అమ్మమ్మ, నానమ్మలకూ భత్యం..!

ప్రసవ వేదన పడేది అమ్మే అయినా... ఆ తరవాత ఆమెతోపాటు పుట్టిన పాపాయి సంరక్షణ బాధ్యత పడేది బామ్మలపైనే! బిడ్డ ఆలనాపాలనా ఎలా చూడాలో ఆ తల్లికి దగ్గరుండి నేర్పిస్తారు.

Published : 07 Jul 2024 02:12 IST

ప్రసవ వేదన పడేది అమ్మే అయినా... ఆ తరవాత ఆమెతోపాటు పుట్టిన పాపాయి సంరక్షణ బాధ్యత పడేది బామ్మలపైనే! బిడ్డ ఆలనాపాలనా ఎలా చూడాలో ఆ తల్లికి దగ్గరుండి నేర్పిస్తారు. ఇక అమ్మ ఉద్యోగిని అయితే ఆ తరవాతా చిన్నారి పెంపకం బాధ్యత తీసుకునే అమ్మమ్మ, నానమ్మ, తాతలూ ఎందరో! మరి ఆ సేవకు మనమేం ఇస్తున్నాం? స్వీడన్‌ ప్రభుత్వం ఇదే ఆలోచించింది. దీని గురించి ఏకంగా ఓ చట్టమే తీసుకొచ్చింది.

ద్యోగినులకు ప్రసూతి సెలవులు ఉంటాయి. బిడ్డతో అనుబంధం పెరగాలని తండ్రులకీ సంస్థలు పితృత్వ సెలవులు ఇస్తున్నాయి. స్వీడన్‌లో అయితే ఇవి ఏకంగా 480 రోజులు లేదా దాదాపు 16 నెలలు. వీటిలో వారి జీతం ఆధారంగా 390 రోజులకు భత్యమూ ఇస్తారు. ఇక మిగిలిన 90కి రోజుకు 180 క్రోనార్లు (17డాలర్లు) చొప్పున చెల్లిస్తారు. ఇంకా పిల్లలకు ఎనిమిదేళ్లు వచ్చేవరకూ అమ్మానాన్నలు పనివేళలు తగ్గించుకునే వీలు అదనం. ప్రభుత్వోద్యోగులకైతే ఈ అవకాశం పిల్లలకు 12ఏళ్లు వచ్చేవరకూ ఉంటుంది. అయితే ఈ ప్రయాణంలో బామ్మ, తాతల బాధ్యతనీ గుర్తించింది స్వీడన్‌ ప్రభుత్వం. అందుకే వారికీ సెలవులు, భత్యాన్ని అందించాలని ప్రభుత్వం ఓ ప్రతిపాదనను తీసుకొచ్చింది. అయితే ఇవి బిడ్డ తల్లిదండ్రుల నుంచి బదిలీ అవుతాయి. ఈ ప్రతిపాదనకు అక్కడి పార్లమెంట్‌ కూడా ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం... జంట అయితే 45, సింగిల్‌ పేరెంట్‌ అయితే 90 రోజులను చిన్నారి అమ్మమ్మ, నానమ్మ, తాతలకు బదిలీ చేయొచ్చు. అయితే పాపాయి పుట్టిన ఏడాదిలోపు కనీసం మూడునెలలు సంరక్షణ బాధ్యతలు తీసుకున్న బామ్మ, తాతలకే ఇవి వర్తిస్తాయి. అసలు కంటే వడ్డీ ముద్దంటూ మరీ మరీ మురిపెంగా మనమలను పెంచుకునే బామ్మా తాతలను ఇలా గుర్తించడం అభినందనీయమే కదూ! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్