రజస్వల కావడం లేదు.. ఇది సమస్యేనా?

మా అమ్మాయికి 13 ఏళ్లు. బరువు 32 కేజీలు, ఎత్తు 134 సెం.మీ. సరిగా తిండి తినదు. సన్నగా ఉంటుంది. తరచూ జబ్బుపడుతోంది. ఈమె తోటివాళ్లందరూ 11 ఏళ్లకే రజస్వల అయ్యారు. తను ఇంకా కాలేదు. తెలిసినవాళ్లంతా పోషకాహార లోపమే కారణమంటున్నారు.

Updated : 18 Aug 2023 23:13 IST

మా అమ్మాయికి 13 ఏళ్లు. బరువు 32 కేజీలు, ఎత్తు 134 సెం.మీ. సరిగా తిండి తినదు. సన్నగా ఉంటుంది. తరచూ జబ్బుపడుతోంది. ఈమె తోటివాళ్లందరూ 11 ఏళ్లకే రజస్వల అయ్యారు. తను ఇంకా కాలేదు. తెలిసినవాళ్లంతా పోషకాహార లోపమే కారణమంటున్నారు. ఇది సమస్యేనా? తనకేం పెట్టాలి.

- రాజ్యలక్ష్మి, తెనాలి

మీ అమ్మాయి వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేదు. కౌమార దశలో బలమైన, పోషక భరితమైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే శారీరకంగా వచ్చే మార్పులను తట్టుకునే శక్తి వస్తుంది. ముందు మీ అమ్మాయితో సఖ్యతగా మాట్లాడండి. సరిగా తినకపోడానికి కారణాన్ని అడిగి తెలుసుకోండి. తిన్నది రుచించడం లేదా? తక్కువ తిన్నా కడుపు నిండిపోతోందా? జీర్ణ సంబంధిత సమస్యలు ఏవైనా ఎదురవుతున్నాయా అన్నది కనుక్కోండి. ఇతరత్రా అనారోగ్య సమస్యలేవీ లేకుండా ఆకలి మందగిస్తోందంటే తొందరగా జీర్ణమయ్యే పదార్థాలను పెట్టండి. అల్పాహారంలో అటుకులు, వేరుసెనగలు, మొలకెత్తిన రాగులను పిండిగా చేసి దోశ, ఇడ్లీ, బెల్లం, నెయ్యి వేసి జావలా చేసి ఇవ్వొచ్చు. మధ్యాహ్నం పనీర్‌ పరోటా, శాండ్‌విచ్‌, బ్రెడ్‌ ఆమ్లెట్‌, ఎగ్‌ రైస్‌, కిచిడీ ఉండేలా చూసుకోండి. రాత్రుళ్లు ఆలూ, పనీర్‌, పరోటా, చపాతీ, పుదీనా, టొమాటో, రాజ్మా రైస్‌ లాంటివి పెట్టండి. మధ్యలో వీలున్నప్పడు పండ్ల రసాలు, వేయించిన బాదం, ఖర్జూరం, పండ్ల ముక్కలు, లస్సీ లాంటివి ఇవ్వండి. దీని ద్వారా శరీరానికి అవసరమయ్యే మాంసకృత్తులు, ప్రొటీన్లు, పోషకాలు అందుతాయి. ఆమె బరువు పెరగడానికి ఇవి సరిపోతాయి. ఇకపోతే రజస్వల అనేది 11 నుంచి 16 ఏళ్లలోపు ఎప్పుడైనా కావొచ్చు. శరీర ఎదుగుదల, వంశపారంపర్యం ఇలా ఏదైనా కారణం కావొచ్చు. హిమోగ్లోబిన్‌ శాతం ఎంతుందో కూడా చూసుకొని గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని