క్షమాపణ చెప్పాలా?

ఎంత అన్యోన్యంగా ఉండే దంపతులైనా చిన్నా చితకా గొడవలు మామూలే. అయితే కొన్నిసార్లు తప్పు తమదే అయినా ఇగోలతో క్షమాపణ చెప్పాలనుకోరు కొందరు.

Published : 04 Jun 2023 00:20 IST

ఎంత అన్యోన్యంగా ఉండే దంపతులైనా చిన్నా చితకా గొడవలు మామూలే. అయితే కొన్నిసార్లు తప్పు తమదే అయినా ఇగోలతో క్షమాపణ చెప్పాలనుకోరు కొందరు. ఇలా చేస్తే అందమైన బంధంలో అనవసర పొరపొచ్చాలు ఏర్పడతాయి కదా! అనుబంధాన్ని దూరం చేసే ఈ తప్పు చేయొద్దు అంటున్నారు నిపుణులు.

స్వరం పెంచొద్దు.. మాటల్లో క్షమాపణ కోరడం తెలియదా.. చేతల్లో చూపించండి. అంతేగానీ పేరుకు మాత్రం అడగొద్దు. అయిష్టంగా, ఏదో చెప్పాలన్నట్లు చెప్పిన సారీ ఇద్దరి మధ్యా తగవులకే దారితీస్తుంది. అలాగే కోరగానే క్షమాపణ దొరికేస్తుందనీ ఆశించొద్దు. అవతలివారు బెట్టు చేసినా శాంతంగా ఉండాలే కానీ.. అరవొద్దు. చిన్న స్వరంతో మాట్లాడండి. ప్రేమగా.. మీ నిజాయతీని జోడించి చెప్పండి.. కోపం కరగడం ఖాయం.

సిద్ధం కండి.. గిల్లికజ్జాల తర్వాత ఒక్కోసారి అనుకోకుండా చేసే చిన్న తప్పిదం, జారే మాట కూడా గొడవని పెద్దది చేయగలదు. కాబట్టి.. క్షమాపణ చెప్పాలి అనుకోగానే ఎదురుగా వెళ్లి మాట్లాడేయొద్దు. ఏం మాట్లాడాలి.. భాగస్వామిని ఎలా చల్లబరచాలనేది మనసులోనే మననం చేసుకోండి. నేరుగా మాట్లాడలేకపోతే లెటర్‌గా రాయండి. లేదూ వీడియో తీసి పంపండి. వాళ్లకి నచ్చిన బహుమతో, పూలనో చేరిస్తే.. మీ సిన్సియారిటీ తప్పక అర్థమవుతుంది. మీ భాగస్వామీ మిమ్మల్ని తేలిగ్గా క్షమించేస్తారు.

ఆ తీరే వద్దు.. కొన్నిసార్లు మీ భాగస్వామి చేసే పనుల వల్ల మీకు బాధ కలగచ్చు. అది ఏదో సమయంలో ఇలా బయటపడొచ్చు. చిన్న చిన్న విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటే ఈ సమస్య ఉండదు. మనసులో దాచుకుంటూ వస్తే.. ఏదోరోజు బయటపడుతుంది. అవతలి వారి మనసుని గాయం చేస్తుంది. ఇలాంటివి తిరిగి జరగొద్దంటే.. ఇబ్బందిని ఎప్పటికప్పుడు పంచుకోండి. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకునే మార్గాలను వెతకండి. అప్పటి తగాదా పరిష్కారమవడమే కాదు.. భవిష్యత్తు గొడవలకీ అడ్డుకట్ట వేసినవారు అవుతారు. మీ సంసార జీవితమూ ఆనందంగా సాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని