పేదలకు గూడు... ప్రకృతికి తోడు!

బాగా చదువుకుని విదేశాల్లో స్థిరపడాలన్నది చాలామంది కల. ఈమె మాత్రం విదేశీ ఉద్యోగాన్ని వదిలి మరీ స్వదేశానికి వచ్చేసింది. పర్యావరణ రక్షణతోపాటు పేదలకు ఇళ్లు లక్ష్యంగా పనిచేస్తోంది. అందుకు వ్యవసాయ వ్యర్థాలను ఎంచుకుంది. ఆమే శృతి పాండే! శృతి పాండే యూఎస్‌లోని న్యూయార్క్‌ యూనివర్సిటీ నుంచి కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేసి, మంచి ఉద్యోగాన్నీ సాధించింది....

Published : 12 Jun 2021 01:11 IST

బాగా చదువుకుని విదేశాల్లో స్థిరపడాలన్నది చాలామంది కల. ఈమె మాత్రం విదేశీ ఉద్యోగాన్ని వదిలి మరీ స్వదేశానికి వచ్చేసింది. పర్యావరణ రక్షణతోపాటు పేదలకు ఇళ్లు లక్ష్యంగా పనిచేస్తోంది. అందుకు వ్యవసాయ వ్యర్థాలను ఎంచుకుంది. ఆమే శృతి పాండే!

శృతి పాండే యూఎస్‌లోని న్యూయార్క్‌ యూనివర్సిటీ నుంచి కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేసి, మంచి ఉద్యోగాన్నీ సాధించింది. పేదవారికి ఏదైనా చేయాలన్నది ఆమె కల. కొలువుకు స్వస్తి పలికి స్వదేశానికి చేరుకుంది. తక్కువ ఖర్చుతో ఇళ్లను అందించాలనుకుంది.
ఏడాది పాటు దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోనే గడిపింది.. శృతి పాండే. పెరుగుతున్న కాలుష్యం, వనరుల తగ్గుదలను గమనించింది. ఆ సమయంలో ఎకోపేన్లీ అనే యూరోపియన్‌ సంస్థ గురించి తెలుసుకుంది. వీళ్లు జొన్న గడ్డిని రీసైక్లింగ్‌ చేసి నీటి అవసరం లేని కన్‌స్ట్రక్షన్‌ ప్యానెల్స్‌తో భవనాలను రూపొందిస్తున్నారు. అదే విధానాన్ని మన దగ్గరా ప్రవేశపెట్టాలనుకుంది.
‘దేశంలో ఏటా 94-96 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వరిగడ్డిని తగల బెడుతున్నారు. దీని వల్ల పర్యావరణానికి హానితోపాటు సహజ వనరుల వృథా కూడా. అందుకే వీటితో కన్‌స్ట్రక్షన్‌ ప్యానెల్స్‌ను తయారు చేయాలనుకున్నాను. పైగా రైతులకూ కొంత ఆదాయమూ వస్తుంది’ అంటోంది 29 ఏళ్ల శృతి. అలా 2018లో ‘స్ట్రాక్చర్‌ ఎకో’ పేరిట సంస్థను ప్రారంభించింది. రైతులకు కొంత మొత్తం చెల్లించి వ్యవసాయ వ్యర్థాలను సేకరించి, వాటితో ఫైబర్‌ ప్యానెల్స్‌ను తయారు చేసి, ఓ ఇంటిని కట్టింది. మంటలు, విపరీతమైన గాలులు, వానలకు తట్టుకునేలా వందేళ్లపాటు నివాసయోగ్యంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దింది. ఇదే పద్ధతిలో పట్నాలో ఎన్‌జీవోకు కొవిడ్‌ ఆసుపత్రిని నిర్మించి ఇచ్చింది. 100 పడకల సామర్థ్యమున్న దీన్ని కేవలం 86 రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. భోపాల్‌ అంగన్వాడీ ప్రాజెక్ట్‌ కింద మహిళా హౌజింగ్‌ ట్రస్ట్‌కు భవనాలు, ఆరు విభాగాలతో బత్రా హాస్పిటల్‌లనూ ఇలానే పూర్తిచేసింది. ఈమె అనుసరిస్తున్న విధానాలకు యూపీ ప్రభుత్వ గుర్తింపు దక్కింది. గత ఏడాది న్యూయార్క్‌ ఎన్‌జీఓ నుంచి ‘క్లైమేట్‌ ఫెలో’ అవార్డుతోపాటు నగదు బహుమతీ పొందింది. ఫోర్బ్స్‌ ఆసియా నుంచి 30 అండర్‌ 30 అఛీవర్స్‌ 2021 జాబితాలోనూ ఎంపిక అయ్యింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ ఫెలోషిప్‌నూ దక్కించుకుంది. ‘ప్రస్తుతం నా దగ్గర 10-12 మంది పనిచేస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది అమ్మాయిలకు అవకాశం కల్పించాలన్నది నా కల. కానీ ఈ రంగంలో చాలా తక్కువమంది ఉన్నారు. వారికి అవగాహన కలిగించి, ఈ దిశగా ప్రోత్సహించాలనుకుంటున్నా’ అని చెబుతోంది శృతి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్