస్తున్నామనో, అలసిపోతారనో అనుకోవడం పొరపాటు. అదీ వాళ్లకో వ్యాయామమే. పైగా ఇంటి పనులన్నీ తెలిసి ఉండటం అందరికీ, అన్ని విధాలా మంచిది.

* పిల్లలు స్కూలుకు వెళ్తున్నప్పుడు వండిన పదార్థాలను డబ్బాల్లో సర్దుకోవడం, సీసాలో మంచి నీళ్లు పట్టుకోవడం, షూస్‌ లాంటివి సిద్ధంగా పెట్టుకోవడం లాంటివన్నీ వాళ్లతోనే చేయించాలి. అన్నీ అమ్మానాన్నలే సమకూరుస్తుంటే వాళ్లకి బాధ్యత తెలిసిరాదు. ఇప్పుడంటే సెలవులు కాబట్టి, సైకిల్‌ కొనిచ్చి, రోజూ సాయంత్రాలు తొక్కమనండి. దాంతోపాటు కూరగాయలు, సరకులు కొనుక్కురావడం, వారానికోసారి వాళ్ల సైకిల్‌ని వాళ్లే తుడుచుకోవడం వంటివి చేయిస్తే ఆరోగ్యంతోపాటు బాధ్యతా అలవాటు అవుతుంది.

* మొక్కల పెంపకంలో ఆసక్తి కలిగించండి. రోజూ క్రమం తప్పకుండా నీళ్లు పోయడం, చుట్టూ పిచ్చి మొక్కలు మొలిస్తే తీయించడం లాంటి పనులు వాళ్లతో చేయించండి. క్రమశిక్షణతో పాటు ఒక మంచి పని చేస్తున్నామన్న సంతృప్తి సొంతమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్