పిల్లలకు వంటింటి పరిచయం...
చిన్నారులను వంటింట్లోకి రాకూడదంటూ భయపెట్టకూడదు. వారికేదైనా అపాయం జరుగుతుందని నిషేధాలు విధించకూడదంటున్నారు నిపుణులు. జాగ్రత్తలు చెబుతూ..
చిన్నారులను వంటింట్లోకి రాకూడదంటూ భయపెట్టకూడదు. వారికేదైనా అపాయం జరుగుతుందని నిషేధాలు విధించకూడదంటున్నారు నిపుణులు. జాగ్రత్తలు చెబుతూ.. ఆరోగ్యకరమైన ఆహారంపై వారిలో ఆసక్తిని పెంచాలని సూచిస్తున్నారు.
ఆహారం విలువలు తెలియడానికి, మంచి ఆహారపుటలవాట్లను చేసుకోవడానికి పిల్లలకు చిన్నప్పటి నుంచే వంటింటితో పరిచయం చేయాలి. వండేటప్పుడు వాటి వాసనలు, రుచి, రంగువంటి వాటిపై వారికి అవగాహన పెరుగుతుంది. కూరగాయల్లోని పోషకాలు, వాటివల్ల ఆరోగ్య ప్రయోజనాలనూ వివరించాలి. వాటినెలా పండిస్తారనేదీ తెలియజెప్పాలి. రోజూ మనం తినే ఆహారమెలా తయారవుతుందో చేసి చూపించాలి. తయారీకన్నా ముందు కూరగాయలన్నింటి గురించీ చెప్పాలి. వాటిలోని పోషకవిలువలు, ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తే ఆసక్తిగా తెలుసుకొంటారు.
పనులతో.. వంటింటి దినుసుల విలువలతోపాటు వాటినెలా వాడాలో చెప్పాలి. పొయ్యి దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ వివరించాలి. కూరగాయలపై మురికితోపాటు రసాయనాలనెలా శుభ్రం చేయాలో నేర్పించాలి. వాటిని కట్ చేసేటప్పుడు రక్షణగా చేతికి లేదా వేలికి గ్లవ్స్ ధరించమనాలి. ముందు చిన్నచిన్న పనులు నేర్పి, వారితో చేయించాలి. కూరగాయలు, పండ్లపై తొక్కలు తీయించడం, చిక్కుడు, బీన్స్, ఉడికించిన గుడ్లు ఒలవడం వంటివి నేర్పాలి. దీంతో నైపుణ్యాలు పెంచుకోవడమే కాదు, వారి ఒత్తిడీ దూరం అవుతుంది. అలా క్రమంగా రుచిగా వండటం, ప్రేమగా అందరికీ వడ్డించడం నేర్చుకుంటారు.
పరిశుభ్రత.. వంటింట్లోకి అడుగుపెట్టేటప్పుడు పరిశుభ్రత ప్రాముఖ్యత చెప్పాలి. చేతులను బాగా శుభ్ర పరుచుకోకపోతే దానివల్ల బ్యాక్టీరియా ఆహారంలోకి చేరే ప్రమాదముందని వివరించాలి. కూరగాయలు కోసే పీట, ఉపయోగించే కత్తి వంటివన్నీ శుభ్రం చేసిన తర్వాత జాగ్రత్తగా వినియోగించడం నేర్పాలి. అలాగే వంటగదిలో వేడి వస్తువులు, పదార్థాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ చిన్నారులకు వివరించాలి. అప్పుడే పిల్లలు చిన్నప్పటి నుంచి వంటింటి నైపుణ్యాలను పెంచుకోగలుగుతారు. మగ పిల్లలకూ వంట, పనులు నేర్పితే వాళ్లకూ లింగ వివక్షా భావనా ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.