బుజ్జాయిలను ఫుడీగా మార్చాలంటే..!

ఏడాది నిండుతున్న బుజ్జాయిలకు ఆహారాన్ని అందించడమనేది ప్రతి తల్లికీ ఒక సవాలే. పోషకాలతో చిన్నారుల పొట్టనెలా నింపాలని సతమతమయ్యే తల్లులకు నిపుణులు కొన్ని సూచనలిస్తున్నారు. బుజ్జాయిని ఫుడీగా ఎలా మార్చొచ్చనేదీ వివరిస్తున్నారు.

Published : 22 Jun 2024 01:45 IST

ఏడాది నిండుతున్న బుజ్జాయిలకు ఆహారాన్ని అందించడమనేది ప్రతి తల్లికీ ఒక సవాలే. పోషకాలతో చిన్నారుల పొట్టనెలా నింపాలని సతమతమయ్యే తల్లులకు నిపుణులు కొన్ని సూచనలిస్తున్నారు. బుజ్జాయిని ఫుడీగా ఎలా మార్చొచ్చనేదీ వివరిస్తున్నారు.

ఆహారంలో ఏదో ఒకటి కాకుండా ఆరోగ్యాన్నిచ్చేవాటిని పిల్లలతో ఎలాగైనా తినిపించాలనే ప్రయత్నంలో చిన్నారులు అయిష్టపడుతున్నా కూడా తినిపిస్తారు. కానీ ఈ పద్ధతి సరైనది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల భోజనంపై పూర్తిగా ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరికొందరైతే, ఆహారాన్ని మెత్తగా చేసి పిల్లలకు బలవంతంగా అందిస్తారు. ఈ విధానం కూడా తప్పే అంటున్నారు. ఇలా చేస్తే నమలడమనే ప్రక్రియ పిల్లలకు పరిచయం కాదు. మింగేస్తుంటారు. కొత్తగా దంతాలొస్తున్న ఆ వయసులో చిన్నారులు వాటిని ఉపయోగించకపోవడంతో ఆహారంతో లాలాజలం కలవక జీర్ణసమస్య ఎదురవుతుంది. ఇలా మెత్తగా చేసిచ్చే ఆహారంలో పీచు, పోషకాలు అందక, మెరుగైన జీర్ణశక్తిని కోల్పోతారు.

సహనంతో తినిపించాలి...

పోషకాహారంవైపు చిన్నారులను అడుగులేయించడంలో కాస్తంత సహనాన్ని పాటించాలి. అలాకాకుండా ఆసక్తిగా తింటున్నారని అదే రకమైన ఆహారాన్ని ప్రతి రోజూ అందిస్తే పిల్లలు దానివైపు కన్నెత్తికూడా చూడరు. అప్పుడు మరొక కొత్తరకాన్ని తినిపించడానికి ప్రయత్నించినా అయిష్టత ప్రదర్శిస్తారు. ఈ దశనే వైద్యులు ‘నియో ఫోబియో’ అంటున్నారు. కొత్త ఆహారాలపై ఉండే ఈ భయాన్ని దాటించడానికి పెద్దవాళ్లు ప్రయత్నిస్తూనే ఉండాలి. సలాడ్స్‌ చేసేటప్పుడు వారినీ భాగస్వాములను చేయాలి. పండ్లతో రకరకాల ఫుడ్‌ ఆర్ట్‌ నేర్పించాలి. చిన్న మొత్తంలో అందించాలి. ఇవన్నీ వాళ్లలో ఆహారంపై ఆసక్తిని పెంచుతాయి.

రంగులమయంగా కనిపించాలి...

ఆహారంపై ఆసక్తిని పెంచాలంటే వాళ్లెదుట ఉంచే బౌల్‌ లేదా ప్లేటు ఆకర్షణీయంగా ఉండాలి. భోజనం ప్లేటులో  స్ట్రాబెర్రీలు, ఉడికించిన క్యారెట్‌ వంటివి వాళ్లకు కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. ప్లేటుతోపాటు చుట్టూ వాతావరణం కూడా ప్రోత్సహించేలా ఉండాలి. కుటుంబసమేతంగా భోజనం చేయాలి. పిల్లలు వాళ్ల తల్లిదండ్రులను ఎక్కువగా అనుకరిస్తుంటారు. అందుకే వాళ్లెదుట పెద్దవాళ్లు పోషకాలున్న ఆహారానికి ప్రాధాన్యతనిస్తూ, వాటిని ఆస్వాదిస్తూ తీసుకోవాలి. వాటి రుచిని మాటల్లో చెబుతుండాలి. ఇవన్నీ చిన్నారులను తప్పక ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే ఫుడీగా మారుస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్