పిల్లలకు ఈ నైపుణ్యాలున్నాయా..!

ఎనిమిదేళ్ల రాజీవ్‌ను తల్లి తన స్నేహితులు, బంధువులింటికి తీసుకెళుతుంటుంది. ఇంట్లో సాధారణంగానే ఉండే తను, తీరా బయటకెక్కడికెళ్లినా ఎక్కువగా మాట్లాడటం లేదా అక్కడ తన అల్లరితో వస్తువులన్నీ చిందరవందర చేస్తుంటాడు.

Published : 05 Jul 2024 02:07 IST

ఎనిమిదేళ్ల రాజీవ్‌ను తల్లి తన స్నేహితులు, బంధువులింటికి తీసుకెళుతుంటుంది. ఇంట్లో సాధారణంగానే ఉండే తను, తీరా బయటకెక్కడికెళ్లినా ఎక్కువగా మాట్లాడటం లేదా అక్కడ తన అల్లరితో వస్తువులన్నీ చిందరవందర చేస్తుంటాడు. ఇంట్లో మాత్రమే కాదు, బయట కూడా ప్రవర్తనానైపుణ్యాలను పిల్లలకు అలవడేలా చేయాలంటున్నారు నిపుణులు.

  • పిల్లలని ఎక్కువగా గ్రూపు యాక్టివిటీస్‌లో పాల్గొనేలా చేయాలి. చదువుకు భంగం కలుగుతుందంటూ పిల్లలను ఇంట్లోనే బంధించకూడదు. తోటివారితో కలిసే పిల్లల్లో సామాజికపరమైన నైపుణ్యాలు పెరుగుతాయంటోంది ‘అబ్‌నార్మల్‌ చైౖల్డ్‌ సైకాలజీ’ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం. వారాంతాల్లో జరిగే యాక్టివిటీస్‌లో క్రమం తప్పకుండా పిల్లలు ఉండేలా చేయాలి.
  • తోటిపిల్లలతో క్రికెట్, సైక్లింగ్, రన్నింగ్, గాలిపటాలు ఎగురవేయడం వంటివి ఆడినప్పుడు క్రమశిక్షణ మాత్రమే కాదు, అందరితో కలిసి ఉన్నప్పుడు సమయ పాలన, సమయస్ఫూర్తి పిల్లలు నేర్చుకుంటారు. గుంపులో తనూ ఒకరుకావడమే కాదు, వారందరినీ తనతో కలుపుకోవడం వల్ల కలిగే సంతృప్తి అంటే ఏంటో అర్థం చేసుకుంటారు. ఇదే వారికి ఎక్కడ, ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్పుతుంది. 
  • స్కూల్‌ లేదా మైదానంలో కొత్తగా కలిసినవారితో తమని తాము పరిచయం చేసుకోవడం, వారితో కలిసి చదవడం లేదా ఆడుకోవడమెలాగో చెప్పాలి. పేరెంట్‌ మీటింగ్స్‌లో అందరితో పరిచయాలు చేసుకోవడం, చేయి కలిపి ఎదుటివారితో నవ్వుతూ మాట్లాడటం వంటివి పెద్దవాళ్లు చేస్తే, వారి నుంచి పిల్లలూ నేర్చుకుంటారు. మంచి స్నేహితులను సంపాదించుకోవడానికి ఇది దోహదపడుతుంది.
  • ఆటలో గెలిచినవారిని ప్రశంసించడం, తాము ఓడిపోయినా తిరిగి ప్రయత్నించొచ్చనే సానుకూలతను పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. దీంతో గెలుపొందినవారిపై ద్వేషం, అసూయవంటివి ప్రదర్శించరు. అలాగే ఇతరులు చెప్పేది పూర్తిగా వినడం పిల్లలకు నేర్పించాలంటే ముందు వాళ్లు చెప్పేది తల్లిదండ్రులు శ్రద్ధగా వినాలి. అప్పుడే పిల్లలు కూడా ఆ నైపుణ్యాన్ని అలవరుచుకుంటారు. 
  • పుట్టినరోజు వంటి సందర్భాల్లో స్నేహితులందరినీ పిలవడం నేర్పాలి. ఆ పార్టీలో ఇంటికొచ్చినవారితో ఎలా మెలగాలో తెలుసుకుంటారు. ఇతరుల పట్ల మర్యాదపూర్వకమైన ప్రవర్తన, ప్లీజ్, సారీ వంటి పదాల వినియోగం అలవడుతుంది. ఇలాంటి సత్ప్రవర్తన వారికి భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకొనేలా చేస్తుంది.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్