Updated : 08/06/2021 06:20 IST

ఆ సమస్య... కోట్ల వ్యాపారాన్ని సృష్టించింది

‘తిండి, ఆరోగ్యంపై నువ్వస్సలు దృష్టిపెట్టట్లేదు’ అని వాళ్లమ్మ పోరు పెట్టేది. తనూ అందరి లాగే విని ఊరుకునేది. కానీ ఆ అమ్మాయికి పీసీఓడీ అని తేలింది. ఈ సమస్యను మందులతో కాకుండా సహజ ఆహారంతో పరిష్కరించే ప్రయత్నం చేద్దామంది వాళ్లమ్మ. ఈసారి ఆమె మాట వింది. తన ఆరోగ్యంలో మార్పు వచ్చింది. దాన్నే ఇతరులకూ అందించాలనుకుని ఓ సంస్థను ప్రారంభించింది. చివరకు ఫోర్బ్స్‌ జాబితాకెక్కింది. అదీ ఏడాదిలోనే! ఇదంతా విభా హరీష్‌... గురించి!

విభా హరీష్‌ తొమ్మిదేళ్లవరకూ ఆస్ట్రేలియాలో పెరిగింది. ఆపై వాళ్ల కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేసి, ఏరోస్పేస్‌ రంగంలో ఉద్యోగం సంపాదించింది. అది సంతృప్తినివ్వలేదు. దాన్ని వదిలేసి, తన కుటుంబానికి ఉన్న ఆన్‌లైన్‌ క్రాఫ్ట్స్‌ సరఫరా వ్యాపారంపై దృష్టిపెట్టింది. ఈ-కామర్స్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ మొదలైనవి విభానే చూసుకునేది. తన నేతృత్వంలో అది కొద్ది కాలంలోనే 300% వృద్ధి సాధించింది.

కారణమిదీ!
తనకు పీసీఓడీ ఉంది. స్టిరాయిడ్లు, సర్జరీలపై ఆధారపడటం ఇష్టం లేదు. వాళ్ల అమ్మ కూడా సహజ పదార్థాలతో ప్రయత్నించమని సలహా ఇచ్చింది. ఆమె హోమియో డాక్టర్‌. ఇంటి నుంచే ప్రయత్నిద్దామని ప్రోత్సహించింది. అప్పటి నుంచి విభా హెర్బ్స్‌, ఆహారం మీద దృష్టిపెట్టింది. పరిశోధనలు చేసి వాటినే తీసుకునేది. వ్యాయామం, నిద్రకూ ప్రాధాన్యమిచ్చింది. కొద్ది రోజుల్లోనే పరిస్థితి మెరుగైంది. తన సమస్య పరిష్కారం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెర్బ్స్‌పై పరిశోధనను కొనసాగించింది.

‘మొక్కలు, వాటి ప్రభావాల గురించి తెలుసుకుంటుంటే ఆశ్చర్యం వేసేది. వీటిని అందరితో పంచుకోవాలనిపించేది. మార్కెట్‌లో వాటి గురించి వెతికాను. అందానికీ, ఆకృతికీ తప్ప ఏవీ ఆరోగ్యంపై దృష్టిపెట్టడం లేదనిపించింది’ అని వివరించింది 25 ఏళ్ల విభా. ఆరోగ్యాన్నిచ్చే సహజ ఉత్పత్తులను అందరికీ చేరువ చేయాలనుకుంది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే.. కాస్‌మిక్స్‌.

ఆరు రకాలుగా..
దీని మీద విస్తృతంగా అధ్యయనం చేసింది. ఎక్కువ శాతం మంది ఎదుర్కొంటున్న సమస్యలను గమనించింది. ఆరింటికి ఫార్ములేటెడ్‌ మిక్సెస్‌- హెల్దీ హెయిర్‌, ఆల్‌ డే ఎనర్జీ, హ్యాపీ గట్‌, ఫీల్‌ గుడ్‌ స్కిన్‌, స్లీప్‌ లైక్‌ ఎ బేబీ, స్ట్రాంగ్‌ ఇమ్యూనిటీ పేర్లతో అందిస్తోంది. ఈ ఉత్పత్తులన్నీ విటమిన్లు, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన మొక్కలు, హెర్బ్స్‌, బెర్రీస్‌లతోనే తయారు చేస్తారు. రసాయనాల ఊసే ఉండదు. అవసరమైన వారు గోరు వెచ్చని నీరు, ఇతర ఆహార పదార్థాలతో కలిపి వీటిని తీసుకునేలా రూపొందించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పరిశోధనా బృందాన్నీ ఏర్పాటు చేసుకుంది. ఇందులో అందరూ మహిళలే ఉంటారు! ‘ఒక ప్రొడక్ట్‌ అభివృద్ధి చేశాక ముందు ఓ 50, 60 మందిపై ప్రయత్నిస్తాం. ఫలితం సానుకూలంగా ఉంటేనే మార్కెట్‌లోకి విడుదల చేస్తాం. అవసరమైతే మార్పులను చేసి, మళ్లీ పరీక్షిస్తాం. వీటిపై పూర్తి పట్టు పెంచుకోవడానికి హెర్బాలజీ కోర్సునూ చేస్తున్నాను’ అంటోంది విభా.

ఉత్పత్తులను ఆన్‌లైన్‌ వేదికగా అమ్ముతోంది. చాలా తక్కువమంది టీమ్‌తో దీన్ని నడిపిస్తోంది. వెబ్‌ డెవలపర్‌, డాక్టర్‌, న్యూట్రిషనిస్ట్‌, వెబ్‌ డిజైనర్లు మొత్తం ఆడవాళ్లే. తనతోపాటు ఇంకొకరు ప్యాకింగ్‌, పార్శిల్‌ చేయడాన్ని చూసుకుంటున్నారు. మార్కెటింగ్‌నూ తనే చూసుకునేది. ‘మా ఉత్పత్తుల్లో ఏ మ్యాజిక్కూ లేదు. వారంలోనో, పది రోజుల్లో సమస్య తగ్గిపోతుందనే హామీనీ నేను ఇవ్వలేను. ఇదే విషయాన్ని మా కస్టమర్లకు చెబుతూ వచ్చాను. దీంతో వాళ్లూ ఒక్కసారిగా ఆశలేమీ పెట్టుకోలేదు. నెమ్మదిగా ప్రయత్నించి పరిశీలించారు. నమ్మకం వచ్చాక కొనసాగించడం మొదలుపెట్టారు’ అంటుంది విభా. 2019 డిసెంబరులో ప్రారంభమైన ఈ సంస్థ ఏడాదిలోనే రూ.2 కోట్ల టర్నోవర్‌ను అందుకుంది. అందుకే ఫోర్బ్స్‌ ఈమెను ‘30 అండర్‌ 30’ జాబితాలో చేర్చింది. అన్నట్టూ విభాకు వ్యాపారమే కాదు.. సేవ కూడా తెలుసు. తన లాభాల్లో కొంత వెచ్చించి ఎనర్జీ బార్‌లను తయారు చేయిస్తోంది. వాటిని కర్ణాటకలోని కొన్ని అంగన్‌వాడీ స్కూళ్ల ద్వారా వందల మంది గ్రామీణ పిల్లలకు అందిస్తోంది. రేపటి పౌరులు ఆరోగ్యంగా ఎదగాలన్నది తన ఆకాంక్ష.

మంచిమాట

భయమే ఓ జైలు లాంటిది. అది లేకుండా ఉండటమే నిజమైన స్వేచ్ఛ/స్వాతంత్య్రం.

- ఆంగ్‌సాన్‌ సూకీ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని